ఈవీఎం గోదాముల ఆకస్మిక తనిఖీ

346

గుంటూరు, మార్చి 6 (న్యూస్‌టైమ్): భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాసాంత తనిఖీలలో భాగంగా గుంటూరు ఆర్డిఓ కార్యాలయం ఆవరణలోని ఇవియం గోడౌన్‌ను, ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఇవియంలను భద్రపరచిన గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తనిఖీ చేసారు. గోడౌన్లకు వేసిన తాళాల సీల్డ్‌ను, గోడౌన్ల వద్ద ఉన్న అగ్నిమాపక పరికరాలను, సిసి కెమెరాలను, గార్డ్ డ్యూటీ లాగ్ బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులతో మాట్లాడుతూ సిసి కెమెరాల రికార్డింగ్‌ను తరచూ పరిశీలించాలని, సిసి కెమెరాలకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలన్నారు. ఆర్డిఓ కార్యాలయం ఆవరణలోని ఇవియం గోడౌన్ తాళాలకు వేసిన సీల్డ్ సక్రమంగా లేవని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మరొకసారి సీల్ వేయాలన్నారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డ్ లాగ్ బుక్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, దీనికి అవసరమైన స్టేషనరీని గార్డ్‌లకు అందించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఇవియంలు భద్రపరచిన గోడౌన్ వెలుపల అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక యంత్రాలను వినియోగించి మంటలను ఆర్పే విధానంపై గార్డ్‌లకు అగ్నిమాపక శాఖ అధికారులతో శిక్షణ అందించాలన్నారు. ఇవియం గోడౌన్ వద్ద డ్యూటీలో ఉన్న గార్డ్‌లకు కనీస సదుపాయాలు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే.శ్రీధర్ రెడ్డి, ఈవీఎం గోడౌన్ల నోడల్ ఆఫీసర్, అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వి శైలజ, గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, గుంటూరు పశ్చిమ తహశీలార్డు మోహన్ రావు, ఫిరంగిపురం డిప్యూటీ తహశీల్దారు ప్రవీణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ సునీల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.