కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులతో పోరాటానికి సిద్ధంగా ఉండండి

140

• మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కరోనా నేర్పించింది
• వివిధ పారిశ్రామిక రంగాలకు బయోటెక్నాలజీ వెన్నెముకగా దినదినాభివృద్ధి చెందుతోంది
• ‘గ్లోబల్ బయో ఇండియా-2021’ అవార్డుల ప్రదానోత్సవం, ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి
• బయోటెక్ పరిశ్రమనుంచి ‘బయో ఎకానమీ’ (జీవ ఆర్థిక వ్యవస్థ) వైపు భారత్ పరివర్తనం చెందుతోంది
• ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో వివిధ దేశాలకు భారత్ కరోనా టీకాను సరఫరా చేస్తోంది
• భారతీయ యువత నైపుణ్యా్న్ని పెంచే విషయంలో విద్యాసంస్థలు, పరిశ్రమలు పరస్పర సమన్వయంతో కృషిచేయాలని సూచన
• వ్యవసాయం, అనుబంధ రంగాల్లోని సవాళ్లను పరిష్కరించడంలోనూ బయోటెక్ రంగానికి సామర్థ్యం ఉందని వెల్లడి
• శాస్త్రవేత్తలకు గౌరవ భారత ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని వాటితో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులకు గౌరవ ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. హఠాత్తుగా, మునుపెన్నడూ చూడని సమస్యలు, మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో మనమెంతటి అప్రమత్తత ప్రదర్శించాలనే అంశాన్ని కరోనా నేర్పించిన విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు.

‘గ్లోబల్ బయో ఇండియా-2021’ సదస్సు ముగింపు సమావేశం, అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల కొంతకాలంగా వివిధ పరిశ్రమలకు, రంగాలకు బయోటెక్నాలజీ వెన్నెముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక విధానానికి నాలుగు ప్రధాన స్తంభాలైన సృజనాత్మకత (సరికొత్త ఆలోచన), అభివృద్ధి, స్థానిక ప్రతిభ, ఉన్నత విలువల ఆధారిత సంరక్షణ వంటి ఆధారంగా నిర్మితమైన భారత బయోటెక్ రంగం, బయో ఎకానమీ (జీవ ఆర్థిక వ్యవస్థ) దిశగా పరివర్తనం చెందుతోందన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకు భారత బయోటెక్నాలజీ విభాగం చేసిన కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. వీరి కృషి కారణంగానే  కరోనా పరీక్షల కిట్లు, టీకాలు, ఆధునిక రక్షణ పరికరాలు, పరీక్షాకేంద్రాల సామర్థ్యం పెంపు, వైరస్ నియంత్రణ తదితర అంశాలను గుర్తుచేస్తూ, కరోనాపై పోరాటాన్ని భారతదేశం ముందుండి నడిపిన తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

‘వసుధైవ కుటుంబకం’, తోటివారి గురించి ఆలోచించడం, మన దగ్గరున్న దాన్ని వారితో కలిసి పంచుకోవాలన్న సనాతన నైతిక విలువల స్ఫూర్తితో భారతదేశం వివిధ దేశాలకు కరోనా టీకాను సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరోనా టీకా పంపిణీ విషయంలో భారతదేశం అనుసరిస్తున్న విధానానికి గానూ మన ప్రధాని నరేంద్రమోదీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ కృతజ్ఞతలు తెలిపారన్నారు. బయోటెక్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను, శక్తి సామర్థ్యాలను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలోని పారిశ్రామిక వేత్తలకు సత్వర అనుమతులతో పాటు ఇతర నిబంధనలను మరింత సులభతరం చేస్తోందన్నారు. ‘ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల కారణంగా స్పష్టమైన సానుకూల ప్రభావం కనబడుతోంది. కరోనా నేపథ్యంలోనూ ఆవిష్కర్తలు, వివిధ సాంకేతికతలు, ఉత్పత్తులు పెరగడమే ఇందుకు సాక్ష్యం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

2025 నాటికి 150 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11 లక్షల కోట్లు) లక్ష్యంతో ముందుకు వెళ్తున్న భారత బయోటెక్ రంగం, దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషిచేందుకు సిద్ధమవుతోందన్న ఉపరాష్ట్రపతి, విద్యాసంస్థలు, పరిశ్రమలు పరస్పర సమన్వయంతో కృషిచేస్తూ యువతకు నైపుణ్యాన్ని అందించడం ద్వారా ఈ లక్ష్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మేకిన్ ఇండియా నినాదంతో ఆత్మనిర్భర భారత నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా బయోటెక్ రంగం బయో ఎకానమీగా మారాలన్న లక్ష్యాన్ని వేగంగా చేరుకోగలదన్నారు. ఈ దిశగా కేంద్రం తీసుకొస్తున్న విధానపరమైన నిర్ణయాలు ఈ రంగంలో సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయనే విశ్వాసం తనకుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుంబంధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల విషయంలోనూ పరిష్కారాలు చూపించే సామర్థ్యం బయోటెక్నాలజీ రంగానికి ఉందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, డీబీటీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, సి.ఐ.ఐ. డైరక్టర్ జనరల్  jచంద్రజిత్ బెనర్జీ, బయోకాన్ చైర్‌పర్సన్ డాక్టర్ కిరణ్ మజుందార్ షా, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి డా. రోడెరికో హెచ్. ఆఫ్రిన్ సహా పలువురు బయోటెక్ రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, వివిధ అంకుర సంస్థల ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా హాజరయ్యారు.