రాజుగారిపై కుట్ర జరుగుతోందా?

1529

మత మార్పిళ్లపై మాట్లాడుతున్నందుకేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

కనుమూరి రఘురామకృష్ణంరాజు. తెలుగు ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నుంచి.. ఆయన తరచూ చెప్పే  యుశ్రారైకాపార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన రాజుగారు, గత 11 నెలల నుంచి నియోజకవర్గానికి వివిధ కారణాలతో దూరంగా ఉంటున్నారు. గత కొద్దికాలం నుంచి మతమార్పిళ్లకు వ్యతిరేకంగా, బీజేపీ కంటే గట్టిగా మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజుకు,  నర్సాపురం నుంచే కష్టాలు ప్రారంభం కావడం ప్రస్తావనార్హం.

క్రైస్తవంలోకి వెళ్లిన దళితుల రిజర్వేషన్లు తొలగించి, నిజమైన దళితులకు న్యాయం చేయాలన్న ఆయన పోరాటానికి, పార్లమెంటులోని ఉత్తరభారత దేశ బీజేపీ ఎంపీలు సైతం ఆకర్షితులయ్యారు. అసలు రాష్ట్రంలో హిందువులకు వ్యతిరేకంగా ఏ సంఘటన జరిగినా, ఎక్కడ దేవాలయాలపై దాడులు జరిగినా బీజేపీ కంటే ముందుగా, ఆయనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాజు పార్టీకి సంబంధం లేకుండా ‘సనాతన స్వదేశీ సేన’.. అంటే ఎస్..ఎస్..ఎస్‌ను ప్రారంభించారు ఈ ఆర్..ఆర్..ఆర్!

నిజానికి  ఏపీలో మత మార్పిళ్లు, టీటీడీలో అన్యమత ఉద్యోగులు, దేవాలయాలపై దాడుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన మొదటి ఎంపీ ఆయనే. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ను కలసి.. రాష్ట్రంలో ఏ స్థాయిలో, ఎవరి ప్రోద్బలంతో మతమార్పిళ్లు జరుగుతున్నాయో వివరించారు. ఆ సందర్భంలోనే  క్రైస్తవమతంలోకి మారిన దళితుల రిజర్వేషన్లు రద్దు చేసి, వాటిని మతం మారని హిందూ దళితులకు ఇవ్వాలన్న డిమాండును తెరపైకి తీసుకువచ్చారు.

రఘురామకృష్ణంరాజు ఈ డిమాండు లేవనెత్తిన తర్వాతనే, బీజేపీ ఆ అంశాన్ని ఎత్తుకుని, హటాత్తుగా మానుకుంది. అయితే విచిత్రంగా బీజేపీ అందుకోవలసిన ఆ నినాదాన్ని సెక్యులర్‌పార్టీగా ముద్ర పడిన తెలుగుదేశం అందుకోవడమే విస్మయపరిచింది. మతం మారిన క్రైస్తవుల రిజర్వేషన్ల రద్దు, గ్రామాల్లో పెరుగుతున్న చర్చిల నిర్మాణాల, పాస్టర్లకు గౌరవ వేతనాలపై టీడీపీ విరుచుకుపడేందుకు.. ఒకరకంగా రఘురామకృష్ణంరాజు ప్రారంభించిన ఆ నినాదమే కారణం.

అ సందర్భంలో రాజుపై వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు నమోదు కావడం చర్చనీయాంశమయింది. అదే సమయంలో రాజు వైఖరిని నిరసిస్తూ క్రైస్తవ మత పెద్దలు, ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు కూడా నిర్వహించారు. తాజాగా ఎంపీ రాజు శుక్రవారం నర్సాపురం నియోజకవర్గ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఆయనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ప్రదర్శన కూడా నిర్వహించారు. అయితే, వారంతా దళితులు కారని, మతం మారిన క్రైస్తవులేనని రాజు అనుచరవర్గం సోషల్‌మీడియాలో ఎదురుదాడి ప్రారంభించింది.

తాజాగా ప్రధానిని కలసి 20 నిమిషాలపాటు జరిపిన భేటీలో దేవాలయాలపై దాడులు, టీడీపీ వ్యవహారాలు,  మతమార్పిళ్లపైనే చర్చించగా, ఆయన ఏయే ప్రాంతాలలో జరుగుతున్నాయని ఆరా తీశారు. దాన్ని బట్టి.. ఎంపీ రాజు ఆ అంశంపై ఎంత సీరియస్‌గా పోరాడుతున్నారో స్పష్టమవుతోంది. అమిత్‌షా భేటీలో కూడా ఇవే అంశాలను  ప్రస్తావించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో 11 నెలల తర్వాత ఎంపీ రాజు, శుక్రవారం తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆయన అనుచర వర్గం సన్నాహాలు కూడా చేసింది. అయితే, సిద్దాపురం బ్రిడ్జివద్ద ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని, ఉద్రిక్త పరిస్థితి సృష్టించి.. ఆ సాకుతో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, శని-ఆదివారాలు కోర్టుకు సెలవు కాబట్టి ..తనను  అరెస్టు చేసేందుకు కుట్ర జరిగిందన్న సమాచారం ఎంపీకి అందింది. ఈ విషయాన్ని వైసీపీ వర్గాలే ఆయనకు చేరవేసినట్లు సమాచారం. దానితో ఆయన ఈ విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, ఎవరూ అందుబాటులోకి రాలేదు. చివరకు, సీఎంఓ నుంచి వివరణ తీసుకున్న తర్వాతనే, నర్సాపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దీనితో మీడియా ముందుకొచ్చిన రాజు.. తన అరెస్టుకు జరుగుతున్న కుట్రను బయటపెట్టారు. టీటీడీ చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి, మంత్రి శ్రీరంగనాధరాజు కలసి తనను అరెస్టు చేయించే కుట్ర పన్నారని చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. సీఎంఓ నుంచి వివరణ తీసుకుంటానని, అప్పటికీ స్పందించకపోతే కోర్టుకు వెళ్లి తన పర్యటన ప్రారంభిస్తానని రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజు, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసు పోస్టింగులపై చేసిన విమర్శ ఆసక్తికలిగిస్తోంది.     ఇప్పటివరకూ రెడ్డి కులానికి చెందిన పోలీసు అధికారులను ఆ జిల్లాల్లో అంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ వేయలేదని, కేవలం తనను దృష్టిలో ఉంచుకునే అంతమంది రెడ్డి అధికారులను నియమించారని ఆరోపించారు.

అయితే.. లాజికల్‌తో పాటు, వ్యంగ్యాస్త్రాలు సంధించే రాజు, ఈ విషయంలో కూడా సీఎం జగన్‌ను వదిలిపెట్టలేదు. ఇవన్నీ జగన్‌కు తెలుసో తెలియదో తనకు తెలియదన్నారు. జగన్ పిరికివాడు కాదని, ఆయన చాలా ధైర్యం ఉన్నవాడని ఇంకోవైపు పొగిడారు. ఏదైతేనేం.. తనపై కుట్ర జరుగుతోందన్న విషయాన్ని రాజుగారు ఆరకంగా మీడియా ద్వారా వెల్లడించారు. మరి సీఎంఓ నుంచి ఆయనకు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి!