‘విజయ’ మంత్రం.. ‘సాయి’ తంత్రం!

0
234

విశాఖ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి
                 ( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రతిష్ఠాత్మకంగా మారిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో,  వైసీపీ నావను విజయతీరాలకు చేర్చేందుకు ఆ పార్టీ కీలక నేత, పార్లమెంటరీ పార్టీ నేత  వేణుంబాక విజయసాయిరెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కొన్నేళ్ల నుంచి విశాఖలోనే మకాం వేసిన విజయసాయిరెడ్డి, విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ ఖాతాలో వేసేందుకు అప్పటినుంచే వ్యూహాత్మకంగా పావులుకదపడం ప్రారంభించారు. ముందుగా డివిజన్ల వారీగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, తొలి దశలో ప్రజలకు పార్టీని చేరువ చేయగలిగారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను వైసీపీలోకి తీసుకురావడం ద్వారా, విశాఖలో వైసీపీని బలోపేతం చేయగలిగారు. టీడీపీ ఎమ్మెల్యే ఒక్కరు తప్ప, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్తబ్దుగా ఉండటం కూడా, విశాఖ ఎన్నికల్లో వైసీపీకి కలసిరానుంది.

ఎంపీగా  విజయసాయిరెడ్డి  ఢిల్లీలో ఉన్నప్పటికీ, ఆయన దృష్టి అంతా విశాఖపైనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. ఎక్కువ సమయం విశాఖలోనే ఉండటం ద్వారా, అన్ని వర్గాలకు చెందిన వారికి అందుబాటులో ఉంటున్నారు. నిజానికి  విశాఖకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు  ఉన్నప్పటికీ వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలంతా విజయసాయినే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విజయసాయి వద్దకు వెళితే, తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న భావన విశాఖ ప్రజల్లో స్థిరపడింది. మాస్ నాయకుడు కాకపోయినా.. ఎదుటివారు చెప్పింది వినడం, దాని తీవ్రత బట్టి అక్కడికక్కడ అధికారులకు ఫోన్లు చేసి పరిష్కారం సూచించడం వంటి లక్షణం ఆయనను విశాఖ ఆపద్బాంధువుడిగా నిలబెట్టింది.

ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను కూడా ఆయన అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. నగరంలోని 92 డివిజన్లలో ప్రజాభిమానం ఉన్న అభ్యర్ధులను, ఆయన చాలాకాలం క్రితమే వడబోసి నిర్ణయించారు. సర్వేలు చేయించారు. దానికి భిన్నంగా ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు కొంతమందికి టికెట్లు ఇచ్చారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం ఎక్కువ ప్రభావితం చేసి, కాపులకు ఎక్కువ సీట్లు ఇప్పించుకున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయినా  మెజారిటీ శాతం సర్వే ఫలితాల ఆధారంగానే సీట్లు పంపిణీ  చేశారు.  ప్రజలకు అందుబాటులో ఉన్న వారితోపాటు, సామాజికవర్గాల్లో వారి పట్టును కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేశారు. ఇటీవల ఆయన నిర్వహించిన 25 కిలోమీటర్ల పాదయాత్ర పార్టీకి ప్లస్ అయింది.

నిజానికి విశాఖలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది. కాలనీలు, అపార్టుమెంట్లు ఉండే ప్రాంతాలన్నీ మీడియా ప్రభావంతో ఉంటాయి. అది కూడా సహజంగా ప్రభుత్వ వ్యతిరేకతకు ఒక కారణంగా కనిపిస్తుంది. ఇది ఏ ప్రభుత్వంలోనయినా సహజమే. అయితే, నగరాలు-పట్టణాల్లో  మధ్య తరగతి ప్రజల అభిప్రాయం-నిర్ణయాలు స్థిరంగా ఉండవు. దీనిని దృష్టిలో ఉంచుకున్న విజయసాయిరెడ్డి,  తన పర్యటనలను మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రముఖులను స్వయంగా కలవడం ద్వారా, పార్టీపై సానుకూలత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పార్టీపై అనుకూలత కంటే, వ్యతిరేకత తగ్గించేందుకు ఉపకరిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

