డాక్టర్ వీజీఆర్ కృషి అద్వితీయం

624

వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవంలో ప్రముఖ సినీ నటుడు డాక్టర్ సుమన్
వీజీఆర్ డయాబెటిస్ అట్లాస్ రెండవ ఎడిషన్ ఆవిష్కరణ
డాక్టర్ వేణుగోపాలరెడ్డి సేవలను కొనియాడిన పలువురు వైద్య ప్రముఖులు

విజయవాడ: మధుమేహవ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రఖ్యాత డయాబెట్టాలజిస్టు డాక్టర్ కె.వేణుగోపాల్ రెడ్డి చేస్తున్న కృషి అద్వితీయమైనదని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ సుమన్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వార్షికోత్సవ కేక్ కట్ చేసిన అనంతరం సుమన్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని అన్నారు. షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే కన్ను, గుండె, కాళ్లు తదితర ప్రధానమైన అవయువాలపై ప్రభావం పడుతుందని, మధుమేహవ్యాధి నిశ్శబ్దంగా ప్రాణాలను హరిస్తుందని హెచ్చరించారు. విద్యార్థి దశ నుండి మధుమేహవ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశంగా చేర్చాలని అన్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం నెలకొనివుందని, వ్యాధి తీవ్రమయ్యేంత వరకు చికిత్స తీసుకోకపోవడం వల్ల ముప్పు అధికంగా ఉంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాధి వలన వచ్చే అనర్థాల గురించి పేషేంట్లకు అర్ధమయ్యేలా వీడియోల ద్వారా వివరించడంతో పాటు, జబ్బు వల్ల నష్టపోయిన వారి ఉదంతాలను ఉదాహరణగా చూపిస్తే ప్రజల్లో మార్పు వస్తుందని అన్నారు. డాక్టర్ వీజీఆర్ రచించిన డయాబెటిస్ అట్లాస్ రెండవ ఎడిషన్ ను ఈ సందర్భంగా సుమన్ ఆవిష్కరించారు.

మధుమేహం గురించి తెలుగులో ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలతో పోల్చితే ఇది చాలా భిన్నమైనదని, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో సరళమైన భాషలో, సంబంధిత చిత్రాలను పొందుపరిచి ఈ మధుమేహవ్యాధికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వాన్ని డాక్టర్ వీజీఆర్ తీర్చిదిద్దారని ప్రస్తుతించారు. డయాబెటిస్ పేషేంట్లతో పాటు, సామాన్య ప్రజలకు సైతం ఈ పుస్తకం అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. వీజీఆర్ ట్రస్టు ద్వారా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని, మొక్కల పంపిణీ, కరోనా విపత్తు సమయంలో వీజీఆర్ ట్రస్టు సేవా కార్యక్రమాలను డాక్టర్ సుమన్ కొనియాడారు.
హాస్పిటల్ నందు ఉన్న అత్యాధునిక సదుపాయాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.

మధుమేహవ్యాధిగ్రస్తులు, స్కూల్ విద్యార్థుల కోసం ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలకు గాను డాక్టర్ వీజీఆర్ అందుకున్న అవార్డుల గురించి తెలుసుకున్న సుమన్.. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్పూర్తితో మధుమేహవ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం కోసం తాను కూడా కృషి చేస్తానని, వీజీఆర్ ట్రస్టు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానని సుమన్ తెలిపారు. వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వీజీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఐదువేలకు పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని, వెయ్యికి పైగా రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నామని తెలిపారు. మధుమేహం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పుస్తకాలను రూపొందించి, దాదాపు ఐదు లక్షల ప్రతులను ప్రజలకు ఉచితంగా అందజేశామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 30 వేల మొక్కలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసినట్లు చెప్పారు. మధుమేహవ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారంతో తీర్చిదిద్దిన డయాబెటిస్ అట్లాస్ రెండో ఎడిషన్.. మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తాము చేస్తున్న మహోద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని డాక్టర్ వీజీఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ ఓవైపు మధుమేహవ్యాధికి అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూనే, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డాక్టర్ వీజీఆర్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని అన్నారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడిగా దేశంతటా పర్యటించానని, డాక్టర్ వీజీఆర్ చేస్తున్న కార్యక్రమాలు అసామాన్యమైనవని డాక్టర్ సమరం ప్రశంసించారు. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి సైతం మధుమేహానికి దారితీస్తుందని, మధుమేహ వ్యాధి కారణంగా మానసిక రుగ్మతలున్న వారు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకుని, సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకోవడం ద్వారా మధుమేహవ్యాధి దుష్ప్రభావాల నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ అట్లాస్ ప్రతి ఇంటిలో ఉండాల్సిన పుస్తకమని డాక్టర్ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ సుమన్ ను హాస్పిటల్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు