రామోజీ గారూ…కాస్త ఆలోచించండి!

1579

రామోజీ గ్రూపు/ రామోజీ ఫౌండేషన్ నుంచి వస్తున్న తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలు మూతపడ్డాయి. అధికారిక ప్రకటన వచ్చింది. ఈ పరిణామంపై వ్యాసం రామోజీ సామ్రాజ్యంలో 4 పత్రికల మూసివేత #ramojirao తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు అప్రతిహత సామ్రాజ్యంలో నాలుగు పత్రికలను మూసివేశారు. 43ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న చతుర, విపుల లతో పాటు బాలలకోసం ప్రారంభించిన ‘బాలభారతం’, ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘తెలుగువెలుగు’ పత్రికల్ని కూడా మూసేశారు.

43 ఏళ్ల సుదీర్ఘ కాలంపాటు ఒక నిర్దిష్టమైన సాహిత్య ప్రయోజనానికి కట్టుబడి తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి నిరుపమాన సేవలు అందించిన విపుల- చతుర ఇక లేవు. ఏ ఫార్మాట్ లోనూ ఉండబోవు. ఈ రెండు మాత్రమే కాదు తొమ్మిదేళ్ల ప్రాయమున్న సాహిత్య పత్రిక, తెలుగు భాషోద్ధరణ సంకల్పంతో పురుడుపోసుకున్న ‘తెలుగువెలుగు’, ప్రత్యేకించి బాలలకోసమే పుట్టిన ఎనిమిదేళ్ల వయసున్న పసిబాలుడి వంటి ‘బాలభారతం’ పత్రిక కూడా ఇక కనిపించవు. ఈ నాలుగు పత్రికల్ని మూసివేస్తున్నట్టుగా.. వీటిని ప్రచురిస్తున్న రామోజీఫౌండేషన్ తరఫున వారి మేనేజింగ్ ట్రస్టీ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక సుదీర్ఘమైన లేఖను.. వారి వెబ్ సైట్ లో కూడా పెట్టారు.తెలుగు సాహిత్య ప్రియుల కుటుంబాల్లో ఒక భాగంగా మారిపోయిన పత్రికలు.

ఈనాడు స్థాపించిన మూడు నాలుగేళ్ల తర్వాత.. దినపత్రికలో అప్పటికి సాహిత్యానికి స్థానం ఇవ్వని రామోజీరావు.. తానేమీ దానికి వ్యతిరేకం కాదన్నట్టుగా ప్రత్యేకించి సాహిత్యం కోసమే ప్రారంభించిన పత్రికలు అవి. యావత్ ప్రపంచంలోని అత్యుత్తమ కథా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేసే అనన్యమైన పత్రికగా విపుల గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప్రతి నెలా ఒక నవలతో పాఠకులను అతి స్వల్ప ధరకే అలరించే పత్రికగా చతుర అందరి మదిలో నిలిచిపోయింది. మధ్య మధ్యలో ఎన్ని ఒడిదొడుకులు వస్తున్నప్పటికీ.. ఈ రెండు పత్రికల్ని నిరాటంకంగా నడుపుతూ వచ్చిన రామోజీరావు.. 2012లో ఈ సాహిత్య, భాషా సేవను విస్తృత పరిచారు. ‘తెలుగువెలుగు’ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికి పిల్లలకోసం చాలా ఉత్తమ ప్రమాణాలతో ‘బాలభారతం’ కూడా ప్రారంభించారు. అవన్నీ కూడా ఇక కనిపించవు.

కరోనానంతర పరిణామాలు,  మీడియాలో వచ్చిన కుదుపులు.. ఈ పత్రికల ఉసురు తీసినట్లుగా కనిపిస్తోంది. సంస్థ యాజమాన్యం ఆ విధంగా పేర్కొంది. కరోనా సంక్షోభం మీడియా మీద తీవ్రమైన ప్రభావం చూపిన గత ఏడాదిలో.. ఈనాడు దినపత్రికలో కూడా అనేక మార్పు చేర్పులు, ప్రతిష్టంభనలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేనిది- సిబ్బందికి లేఆఫ్‌లు ప్రకటించారు. వేలమంది సిబ్బంది.. నెలలో సగం రోజులూ పనీ లేక.. వేతనమూ లేక అలమటించిపోయారు. ఈనాడు సర్కులేషన్ కూడా దారుణంగా పడిపోయింది. కొన్ని నెలలపాటూ.. అసలు పత్రికను ప్రింట్ చేస్తే ‘పాఠకులకు చేరవేయడం’ అనేది గగనం అయిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొన్న సంస్థ.. ఆ కష్టనష్టాలను సిబ్బందికి కూడా పంచింది!

ఒక్క ఈనాడు మాత్రమే కాకుండా.. యావత్ మీడియా ప్రపంచంలో వేలాది మంది జీవితాలు గందరగోళంగా మారాయి. ఇదే సమయంలో ఈ నాలుగు పత్రికల (విపుల, చతుర, తెలుగువెలుగు, బాలభారతం) ముద్రణ కూడా ఆగిపోయింది. ప్రింటింగ్ ఆపేసి.. వాటిని కేవలం ఈ-పత్రికలుగా రూపొందించి.. ఆన్లైన్ ఎడిషన్లో మాత్రం అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. నిజానికి సాహిత్యప్రియులకు అది కూడా జీర్ణం కాకపోయినప్పటికీ.. ఏదో ఒక మాధ్యంలో వాటి మనుగడ సాగుతోందనే అభిప్రాయం, కరోనా సంక్షోభ వాతావరణం ముగిశాక ఏదో ఒకనాటికి తిరిగి ప్రారంభం అవుతాయనే నమ్మకం ఉండేది. అయితే ఇవాళ అది అంతరించిపోయింది. పెరుగుతున్న భారం, అంతర్జాతీయంగా మీడియాలో వస్తున్న మార్పుల వలన వీటిని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది  ఈనాడు’కు కూడా అంత సంక్షోభం ఉందా? తెలుగు రాష్ట్రాల పత్రికల చరిత్రలోకి తాను అడుగుపెట్టిన నాటినుంచి ఈనాడు ఇప్పటివరకు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. అలాంటి ఈనాడు కూడా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోయిందా..? గ్రూపు పత్రికలను మూతపెట్టుకునే దశకు వచ్చిందా..? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. ఫౌండేషన్ తరఫున సాహిత్యానికి చేస్తున్న సేవగానే ఈ పత్రికలను భావిస్తూ వచ్చిన వారికి, ఇవి ఎలా భారంగా మారాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఈ పత్రికలను వ్యాపారంగా రామోజీరావు ఎన్నడూ చూడలేదు. తొలినుంచి చతుర, విపులల మీద కూడా అడ్వర్టైజ్మెంట్ల కోసం ప్రయత్నం కూడా పరిమితంగానే ఉండేది. తెలుగువెలుగు, బాలభారతం తో పాటు అవి కూడా ‘ఫౌండేషన్’ గొడుగుకిందికి వచ్చిన తర్వాత.. ఇక వాటి లాభనష్టాలను సంస్థ పట్టించుకోదని, ‘ఫౌండేషన్’ తరఫు భాషాసేవగా అవి.. ‘నిత్యం ఉషోదయాన సత్యం నినదించినట్లుగా..’ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని వాటి అభిమానులు అనుకున్నారు. కానీ.. వారు అనుకున్నది నిజం కాలేదు. ఆ నాలుగు పత్రికలు శాశ్వతంగా మూతపడ్డాయి రామోజీరావు ఏ పని చేసినా.. అనన్యమైన ప్రణాళికతో అనితర సాధ్యంగా చేపడతారని, చేపట్టిన ప్రతి పనినీ సక్సెస్ చేస్తారని పేరుంది. దానికి తగ్గట్టుగానే.. ప్రపంచంలో ఇతరత్రా ఆశలూరించే ఎన్నిరకాల కొత్త వ్యాపార పోకడలు వస్తున్నప్పటికీ.. ఒక అతిపెద్ద వ్యాపార సంస్థ అయినా అన్నింటివైపు దృష్టి సారించకుండా.. మీడియాలో మాత్రం తమ తిరుగులేని గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

