జంతు సంరక్షణకు ప్రత్యేక చర్యలు

629

హైదరాబాద్, మార్చి 4 (న్యూస్‌టైమ్): మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ -11 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్‌గా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్. శోభ మెంబర్ కన్వీనర్‌గా పదిమందితో కమిటీ ఏర్పాటయింది.

కమిటీలో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేశ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒ. శాంతి కుమారి, మాజీ శాసన సభ్యుడు జి. అరవింద్ రెడ్డి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ), వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. మనుషులను చంపుతున్న పులులు, సంబంధిత ఘటనలను తగ్గించేందుకు కమిటీ అధ్యయనం చేయంది. మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం, ప్రస్తుత చర్యలు, నష్ట పరిహారంపై కమిటీ సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. జంతువుల దాడుల్లో మనుషులు గాయపడటం, చనిపోవటం, పెంపుడు జంతువుల మృతి, పంట నష్టం చర్యలపై అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిది ఉంది.