వన్యప్రాణుల వేట నేరం: ఎన్.ప్రతీప్‌కుమార్

0
132

వన్యప్రాణులను వేటాడటం తీవ్ర నేరమని వన్యప్రాణుల  సంరక్షణకు  ఆంధ్ర ప్రదేశ్ అటవీశాఖ  ప్రత్యేక చర్యలు చేపడుతుందని  రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి ఎన్.  ప్రతీప్  కుమార్  అన్నారు. ప్రపంచ  వన్యప్రాణి  దినోత్సవం సందర్భంగా  రాష్ట్ర అటవీ  శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన  వెబ్ నార్  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత  విశాలమైన  నాగార్జున సాగర్, శ్రీశైలం  టైగర్  రిజర్వు  ఆంధ్రప్రదేశ్ కు గర్వ కారణం  అన్నారు.  ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వార్షిక వేడుక అయినప్పటికీ  వన్యప్రాణుల  సంరక్షణకు ప్రతిరోజు శ్రద్ధ వహించాల్సిన అవసరం  ఉందని తెలిపారు.అంతరించిపోతున్న జంతువులు, మొక్కల పై అవగాహన పెంచడానికి వాటిని   రక్షిచడానికి ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. భూమి  లెక్కలేనన్ని జీవజాతులకు వృక్షజాతులు నిలయమని, పీల్చే గాలి తినే ఆహారం ఉపయోగించే శక్తి వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు జంతువుల పై ఆధారపడి ఉన్నాయన్నారు .

మనకు అవసరమైన పదార్ధాలన్నీ ప్రకృతి నుంచే పొందుతున్నామని  ఆయన తెలిపారు. అయితే పెరుగుతున్న మానవ అవసరాలు.  వాతావరణ  కాలుష్యం ,జీవ జాతులు  సహజ వనరులను, జీవ వైవిధ్యాన్ని  దెబ్బ తీస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అటవీ  శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు రాష్ట్రంలో  వన్యప్రాణులను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తమకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.   జీవ జాతులు  అంతరించిపోతే ప్రకృతి లోని జీవుల మధ్య  సమతుల్యతలోపించి మిగతా జీవజాతులు కూడా  అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు.

వన్యప్రాణులను  రక్షించడానికి కిందిస్థాయి అధికారులు,సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు.చాలాచోట్ల  జంతువులు  రోడ్డు ప్రమాదాలలో మృతిచెందడం బాధాకరమని, ముఖ్యంగా అటవీ ప్రాంత సరిహద్దులలో  ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సిబ్బంది  చర్యలు తీసుకోవాలని  ఆయన కోరారు.  ఎన్జీవోలు కూడా  వన్యప్రాణి సంరక్షణ లో  గొప్ప పాత్ర  పోషిస్తున్నారని  ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో  వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి  రాహుల్ పాండే తో పాటు  అటవీ శాఖ లో ని వివిధ స్థాయిలలో  అధికారులు పాల్గొన్నారు.