తెలుగు మీడియా మొఘల్, తెలుగు ముర్డోక్ వంటి ముద్దుపేర్లను ఆయన అభిమానులనుంచి సంపాదించుకున్నారు. అయితే, ఆయన సామ్రాజ్యంలో మూతపడినవి కూడా మీడియా వ్యాపారాలు మాత్రమే రామోజీ గ్రూపులో ఉన్న అనేక వ్యాపారాల్లో ‘సోమ’ బ్రాండ్‌తో వచ్చిన కూల్ డ్రింక్ మాత్రం ఆదిలోనే దెబ్బతింది. ఈనాడు తర్వాత.. అంతే స్థాయిలో ప్రారంభం అయిన ఆంగ్ల దినపత్రిక Newstime 20 ఏళ్ల కిందట మూతపడింది. ఇప్పుడు ఈ నాలుగు సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ఈనాడు కాకుండా రామోజీరావు ఎంతో ఇష్టపడే, రైతుల వికాసం కోసం పనిచేసే ‘అన్నదాత’ మిగిలి ఉంది. ఈ నాలుగింటి మూతతో సాహిత్య పాఠకుల ఆశలు దారుణంగా దెబ్బతిన్నాయనే చెప్పాలి. వీటిని కరోనా కాలంలో నిర్వహించినట్లుగా కలకాలం.. ఈ-పత్రికలుగా కొనసాగించినా కూడా.. బాగుండేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.సాహిత్యానికి మార్కెట్  చచ్చిపోయిందా..

తెలుగు సాహిత్యానికి మార్కెట్ చచ్చిపోయిందా.. లేదా, ఆ మార్కెట్‌ యాజమాన్యాలు ఆశిస్తున్న స్థాయిలో ఉండడం లేదా అనే మీమాంస తలెత్తుతోంది. కరోనా సంక్షోభ వాతావరణం ఏర్పడినప్పుడు.. ఆంధ్రజ్యోతి గ్రూపునుంచి వస్తున్న సాహిత్య వారపత్రిక ‘నవ్య’ను మూసేశారు. ఆంధ్రభూమి వారపత్రిక కూడా మూతపడింది. మరికొన్ని పత్రికలు కూడా అంతరించిపోయాయి. ఇదే సమయంలో మరొక సంగతి కూడా గమనించడం అవసరం.కొన్ని చిన్న సాహిత్య పత్రికలు స్వచ్ఛంగా సాహితీసేవ చేస్తూనే ఉన్నాయి. గుడిపాటి సంపాదకత్వంలో పాలపిట్ట నిరాటంకంగా నడుస్తోంది. నాణ్యమైన సాహిత్యాన్ని వారు అందిస్తున్నారు. అలాగే నెల్లూరు నుంచి కోసూరు రత్నం పబ్లిషర్‌గా ఈతకోట సుబ్బారావు సంపాదకుడిగా ‘విశాలాక్షి’ సాహితీ మాసపత్రిక వస్తోంది. విశాఖ నుంచి ‘విశాఖ సంస్కృతి’ అనే పత్రిక సన్యాసి రావు సంపాదకత్వంలో వస్తోంది. ‘సహరి’ ఆన్ లైన్ వారపత్రికగా ప్రతివారం.. ఈ-బుక్ ఫార్మాట్ లోనే వస్తోంది. వీరు రచయితలకు రెమ్యునరేషన్లు కూడా ఇస్తూ నడుపుతున్నారు. గొర్లి శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న పత్రిక ఇది. ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి.

