ఎక్కడున్నారు…నాయకా?

0
465

బీజేపీలో పత్తా లేని ప్రముఖులు
ఎక్కడున్నారో తెలియని మాజీ ఐఏఎస్, ఐపిఎస్‌లు
     ( మార్తి సుబ్రహ్మణ్యం)

వాళ్లంతా ఒకప్పుడు వారి వారి శాఖల్లో మకుటం లేని మహారాజులు. డీజీపీ స్థాయి ఒకరయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్ళి స్థాయి మరొకరిది. ఇంకొకరు రాజకీయంగా ఒక వెలుగు వెలుగు వెలిగిన వారు. వీరందరికీ ఏపీలో బీజేపీ నాయకత్వం మారిన తర్వాత సినిమా కష్టాలు  మొదలయ్యాయి. అసలు తాము పార్టీలో ఉన్నామా? లేదా అని వారికి వారే ప్రశ్నించుకోవాల్సిన దుస్థితి. ఉండీలేనట్లు.. అంటీముట్టనట్లుగా ఉంటున్న వైనం. సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక, వారి సేవలను వినియోగించుకునే వారే కరవ య్యారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండగా, చురుకుగా పనిచేసిన వారంతా ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా క నుమరుగయిపోయిన వైచిత్రి.

సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత.. కాపు వైశ్య-బ్రహ్మణ వర్గాలకు చెందిన నేతలను, వ్యూహాత్మకంగా తెరవెనక్కి పంపారన్న విమర్శ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండగా, రాజకీయంగా ఈ వర్గాలకు పార్టీని దగ్గర చేశారు. కానీ నాయకత్వం  మారిన తర్వాత, వారి పరిస్థితి పార్టీలో దారుణంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కమ్మ వర్గానికి చెందిన నేతల పరిస్థితి మరీ దారుణం. కాంగ్రెస్‌లో ఉండగా చక్రం తిప్పి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇక టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారులో మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా పనిచేసిన వేణుంబాక దినేష్‌రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు కూడా కమలం కండువా కప్పేసుకున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఇప్పుడాయన ట్విట్టర్, అప్పుడప్పుడు జరిగే కొన్ని పార్టీ రహిత సమావేశాల్లో కనిపిస్తున్నారు. ఆయన సేవలూ వాడుకుంటున్న దాఖలాలు లేవు. కాపు వర్గానికి చెందిన కె.వి.రావుకు కన్నా అధ్యక్షుడిగా ఉండగా, ఢిల్లీ సమన్వయకర్తగా నియమించారు. కానీ ఆయన ఆ పనిలో విఫలమయ్యారు. అది వేరే విషయం. ఇప్పుడాయన కూడా ఎక్కడా కనిపించడం లేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన సుధీష్ రాంభొట్ల, అప్పట్లో కన్నా అధ్యక్షుడిగా ఉండగా, ముఖ్య అధికార ప్రతినిధిగా ప్రెస్‌మీట్లతో చాలా హడావిడి చేసేవారు. ఇప్పుడాయన కూడా భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు.

దళిత వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులును పార్టీ పని నుంచి తప్పించి, సమరతా సేవా ఫౌండేషన్ అప్పగించారు. ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దళితులు-గిరిజనులు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించే పనిలో ఉన్నారు. ఆయన సేవలు కూడా పెద్దగా వాడుకుంటున్న దాఖలాలు లేవు. ఇక లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి వద్ద ఓఎస్డీగా పనిచేసి, మాదిగ వర్గంలో పట్టున్న మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబుకు పేరుకయితే, రాష్ట్ర ఉపాథ్యక్షుడిగా ఇచ్చినా, ఆయన సేవలనూ వాడుకుంటున్న దాఖలాలు లేవు.

ఇక బ్రాహ్మణ వర్గానికి చెందిన చెరువు రామకోటయ్య, అప్పట్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనతో దాదాపు కోటిరూపాయలు ఖర్చు చేయించిన ఆయన,  ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్ధితి.కాకినాడకు చెందిన సీనియర్ నేత  పైడా కృష్ణమోహన్ ఒకప్పుడు బీజేపీకి ఫైనాన్సర్.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర కోశాధికారిగా, ఆర్ధికంగా ఆదుకున్న నేత. సోము వీర్రాజుకు సమకాలికుడు. ఇప్పుడాయన పార్టీలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. వైశ్య వర్గానికి చెందిన అనంతపురం కదిరి నేత, వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ అధ్యక్షుడు హరిబాబు వర్గీయుడు కావడంతో ఆయనను తొక్కేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కాపు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్, రెండేళ్లు పదవీకాలం ఉండగనే నైతిక విలువలు పాటించి, టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా వారించినా వినకుండా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటికీ ఆయనకున్న గుర్తింపు సున్నా.

వైశ్య వర్గానికి చెందిన ఏలూరు నేత రామకోటయ్యతో ఎంపీకి పోటీ చేయించిన నాయకత్వం, ఇప్పుడు ఆయనకు ఇస్తున్న గౌరవం శూన్యం. బ్రాహ్మణ వర్గానికి చెందిన రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా, గుంటూరు లక్ష్మీపతి, వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత కామర్సు చిరంజీవికి ప్రస్తుతం పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదు. బీజేపీ వ్యవస్థాపక నేత దివంగత మాజీ ఎమ్మెల్సీ జూపూడి యజ్ఞనారాయణ కుమారుడయిన, ప్రముఖ న్యాయవాది జూపూడి రంగరాజుకూ పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదు.

ఇక టీడీపీలో ఉండగా కేంద్ర-రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో ప్రేక్షకపాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి సేవలను వాడుకోవడంలో సోము వీర్రాజు విఫలమవడంతో, వారు పార్టీకి అంటీముట్టన ట్లు వ్యవహరిస్తున్నారు. అయితే, సీఎం రమేష్ రాజ్యసభలో విపక్షాలతో ఫ్లోర్ కో ఆర్డినేషన్ నిర్వహిస్తూ అమిత్‌షాకు దగ్గరవగా, సుజనా చౌదరి కూడా కేంద్ర నాయకత్వానికి దగ్గరగానే ఉండటం విశేషం. సోము అండ్ కోకు అపాయింట్‌మెంట్లు ఇవ్వని ప్రధాని మోదీ-అమిత్‌షా-నద్దాతో వీరు తరచూ భేటీ కావడం బట్టి, వీరికి నాయకత్వం వద్ద ఎంత పలుకుబడి ఉందో స్పష్టమవుతుంది.

వీరిద్దరినీ సోము-సునీల్ దియోధర్ అండ్ కో, వ్యూహాత్మకంగా మినీ కోర్ కమిటీ నుంచి తమ నిర్ణయాలను ప్రశ్నిస్తుందుకు తప్పించడం ప్రస్తావనార్హం.  పార్టీలో ఇంత జరుగుతున్నా, వాటిని చక్కదిద్ది నాయకత్వానికి  దిశానిర్దేశం చేయాల్సిన,  సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ కూడా.. వీరితో కలసిపోయారన్న అపవాదు వినిపిస్తోంది. ఆయన ఏ కారణం, ఏ ఒత్తిళ్ల వల్లనో రాష్ట్ర పార్టీపై గతంలో రవీంద్రరాజు మాదిరిగా పట్టు సాధించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.