తెలంగాణలో శ్రీగంధం సాగుకు ప్రోత్సాహం

213

హైదరాబాద్, మార్చి 2 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో శ్రీగంధం సాగుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని, రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిశీలిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో కలిశారు. శ్రీగంధం చెక్కల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని, శ్రీగంధం కలప ఉత్పత్తుల అమ్మకాలకు లైసెన్స్‌లు, డీలర్ షిప్‌లు ఇవ్వాలని రైతులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభ్యర్ధించారు. చందనం స్మగ్లర్ల నుండి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. శ్రీగంధం రైతులు పేర్కొన్న అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

నల్గొండ జిల్లాకు చెందిన పి.ఇస్తారపు రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన కె.రవిందర్ రెడ్డి రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో శ్రీగంధం తోటలు సాగు చేయడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు. 15 సంవత్సరాల వ్యవధిలో 36 లక్షల రూపాయల లాభం అర్జించామని రైతులు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హార్టీకల్చర్ డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.