యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు

138

అమరావతి, మార్చి 1 (న్యూస్‌టైమ్): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మే నెల చివరి నాటికి ‘కాఫర్‌ డ్యామ్‌’ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం నిర్మాణంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జే శ్యామలరావు, ఈఎన్‌సీసీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పోలవరం నిర్మాణ పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. స్పిల్‌ వే పూర్తికాకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని అధికారులతో చర్చించారు. గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 లలో భారీ ఎత్తున కోతకు గురైందని అధికారులు ప్రస్తావించారు. ఫలితంగా వరదల సమయంలో స్పిల్‌ఛానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు.

గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోంది

ఈ పనులు అన్నింటిపైనా ఇప్పుడు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని, స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందన్నారు. స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనివల్ల వచ్చే వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మే నెలాఖరు నాటికి కాఫర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలియజేశారు. పోలవరం సహాయపునరావాస కార్యక్రమాలపై కూడా సీఎం సమీక్షించారు.

ఎత్తు తగ్గింపు లేదు..

పోలవరం ఎత్తు తగ్గింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ కథనాలను పట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై సమీక్షలో చర్చకు వచ్చింది. ఎత్తు తగ్గించేది లేదని, అసలు అలాంటి అవకాశమే లేదని అధికారులు స్పష్టంచేశారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సెంట్రల్‌ వాటర్‌కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టంగా చెప్పాయని అధికారులు అన్నారు. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోందని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వెల్లడించారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..

నదుల అనుసంధానంపై రాష్ట్రం తరఫునుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ఉండాలన్నారు. నదుల అనుసంధానం వల్ల ఇక్కడ ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అయోమయాలకు, సందిగ్ధతలకు తావులేకుండా, ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వాటిని కేంద్రానికి పంపుదామని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై ప్రతిపాదనల నేపథ్యంలో అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

పోలవరం వద్ద వైయస్‌ఆర్‌ గార్డెన్స్‌ నిర్మాణం

పోలవరం వద్ద జి–హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం, వైయస్‌ఆర్‌ గార్డెన్స్‌పై మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. ఆహ్లాదం, అందం పెరిగేలా వైయస్‌ఆర్‌ గార్డెన్స్‌ నిర్మాణ రీతులు ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, నిర్వహణా వ్యయం కనిష్టంగా ఉండేలా డిజైన్లను రూపొందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఈ బ్రిడ్జి నుంచి జి–హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డును అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సీఎం వైయస్‌ జగన్‌ సానుకూలత వ్యక్తం చేశారు.