ఈ పత్రికలు కరోనా కాలంలో కూడా ముద్రణ జరిగాయి. సాహిత్యాభిమానులకు అందుతూనే ఉన్నాయి ఇక్కడ ఒక సంగతి గుర్తించాల్సి ఉంది. భారం పరంగా చిన్న పత్రికలకు, పెద్ద పత్రికలకు ఒక గణనీయమైన తేడా ఉంటుంది. పత్రిక ముద్రణ వలన.. ప్రతి కాపీ మీద కొంత ‘నష్టం’ తప్పదనుకున్నప్పుడు.. చిన్న పత్రికలకు చిన్న నష్టం ఉంటుంది.. పెద్ద పత్రికలకు చాలా పెద్ద నష్టం ఉంటుంది. అలాంటి వ్యాపారకారణాల దృష్ట్యా చూస్తే చిన్నవి మాత్రం మనుగడ సాగించడం పెద్ద విశేషం కాదు. ఆ క్రమంలో నవ్య, ఆంధ్రభూమి వ్యాపారభారం వలన మూతపడడం వింత కాదు. కానీ.. పత్రికల నిర్వహణే రామోజీ ఫౌండేషన్ తరఫున చేపడుతూన్న చతుర, విపుల, తెలుగువెలుగు, బాలభారతం మూతపడడం మాత్రం ఆశ్చర్యం మారుతున్న సాంకేతిక ధోరణులు అందిపుచ్చుకోలేదే..
మారుతున్న సాంకేతిక విప్లవం, మీడియా ధోరణులు, అంతర్జాల విస్తృతి, పాఠకుల అభిరుచుల  నేపథ్యాన్ని కూడా మూసివేత కారణాల్లో వివరించారు. అయితే ఆ కొత్తతరం ధోరణుల్ని రామోజీ గ్రూపు లేదా రామోజీ ఫౌండేషన్ అందిపుచ్చుకోవడంలో విఫలమైందా అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. కొత్తతరానికి తగ్గట్టుగా ఈటీవీ, ఈటీవీ భారత్ లను ఆయా కాలాల్లో ప్రారంభించిన రామోజీరావు సారథ్యంలో.. ఆన్లైన్ మాధ్యమంలో ఈ పత్రికల నిర్వహణ వారికి భారమైందా? అనే అనుమానమూ కలుగుతోంది.

ఈ తరంలో ఇంటర్నెట్‌లో అనేక సాహిత్య పత్రికలు వస్తున్నాయి. సారంగ, సంచిక, ఈమాట, గోతెలుగు, సుకథ, ప్రతిలిపి, గోదావరి వంటి అనేక సాహిత్య పత్రికలు ఒకదానికి ఒకటి పోటీకాకుండానే.. ఎవరికి వారు ఇంటర్నెట్ సాహిత్యపత్రికలను నడుపుతున్నారు. కొన్ని వెబ్ సాహిత్య పత్రికలు రచయితలకు రెమ్యునరేషన్లు కూడా ఇస్తున్నాయి. కొన్ని వెబ్ పత్రికలు ఇంటరాక్టివ్‌గా.. రచయితలే తమ రచనల్ని డైరక్టుగా సైట్ లో పబ్లిష్ చేసేసే తరహాలోనూ నడుస్తున్నాయి. ఇలాంటివి ఆ సంస్థకు నిర్వహణ భారం కొంత తగ్గిస్తాయి.ఇలా చేస్తే ఎందుకు కుదరదు..?

రామోజీ ఫౌండేషన్ చెబుతున్నట్లుగా ఆర్థిక భారం అనే కారణాన్ని అర్థం చేసుకోవచ్చు. మారుతున్న పోకడల్లో భవిష్యత్తులోనైనా వీటి నిర్వహణ తలకుమించిన భారం అవుతుందనే అభిప్రాయం రామోజీ ఫౌండేషన్ లో ఉండవచ్చు. ఇప్పుడు ఈ-పత్రికలుగా నిర్వహించే క్రమంలో వచ్చిన కథలను వడపోసిన తర్వాత.. పేజీలుగా డిజైన్ చేయించడం ఒక పని.. అందుకు డిజైనర్లు వ్యవస్థ కూడా కొంత భారమే అని అనుకోవచ్చు. కానీ.. ఈ-బుక్  అనే ఫార్మాట్‌ను విస్మరించి.. కేవలం వెబ్ పత్రికగానే నిర్వహిస్తే అందులో నెలవారీ ఉండగల ఆర్థిక భారం ఎంత అనేది ఆలోచించాల్సిన విషయం.

