మళ్లీ కరోనా కలవరం: పెరిగిన కొత్త కేసులు

0
148

న్యూఢిల్లీ, మార్చి 5 (న్యూస్‌టైమ్): దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు (14,989 కేసులు)తో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపించింది. ప్రస్తుతం మొత్తం వైరస్ కేసుల సంఖ్య 1.11 కోట్లకు పైబడింది. అయితే, మూడోరోజు కూడా మరణాల సంఖ్య 100కు దిగువనే నమోదు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. కొత్తగా 89 మంది మృత్యుఒడికి చేరగా నిన్నటి వరకు 1,57,435 మంది ఈ మహ్మమారి కారణంగా ప్రాణాలు వదిలారు. పాజిటివ్ కేసుల పెరుగుదల కారణంగా క్రియాశీల కేసుల్లో వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,73,413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటుండగా క్రియాశీల రేటు 1.53 శాతంగా కొనసాగుతోంది. ఇక నిన్న ఒక్కరోజే 14,031 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారు 1.08కోట్లకు పైబడగా ఆ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న 7,75,631 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

మరోవైపు దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. ఈ టీకా కార్యక్రమం ఇప్పటికే రెండో దశలోకి అడుగుపెట్టగా.. మార్చి3 నాటికి 1,66,16,048 కోట్ల మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 9,94,452 మంది టీకాలు వేయించుకున్నారు. అలాగే టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్ల పైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా టీకా వేసే సమయ పరిమితిని ఎత్తివేసింది. ఇక నుంచి ప్రజలు24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్టీకా తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.