పారదర్శకంగా పురపాలక ఎన్నికలు

453

గుంటూరు, మార్చి 5 (న్యూస్‌టైమ్): మునిసిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ మునిసిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కలక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, రాజకీయ పార్టీలు సహకారం అందించాయన్నారు. గత సంవత్సరం జారీ చేసిన మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుండే తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. అభ్యర్దుల నామినేషన్లు పూర్తి కావడంతో ఉప సంహరణ నుండి ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. గుంటూరు నగరపాలక సంస్థతో పాటు తెనాలి, పిడుగురాళ్ళ, మాచెర్ల, రేపల్లె, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి మునిసిపాలిటీలలో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. మొత్తం 290 వార్డులలో ఎన్నికలు నిర్వహించాల్సి వుండగా, నామినేషన్లు ఉప సంహరణ ముగిసే సమయానికి 85 వార్డ్స్ అన్ కంటెస్టేడ్ కావడంతో 205 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. మాచెర్ల, పిడుగురాళ్ళ మునిసిపాలిటీలలోని అన్ని వార్డులు అన్ కంటెస్టేడ్ అయ్యాయన్నారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 188 సమస్యాత్మక, 364 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో 763 మంది అభ్యర్దులు పోటీలో ఉన్నారన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణకు గుంటూరు నగరపాలక సంస్థతో సహా ఎన్నికలు జరిగే అన్ని మునిసిపాలిటీలలో మొత్తం 23 ఎంసిసి టీములను ఏర్పాటు చేసామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలులో భాగంగా 2842 బ్యానర్లు, 60 వాల్ పెయింటింగ్స్, 464 పోస్టర్లు తొలగించామని, 306 విగ్రహాలకు ముసుగులు వేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన క్రింద గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 8170 రూపాయలను, 111.81 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఫిర్యాదులు అందిన వెంటనే ఎంసిసి టీములు వెళ్లి అక్కడి సమస్యను పరిష్కరించి నివేదిక అందిస్తాయన్నారు. ప్రచార కార్యక్రమాల అనుమతుల మంజూరు కోసం ప్రతి మునిసిపాలిటీలోను సింగల్ విండో డెస్క్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో నూరు శాతం ఓటింగ్ జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. శుక్రవారం నుండి ఓటర్ స్లిప్‌లను బిఎల్ఓల ద్వారా పంపిణీ ప్రారంభించామని, నూరు శాతం ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీపై ర్యాండంమ్‌గా అధికారులు తనిఖీలు చేసేలా ఆదేశాలు జారీ చేసామన్నారు. ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో వుందో తెలుసుకునేందుకు ప్రతి వార్డు సచివాలయంలోను హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని రాజకీయ పార్టీలు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేయాలన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు తెలిపిన అంశాలపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రచార సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై షాడో పార్టీలు, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అభ్యర్దులను, రాజకీయ పార్టీలను వివరణ కోరుతూ రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రచార అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తుల క్రమంను బట్టి అనుమతులు మంజూరు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లు ఎక్కువగా ఉన్న కేంద్రాల వద్ద ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్ల రద్దీని నియంత్రించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గత ఎన్నికల్లో అనివార్య సంఘటనలు జరిగిన పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) ఎ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే. శ్రీధర్ రెడ్డి, మునిసిపల్ ఆర్డి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా అనురాధ, ఆర్డి ఓ భాస్కర్ రెడ్డి, అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ గంగాధర్, రూరల్ జిల్లా డిసిఆర్బి డిఎస్పీ జి. లక్ష్మయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.