‘పురం’లోనూ ఫ్యాన్ ప్ర‌భంజ‌నం

464

అమరావతి, మార్చి 5 (న్యూస్‌టైమ్): వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పట్ల రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ వ్యక్తమవుతోందని మరోసారి స్పష్టమైంది. పురపాలక ఎన్నికల్లోనూ వైయ‌స్ఆర్‌‌‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా ఘన విజయం సాధించనుందని దాదాపు తేటతెల్లమైపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

వైఎస్సార్‌సీపీ ఏకంగా 571 వార్డులు/డివిజన్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డులు/డివిజన్లకు గాను 578 వార్డులు/డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో ఏకంగా 571 వార్డులు/డివిజన్లలో వైయ‌స్ఆర్‌‌సీపీ అభ్యర్థులే గెలుపొందడం విశేషం. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులనూ వైయ‌స్ఆర్‌‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. రాయచోటి, పలమనేరు, నాయుడుపేట, ఆత్మకూరు (కర్నూలు జిల్లా), డోన్‌ మున్సిపాలిటీలలో మూడింట రెండొంతుల వార్డులు వైయ‌స్ఆర్‌‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. సూళ్లూరుపేట, కొవ్వూరు, తుని మున్సిపాలిటీల్లో సగం వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుని ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఖాయమని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఏకగ్రీవాల్లో వైయ‌స్ఆర్‌‌సీపీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబరిచి ప్రజాభిప్రాయం తమ పక్షమే అని పునరుద్ఘాటించింది.

మొత్తానికి, పురపాలక ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల్లో ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించింది. మొత్తం ఏకగ్రీవాల్లో 98.80 శాతం వైయ‌స్ఆర్‌‌సీపీ పరమయ్యాయి. తిరుపతిలో ఓ డివిజన్‌లో మళ్లీ నామినేషన్‌కు ఎన్నికల కమిషన్‌ అవకాశం ఇచ్చింది. దాంతో ఒకరు రీ నామినేషన్‌ వేశారు. కానీ రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ ఎన్నికల కమిషన్‌ ఇచి్చన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు 6 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థి ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 578 ఏకగ్రీవమైన వార్డులు/డివిజన్లలో 130 వార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానం సాధించగా, 120 వార్డులు/డివిజన్లతో వైయ‌స్ఆర్ ‌జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

పోలింగ్‌తో నిమిత్తం లేకుండానే 3 నగర పాలక సంస్థలు, 13 పురపాలక సంఘాలను వైయ‌స్ఆర్‌‌సీపీ దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. చిత్తూరు నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 37 ఏకగ్రీవంగా గెలుచుకుంది. తిరుపతి నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 21, కడప నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 23 డివిజన్లను వైయ‌స్ఆర్‌‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పులివెందుల (31), పుంగనూరు (31), పిడుగురాళ్ల (33), మాచర్ల (31) మున్సిపాలిటీలలో అన్ని వార్డులను వైయ‌స్ఆర్‌‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలో పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరమే లేదు.

రాయచోటిలో 34 వార్డులకు గాను 31, నాయుడుపేటలో 25 వార్డులకు గాను 23, పలమనేరులో 26 వార్డులకు గాను 18, డోన్‌లో 32 వార్డులకు గాను 22, ఆత్మకూరు (కర్నూలు జిల్లా)లో 24 వార్డులకు గాను 18, కొవ్వూరులో 23 వార్డులకు గాను 13, తునిలో 30 వార్డులకు గాను 15 వార్డులు వైయ‌స్ఆర్‌‌సీపీకి ఏకగ్రీవమయ్యాయి. సూళ్లూరుపేటలో 25 వార్డులకు గాను 15 వార్డుల్లో వైయ‌స్ఆర్‌‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైయ‌స్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 12 వార్డులను వైయ‌స్ఆర్‌‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాలుగు వివిజన్లలో అభ్యర్థులు కరువయ్యారు. 15, 49, 72, 78 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు.

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు మున్సిపాలిటీల్లో కూడా వైయ‌స్ఆర్‌‌సీపీ పలు కౌన్సిలర్‌ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఏలూరులో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు పోటీలో లేని చోట్ల తాను జనసేనకు ప్రచారం చేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. చింతమనేని కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు వచ్చి కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారని తిట్ల దండకం అందుకున్నారు. ఏలూరులోని టీడీపీ నాయకులను కూడా ఇష్టారాజ్యంగా తిట్టారు.

ఇటీవ‌ల నిర్వ‌హించిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుదారులు స‌త్తా చాటారు. అదే జోరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా క‌నిపిస్తోంది. మున్సిపాలిటీల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా రెప‌రెప‌లాడుతోంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ తన హవాను కొనసాగించింది.

పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో 31 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 12 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చిత్తూరు కార్పొరేషన్‌ పరిధలోని 50 డివిజన్లకు గాను 30 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైయ‌స్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైయ‌స్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైయ‌స్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 16 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 19 డివిజన్లను వైయ‌స్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

కర్నూల్ జిల్లాలోని డోన్, ఆత్మ‌కూరు మున్సిపాలిటీల‌ను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. డోన్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో, ఆదోని మున్సిపాలిటీలో 9 వార్డుల్లో, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైయ‌స్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు వైయ‌స్సార్సీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ నివాసం ఉండే 15వ వార్డులో వైయ‌స్సార్సీపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ నుంచి టీడీపీ అభ్యర్థి నాగమణి వైదొలగడంతో ఈ వార్డు వైయ‌స్సార్సీపీ ఖాతాలో చేరింది. తిరువూరు నగర పంచాయతీలోనూ వైయ‌స్సార్సీపీ 2 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. గిద్దలూరు మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైయ‌స్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 వార్డులకు 33 వార్డులు వైయ‌స్ఆర్‌సీపీ ఖాతాలో చేరాయి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైయ‌స్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులను, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులను వైయ‌స్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైయ‌స్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డులను వైయ‌ఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైయ‌స్సార్సీపీ 9 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది.
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.