కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక తప్పదా?

0
242

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక తప్పదా? తాజా పరిణామాలు చూస్తుంటే  ఈ సందేహం బలపడుతోంది. ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేసిన కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ సారధ్యంలో  కాంగ్రెస్ పార్టీకి కొత్త ముప్పు వచ్చి పడింది. కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా ఆజాద్ సారధ్యంలో 23 మంది కాంగ్రెస్ సీనియర్లు డిమాండ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్, రాజ్ బబ్బర్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, భూపేందర్ సింగ్ హుడా తదితర నేతలు గత ఆరు నెలలుగా ఒక గ్రూపుగా ఏర్పడి కాంగ్రెస్ అధిష్ఠానంపై వత్తిడి పెంచుతున్నారు.

గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూసిన తరువాత ఎఐసిసి అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. పార్టీ నేతలంతా రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగాలని పదే పదే కోరినా ఆయన ససేమిరా అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుని ఎంపిక ఒక సవాలుగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అనారోగ్య బాధలు భరిస్తూనే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి వచ్చే వరకు తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా సేవలందిస్తానని సోనియా అప్పట్లో చెప్పారు. ఈ పరిణామం జరిగి నాలుగు నెలలు పైబడినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సోనియా పేరిట అడపాదడపా మీడియా ప్రకటనలు వెలువడడం, కాంగ్రెస్ నాయకునిగా రాహుల్ గాంధీ అప్పుడప్పుడు ప్రజల్లోకి రావడం మినహా కాంగ్రెస్ పార్టీకి కదలిక లేదనే చెప్పాలి. ఒక పక్క ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అంటూ అధికార భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంటే  కాంగ్రెస్ పార్టీ మాత్రం మిణుగురు పురుగులా మినుకుమినుకుమంటోంది.

1885 డిసెంబర్ 28వ తేదీన బ్రిటిష్ మాజీ అధికారి ఎ.ఓ. హ్యూమ్ అధ్యక్షతన స్థాపితమైన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక శక్తిగా ఎదిగింది. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్ లాల్ నెహ్రూ, బి.ఆర్. అంబేద్కర్ వంటి ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పని చేశారు. దేశ స్వాతంత్ర్య సముపార్జన తరువాత దేశాన్ని అధిక కాలం 47 ఏళ్ళకు పైబడి కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది.దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, ఆమె హత్యానంతరం ఆమె తనయుడు రాజీవ్ గాంధీ… ఇలా వంశపారంపర్యంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూనే దేశాన్ని కూడా ఏలారు. రాజీవ్ హత్యానంతరం చాలా కాలం పాటు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పదవులకు దూరంగా ఉన్నప్పటికీ దేశంలో కాంగ్రెస్ బలహీనపడుతున్న కారణంగా రాజీవ్ సతీమణి సోనియా గాంధీ బలవంతంగానే కాంగ్రెస్ సారధ్యం వహించాల్సి వచ్చింది.సోనియా సారధ్య ఫలితంగా 2004, 2009లలో దేశంలో కాంగ్రెస్ సారధ్యంలో యుపిఎ అధికారంలోకి వచ్చినా సోనియా ప్రధాని పదవిని తృణప్రాయంగా త్యజించి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేశారు.

కాలక్రమంలో సోనియా అనారోగ్యం కారణంగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎఐసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆయన సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేక అపజయాలు మూటగట్టుకుందనే అపవాదును రాహుల్ ఎదుర్కోవలసి వచ్చింది. 2014లో నరేంద్ర మోడి సారధ్యంలో ఎన్.డి.ఎ అధికారం చేపట్టిన తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రాహుల్ సారధ్యంలో వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. చివరికి 2019 లోక్ సభ ఎన్నికలలో 52  స్థానాలకు కాంగ్రెస్ పరిమితం కావలసి వచ్చింది. దీంతో రాహుల్ గాంధీపై స్వపక్షంలోనూ, విపక్షంలోనూ విమర్శలు తీవ్రమయ్యాయి. ఆయనపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసేశారు. దీంతో ఆయన ఎఐసిసి అధ్యక్ష బాధ్యతల నుండి వైదొలగారు.

