మనుబోలులో ధాన్యం కొనుగోలు కేంద్రం

361

నెల్లూరు, ఫిబ్రవరి 27 (న్యూస్‌టైమ్): సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో సజావుగా సాఫీగా రైతులు తాము పండించుకున్న ధాన్యం అమ్ముకొని, గిట్టుబాటు ధర పొందడానికి అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు.

‘‘రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యంకు చెందిన లావాదేవీలను చేపడుతున్నాం. రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లతో సంప్రదించి, రైతులకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత అధికారులదే. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా, తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకొని గిట్టుబాటు ధర రాబట్టుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.’’ అని కోరారు.

‘‘చంద్రబాబు పాలనలో కరువుకాటకాలతో రైతులు అల్లాడిపోతే, జగన్మోహన్ రెడ్డి పాలనలో సుభిక్షంగా రెండు పంటలు పండించుకుంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ రైతు భరోసా పేరిట రైతు కుటుంబాలందరికీ రూ.13,500/-ల చొప్పున పెండింగ్‌లో ఉన్న కుటుంబాలకు కూడా చెల్లింపులు పూర్తి చేశాం. చంద్రబాబు రైతు రుణమాఫీ పేరిట, ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి రైతులను నిలువునా మోసం చేశాడు.’’ అని అన్నారు.

‘‘సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పేరిట అంతులేని అవినీతికి పాల్పడి, రైతుల పేరిట కోట్లాది రూపాయల దోచుకున్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి, అధిక ధరకు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చేసి, తెలుగుదేశం నాయకులు అడ్డంగా దొరికిపోయి, జైలుపాలయ్యారు. బండేపల్లి కాలువ పేరిట ఎక్కడలేని ప్రచారం చేసి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకుండా, చేతులు దులుపుకొని రైతులను మోసం చేశారు. బండేపల్లి కాలువ నిర్మాణ విషయంలో తెలుగుదేశం నాయకులు చేసిన పాపాలు, రైతుల పాలిట శాపాలుగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే బండేపల్లి కాలువ నిర్మాణానికి నిధులు విడుదల చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. తెలుగుదేశం నాయకులు బండేపల్లి కాలువను అడ్డుపెట్టుకొని దోచుకొని తినాలనే ఆలోచన తప్ప,రైతాంగ శ్రేయస్సు గురించి ఆలోచన చేయలేదు.’’ అని చెప్పారు.

‘‘మనుబోలు మండలంలో సమగ్రంగా సాగు నీరు అందించడంతో 27 వేల ఎకరాలలో ఎన్నడూ లేనివిధంగా వరి పంటలు పండించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగ అవసరాలకు కట్టుబడి పని చేశాం కాబట్టే, అన్ని వర్గాలతో పాటు రైతు కుటుంబాలు ఆశీస్సులు అందించడంతో ఎన్నడూ లేనివిధంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 102 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, శ్రమించి, చెమటోడ్చి గెలిపించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోవు యం.పీ.టీ.సీ., జెడ్పిటిసి ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కూడా భారీ మెజారిటీ సాధించి, జగనన్నకు కానుకగా అందిద్దాం.’’ అని పేర్కొన్నారు.