నాడు సుహాసిని..నేడు వాణి

0
579

సానుభూతిలో చిక్కుకున్న మహిళా నేతలు
నాటి కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్నే నేడు ప్రయోగిస్తున్న విపక్షాలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాజకీయాల్లో విమర్శలకు ప్రాతిపదిక ఏమీ ఉండదు. సమయం, సందర్భం కావాలంతే. చరిత్ర అన్నీ గుర్తుంచుకుంటుంది. అది చెరిపేస్తే చెరిగేది కాదు. ఈ సోషల్‌మీడియా యుగంలో అయితే, అసలేదీ రహస్యం కాదు. ఒకప్పుడు విమర్శలు రువ్విన వారు ఇప్పుడు పొడిగిడినా.. నాడు ఆకాశానికెత్తిన వారే నేడు విమర్శలు కురిపించినా.. సోషల్‌మీడియాలో నాటి ముచ్చట్లన్నీ ‘నాడు-నేడు’గా జనబాహుళ్యంలోకి వాయువేగంతో వెళ్లిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారమూ  అదే బాట పడుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ నుంచి,  టీడీపీ అభ్యర్ధినిగా దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేశారు. టీడీపీ-టీఆర్‌ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. అప్పుడు టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ అయిన మంత్రి కేటీఆర్, టీడీపీపై అనేక విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా సుహాసినికి సానుభూతి వ్యక్తం చేస్తూ  మాట్లాడారు. చంద్రబాబుకు సుహాసినిపై అంత సానుభూతి ఉంటే, ఏపీలో ఆమెకు కౌన్సిల్ సీటు ఎందుకివ్వలేదు? కొడుకు లోకేష్‌కు ఎమ్మెల్సీ సీటుతోపాటు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు.. సుహాసినీకి ఓడిపోయే కూకట్‌పల్లి సీటు ఇచ్చారని, కేటీఆర్ సెంటిమెంట్ అస్త్రం సంధించారు. ఓటర్లు కూడా కేటీఆర్ చెప్పింది నిజమేనని భావించి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి మాదవరం కృష్ణారావును గెలిపించారు.

ఇప్పుడు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, మళ్లీ అలాంటి సెంటిమెంట్ అస్త్రమే తెరపైకి వచ్చింది. అయితే ఈసారి దానిని సంధిస్తున్నది టీఆర్‌ఎస్ కాదు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు కావడం విశేషం. టీఆర్‌ఎస్ అభ్యర్ధినిగా దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె, వాణీదేవిని బరిలోకి దింపిన వైనాన్ని విపక్షాలు… ఇప్పుడు సేమ్.. అప్పటి కేటీఆర్ ప్రయోగించిన సెంటిమెంటు అస్త్రాన్నే సంధిస్తున్నాయి. దానికి సరైన విధంగా, సూటిగా జవాబు చెప్పలేక టీఆర్‌ఎస్ నేతలు నీళ్లు నములుతుండటం బట్టి, అది వర్కవుటవుతున్నట్లు కనిపిస్తోంది.

రాజ్యసభ సీటు లేదా కౌన్సిల్ సీటు గానీ ఇచ్చి పివి కుమార్తెను గౌరవించాల్సిన కేసీఆర్, ఓడిపోయే చోట నిలబెట్టి ఆయన కుటుంబ పరువు తీస్తున్నారన్న ‘పొలిటికల్ సెంటిమెంటు’ను ఓటర్లపై సంధిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పివి సమాధిని కూల్చేస్తామన్న మజ్లిస్ ఓట్లతో మేయర్ అయిన టీఆర్‌ఎస్, అదే పివి కుమార్తెను పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టి, పివి ఆత్మను క్షోభ పెడుతున్నారని అటు బీజేపీ-ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టి, అధికార పార్టీని ఆత్మరక్షణలో నెడుతున్నాయి. పివి బిడ్డపై అంత సానుభూతి ఉంటే ఆమెకు రాజ్యసభ ఇవ్వవచ్చు కదా? ఓడిపోయే సీటులో పోటీ చేయించడం ద్వారా కేసీఆర్, పివిపై తనకున్న కసిని  తీర్చుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరొక అడుగు ముందుకేసి.. నిజామాబాద్‌లో గెలిచే చోట తన బిడ్డ కవితను పోటీ చేయించిన కేసీఆర్, ఓడిపోయే చోట పివి బిడ్డను పోటీ చేయించడమేమిటని నిలదీశారు. పివి గాట్‌ను కూలదోస్తామన్న మజ్లిస్ మద్దతు తీసుకున్న టీఆర్‌ఎస్, తన అభ్యర్థిగా పివి బిడ్డను పోటీ చేయించడమంటే ఆమెను బలిపశువును చేసినట్టేనన్న కొత్త మెలిక పెట్టారు. ఇక బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు అయితే బ్రాహ్మణుల ఓట్లు చీల్చి, బ్రాహ్మణ వర్గంలో చీలికలు తీసుకువచ్చేందుకే పివి బిడ్డను పోటీకి దింపార న్న విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇవన్నీ విద్యావంతుల్లో కొత్త ఆలోచనకు దారితీస్తున్నాయి. అనేక అంశాలపై విపక్షాలపై ఎదురుదాడి చేస్తున్న టీఆర్‌ఎస్.. ఈ సెంటిమెంటు విమర్శలకు, ఇప్పటివరకూ సూటిగా సమాధానం చెప్పలేక సతమతమవుతోంది. అప్పుడు కూకట్‌పల్లి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని సుహాసినీపై, కేటీఆర్ సంధించిన ఇదే సెంటిమెంట్ అస్త్రం ఫలించినట్లే.. ఇప్పుడు విపక్షాలు, టీఆర్‌ఎస్‌పై సంధిస్తున్న అదే సెంటిమెంట్ అస్త్రం ఫలిస్తుందో లేదో చూడాలి.