కాంగ్రెస్ హేమాహేమీలంతా కాంగ్రెస్ సారధిగా కొనసాగాలని రాహుల్ గాంధీపై వత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరికి కష్టమైనా ఆ బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకున్నారు సోనియా గాంధీ. అయినప్పటికీ  కాంగ్రెస్ పునరుజ్జీవనం అనేది ఆమడ దూరంలో కూడా కనిపించడం లేదు. లోక్ సభలో 52, రాజ్యసభలో 46మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్రలో శివసేన సంకీర్ణంలో కాంగ్రెస్ భాగస్వామి. ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి చీలికలు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీని వీడి అనేకమంది నేతలు పార్టీలు పెట్టుకున్నారు. కొంత మంది కాలగర్భంలో కలిసిపోతే మరి కొందరు తమ పార్టీలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. 1977లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో తొలి చీలిక చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పట్లో ఇందిరా గాంధీతో విబేధించి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. అప్పట్లో జాతీయ ఎన్నికల సంఘం కూడా బ్రహ్మానంద రెడ్డి సారధ్యంలోని రెడ్డి కాంగ్రెస్ పార్టీనే గుర్తించి ఆవుదూడ గుర్తును కూడా వారికే కేటాయించింది. ఇందిరా గాంధీ తన పేరుతోనే ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటు చేసుకుని హస్తం గుర్తు తో పోటీ చేశారు. అయితే ఆ తరువాత ప్రజాదరణ ఇందిరకే లభించడంతో నేతలంతా తిరిగి ఇందిరా కాంగ్రెస్ గూటికి చేరడంతో 1980 నాటికి రెడ్డి కాంగ్రెస్ కనుమరుగయింది.

1979లో కేరళకు చెందిన కొందరు నేతలు ఇందిరా కాంగ్రెస్ పార్టీని వీడి ‘కేరళ కాంగ్రెస్’ పేరిట ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నారు. కాలక్రమంలో ఆ ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (బి), కేరళ కాంగ్రెస్ (జాకబ్) పేరిట మూడు ముక్కలైంది. విశేషమేమిటంటే ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కేరళలో భారత జాతీయ కాంగ్రెస్ సారధ్యంలో నడుస్తున్న యుడిఎఫ్ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 1994లో ప్రధాని పి.వి.నరసింహారావుతో విబేధించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్.డి. తివారీ, అర్జున్ సింగ్ తదితరులు ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పేరిట ఒక పార్టీని నెలకొల్పారు.  ఆ తరువాత సోనియా ఆహ్వానం మేరకు తివారీ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.

1996లో తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జి.కె. మూపనార్ తమిళ మానిల కాంగ్రెస్ పేరిట ఓ ప్రాంతీయ పార్టీని నెలకొల్పి కాలక్రమంలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 1998లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆమే అధికారంలో ఉన్నారు. 1999లో శరద్ పవార్, పి.ఎ. సంగ్మా, ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ పార్టీలో సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే ఆ తరువాత అదే పార్టీ కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామ్య పక్షంగా మారింది. ఇప్పుడు మహారాష్ట్రలోని శివసేన సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.

2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సిపి)ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సిపి రాకతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికి కోల్పోగా 2014లో ప్రధాన ప్రతిపక్షంగా, 2019లో అధికార పక్షంగా వైఎస్సార్ సిపి  అవతరించింది. ఈ రెండు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేక పోయింది. 2011లోనే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చి ఎన్. ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో చీలికలు, విలీనాలు మనం చూస్తూ వచ్చాం.

అయితే ఇప్పుడు మరో ముప్పు కాంగ్రెస్ పార్టీకి పొంచి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. జి-23 రూపంలో ఆజాద్ అండ్ కో ఆ ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పేరిట జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ బృందం నిర్వహించిన సమావేశంలో వక్తలంతా కాంగ్రెస్ ప్రక్షాళన గురించి మాట్లాడుతూనే ఆజాద్ వంటి సమర్ధుడైన నేత సేవలను కాంగ్రెస్ పార్టీ సక్రమంగా వినియోగించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఆజాద్ రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసి వస్తోంది.

ఆజాద్ సేవలను భాజపా నేతలు మరిమరీ ప్రశంసించారు. ఆజాద్ ను కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయాలని, అది కాంగ్రెస్ వల్ల కాకుంటే తామే నామినేట్ చేస్తామని భాజపా నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆజాద్ జమ్మూలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలంతా కాషాయ కిరీటధారణతో ఉండడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో ముప్పు వాటిల్లబోతోందనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ఆజాద్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ తీయాలని భాజపా అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చీలికలు కొత్త కానప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆజాద్ బృందం తిరుగుబాటు మాత్రం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయడం ఖాయం.

– బోళ్ళ సతీష్ బాబు