ఆ భారం చాలా పరిమితంగా మాత్రమే.. ఒక లక్ష రూపాయలకు కూడా మించకుండానే ఉంటుంది.ఈ రోజుల్లో చాలా పత్రికలు రచయితలకు రెమ్యూనరేషన్లు ఇవ్వడం లేదు. చాలా పద్ధతిగా, గౌరవంగా ఆ సొమ్ము చెల్లించే సంస్థల్లో రామోజీ గ్రూపు ఉంది. అందుకు వారిని అభినందించాలి. అయితే ఇవాళ్టి తరంలో రచయితలు ఎవ్వరూ రెమ్యునరేషన్ సొమ్ము కోసం ఆశించి రాస్తున్న వాళ్లు కాదు. భాషాభిమానం, సాహిత్యాభిమానంతో మాత్రమే రాస్తున్నవారు. రామోజీ ఫౌండేషన్ కూడా భాషకోసమే, సేవ గానే ఈ పని చేస్తున్నప్పుడు.. రచనలకు రెమ్యునరేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఒక్క ప్రకటన చేస్తే… అందరూ  కూడా సహర్షంగా దానిని స్వాగతిస్తారు. వచ్చిన రచనల్ని వడపోయడం, వెబ్ మాధ్యమంలో అప్‌లోడ్ చేయడం మాత్రం కొనసాగించినట్లయితే.. ఆర్థిక భారం.. నెలకు లక్షకంటె ఎట్టి పరిస్థితుల్లోనూ మించదు.
ఈనాడు దినపత్రికను నిర్వహిస్తున్న సంస్థకు, తెలుగు భాషను సముద్ధరించడానికి ప్రతి పరభాషా పదానికి- సమానార్థక తెలుగు పదాలను సృష్టించి మరీ అనితరసాధ్యమైన రీతిలో భాషా సేవ చేస్తున్న రామోజీ ఫౌండేషన్ వారికి.. ఈ భారం లెక్కలోనిది కాదనే రామోజీరావు అభిమానులు, ఈనాడు ప్రియులు భావిస్తున్నారు. వికీపీడియా వంటి సంస్థలు అనేకం.. సమాచారాన్ని ఉచితంగా యావత్ ప్రపంచానికి అందుబాటులో ఉంచుతూ.. నిర్వహణ పరంగా ఎదురవుతున్న భారాన్ని పంచుకోవడానికి స్వచ్ఛంద విరాళాల్ని ఆహ్వానిస్తుంటాయి. ఈ పత్రికల విషయంలో రామోజీ గ్రూపు అలాంటి ప్రయత్నం చేసినా.. తెలుగు సాహిత్య ప్రియులు, ప్రత్యేకించి ఈనాడు గ్రూపు పత్రికల నాణ్యత మీద అభిమానం ఉన్న వారినుంచి అలాంటి విరాళాలు.. ఆ పరిమిత భారానికి తగినవిధంగా రాకపోవు.

అందుకే.. అన్ని ఫార్మాట్‌ల నుంచి పత్రికల మూసివేతకు తీసుకున్న నిర్ణయంలో చిన్న పునరాలోచన, చిన్న సవరణ వస్తే బాగుంటుందని రామోజీరావు అభిమానులు, సాహిత్య ప్రియులు, తెలుగు భాషా సాహిత్య పత్రికల హితులు కోరుకుంటున్నారు. అవిరామ ప్రస్థానానికి తెరపడి, ఆగిపోయిన అద్భుత పత్రికలకు ఇది అశ్రువీడ్కోలు!

–   కె.ఎ. మునిసురేష్ పిళ్లె
ఎడిటర్, ఆదర్శిని
99594 88088