 ‘మధ్య తర గతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ పథకాలన్నీ దాదాపు అందినందున వారు సంతృప్తిగానే ఉన్నారు. అందువల్ల వారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కనిపించడం లేదు. విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడయినా కూడా, ఒక సామాన్య కార్యకర్తగా వీధి వీధినా అలుపెరగకుండా, కష్టపడి తిరుగుతున్న వైనం ప్రజలను ఆకట్టుకుంటోంది. 741 మురికివాడల్లో విజయసాయిరెడ్డి కొన్ని మినహా అన్నిచోట్లా  పర్యటించారు. నగరంలో మహిళలే వైసీపీకి పెద్ద ఓటు బ్యాంకు.  నూరు శాతం సంక్షేమ పథకాలు అందిన సంతృప్తి వారిలో కనిపిస్తోంది. సీఎం జగన్ పాలనా ఫలితాలతో రాష్ట్రంలో అన్ని నగరాల కంటే విశాఖ నగర ప్రజలే సంతృప్తిగా ఉన్నారని’ మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు.

అటు పార్టీపరంగా కూడా విజయసాయిరెడ్డి, ద్వితీయ శ్రేణి నేతలందరినీ క్రమశిక్షణలో పెట్టగలిగారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిశీలకులను నియమించడం ద్వారా, సమర్ధులైన నాయకుల జాబితా సేకరించగలిగారు. ఫలితంగా 98 డివిజన్లలో ఎన్నికల బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్నది ఖరారు చేశారు. ఇక కుల సమీకరణలో కూడా జాగ్రత్తగా పావులు కదిపినట్లు అభ్యర్ధుల ఎంపిక స్పష్టం చేసింది. నగరంలో మెజారిటీ శాతం ఉన్న యాదవ వర్గానికి చెందిన, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణను మేయర్ అభ్యర్ధిగా ఎంపిక చేశారన్న వార్తలు ఆ వర్గంలో జోష్ నింపాయి. గత రెండు ఎన్నికల్లోనూ యాదవులకు జరిగిన అన్యాయం దృష్టిలో ఉంచుకుని, ఈ ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా ఉన్న కాపు వర్గానికి ఎక్కువ సంఖ్యలో సీట్లు ఇచ్చారు.

ఇక విశాఖ నగరంలోని 98 మున్సిపల్ డివిజన్ల పరిథిలో ఉన్న 741 మురికివాడలే, ఏ పార్టీ విజయాన్నయినా నిర్దేశిస్తాయి. కాలనీలు, అపార్టుమెంట్లలో నివసించే ఓటర్లకు చర్చల్లో పాల్గొనేంత శ్రద్ధ, ఓటింగుకు వచ్చేందుకు ఉండదు. అందుకే విద్యావంతులు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ శాతం తక్కువ. ఈ సూక్ష్మాన్ని కనిపెట్టిన విజయసాయి, తొలి నుంచీ మురికివాడలపైనే కన్నేశారు. పార్టీ కార్యక్రమాలను వీలయినంత ఎక్కువ అక్కడే నిర్వహిస్తుండటం ద్వారా, అక్కడ పార్టీని బలోపేతం చేయగలిగారు. దానికితోడు తన ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా, మురికివాడల్లో తరచూ నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పార్టీకి కలసిరానున్నాయి.

జాలర్లు ఎక్కువమంది నివసించే  జాలరిపేటను విజయసాయిరెడ్డి దత్తత తీసుకుని, అక్కడ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఆయన,  మురికివాడలపైనే ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా  మాస్‌కు  దగ్గరయ్యారు. ఒక్కముక్కలో చెప్పాలంటే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు, విజయసాయిరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ వైసీపీ అభ్యర్ధులు గెలిచారంటే,  అది ఆయన కష్టం ఫలితమేనన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.