ఓడిపోగానే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా?

318

తిరుపతి, మార్చి 1 (న్యూస్‌టైమ్): ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నిబంధనలు, కోవిడ్‌ నియమాలను ఉల్లంఘించి ధర్నా చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కేవలం శాంతిభద్రత సమస్య సృష్టించాలని, దాన్ని తనకు అనుకూల మీడియాలో చూపించి ప్రజలను ఆకట్టుకోవాలనే కుట్రలో భాగమే చంద్రబాబు చర్య అని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు, కోవిడ్‌ నియమ నిబంధనల మేరకు జిల్లాకు రావొద్దని అధికారులు ముందే చంద్రబాబుకు లేఖ రాశారని గుర్తుచేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఎయిర్‌పోర్టులో బాబు నానా యాగీ చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా ఒక్క శాతం కూడా ప్రజల మద్దతు పొందలేడన్నారు.

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో 80 శాతం పైగా స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుందన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ చంద్రబాబు సాధించేదేమీ లేదన్నారు. టీడీపీ తరఫున నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు లేరన్నారు. అన్యాయం, అక్రమం జరిగిందని తనకు కావాల్సిన మీడియాలో చూపించే వంకతో ఎయిర్‌పోర్టులో చంద్రబాబు డ్రామా చేస్తున్నాడని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఎయిర్‌పోర్టులో వీడియో చిత్రీకరణపై కూడా ప్రభుత్వం విచారణ జరిపిస్తుందన్నారు.

కనీసం రెండు గంటలు కూడా చంద్రబాబు ధర్నా చేయలేడని, ఎయిర్‌పోర్టులో ఆహారం తీసుకొని కాఫీ తాగాడని చెప్పారు. టీవీల్లో చూపించడానికి ముందు కింద కూర్చొని డ్రామా చేసిన తరువాత వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడంటే ప్రజలను తప్పుదోవపట్టించాలనే ఆలోచన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు వెళ్లిన నాటి ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ను రన్‌వేపై నిర్బంధించిన నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. వైయస్‌ జగన్‌ ఆనాడు గౌరవప్రదంగా తన డిమాండ్లను తెలిపి.. తరువాత వచ్చే విమానంలో తిరిగి బయల్దేరి వెళ్లారని చెప్పారు.

చంద్రబాబు గౌరవప్రదం లేకుండా ఉదయం నుంచి నానా యాగీ చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మద్దతుగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నరేంద్ర చౌదరి, కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్‌రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, బీటీ నాయుడు, జవహర్, పీతల సుజాత తదితర నాయకులు చంద్రబాబును అరెస్టు చేసినట్లుగా ట్విట్టర్‌లో మాట్లాడుతున్నారని, చంద్రబాబును ఎవరు అరెస్టు చేశారు? ఎవరు ఇబ్బంది పెట్టారు? గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌ను అవమానించినప్పుడు ఆ రోజున ఈ నాయకులకు గుర్తుకులేదా? గొప్ప నాయకులని చెప్పుకునే వీరంతా చంద్రబాబు తానా అంటే తందానా పలుకుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రగిరిలో ఓడి కుప్పం పారిపోయిన చంద్రబాబు.. నేడు కుప్పంలో ఓడి దిక్కుతోచని స్థితిలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి ఫైరయ్యారు. ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడాలనుకుంటున్నాడని దుయ్యబట్టారు.

ఏం జరిగిందని ధర్నా చేయడానికి వచ్చారని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ‘‘గతంలో అసెంబ్లీలో ఉన్న 67 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్లో 23 మందిని లాక్కొని నలుగురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినప్పుడు ప్రజాస్వామ్యం తెలియదా? వైయస్‌ఆర్‌ సీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లను కొనుగోలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఆ రోజున ప్రజాస్వామ్యం కనిపించలేదా? ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ప్రజాస్వామ్యం లేదా? అలాంటి నువ్వు ఈ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది.’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 18 నెలల పాలనలోనే 90 శాతం హామీలు అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. ఇచ్చిన మాట మీద నిలబడి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారని, అందుకే ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలిచారన్నారు. చంద్రబాబు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రజలు ఒక్క శాతం మద్దతు కూడా ఇవ్వరని, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఎయిర్‌పోర్టు నుంచి తొందరగా ప్రయాణమై తిరిగి వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కోరారు.