జగన్ ‘మూడు’ మారుతోందా?

712

-‘రాజధాని నిర్మాణాల’పై  ఫలించిన జగన్ వ్యూహం
-సర్కారుపై రాజధాని రైతుల్లో తగ్గుతున్న వ్యతిరేకత
-వైసీపీ నేతల అమ్ములపొదిలో కొత్త అస్త్రం
(మార్తి సుబ్రహ్మణ్యం)

అమరావతిలో ఆగిపోయిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయం ఏపీ సీఎం జగన్‌లో వస్తున్న మార్పునకు సంకేత మన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి రాజకీయ కారణాలు ఏమయినప్పటికీ, దానిని స్వాగతించాల్సిందే.  అసలు అమరావతిలో అదనంగా ఒక్క ఇటుక కూడా పడకూడదని మొదట్లో భీష్మించుకున్న జగన్ వైఖరి, రెండేళ్లలోనే మార్పులు రావడం సాధరణ విషయమేమీ కాదు. ఎవరికయినా మార్పు సహజమేనని, సీనియర్లు వెంటనే తమ తప్పులు గుర్తించి సరిదిద్దుకుంటే, అనుభవం లేని నేతలు కొద్దిగా ఆలస్యంగా తమ తప్పులు గుర్తిస్తారని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదేమైనా అమరావతి అంశంలో జగన్‌లో వచ్చిన మార్పుతో తమకు కొత్త అస్త్రం దొరికినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ఈ అంశంలో టీడీపీకి తమను విమర్శించే అవకాశం ఉండదని ధీమా వ్కక్తం చేస్తున్నారు.

మూడు వేల కోట్ల రూపాయలతో, అమరావతి నగరంలో నిలిచిపోయిన భవనాలు నిర్మించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో అమరావతి ట్రంక్ ఇన్‌ఫ్రా కింద రోడ్లు, ఎల్‌పీఎస్ పనులకు సంబంధించి 3 వేల నిధులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే నిలిచిపోయిన నిర్మాణాలపై పలు విమర్శలు, ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం 50-70 శాతం పూర్తయిన నిర్మాణాలయినా పూర్తి చేయాలన్న డిమాండ్ చాలా కాలం నుంచీ వినిపిస్తోంది. కానీ, పాలనా రాజధానిని విశాఖకు తరలించే యోచనలో ఉన్న ప్రభుత్వం, అమరావతిలో భవన నిర్మాణాల అంశాన్ని పక్కనపెట్టింది.

ఇప్పుడు హటాత్తుగా మళ్లీ అక్కడ నిర్మాణాలు పూర్తి చేసేందుకు 3 వేల కోట్లు సమీకరించి, దానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించడమంటే, పాలనాపరంగా జగన్‌లో మార్పులు వస్తున్నట్లేనన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకూ.. మళ్లీ వచ్చే ఎన్నికల్లో  అసలు తమకు అమరావతి సమీపంలోని, గుంటూరు-కృష్ణా జిల్లాల్లో సీట్లు రాకపోయినా ఫర్వాలేదన్న మొండి పట్టుదల వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఆ రెండు జిల్లాల్లో ఓట్లు రాకపోయినా సరే, రాజధానిని కచ్చితంగా మార్చాలన్న ధోరణి ప్రదర్శించేవారని వైసీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు.

కాగా, అమరావతి రాజధానికి ఏడాది నుంచి అనుకూల ఉద్యమాలు జరుగుతున్నాయి. అంత ప్రతికూల పరిస్థితిలో సైతం,  ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో  వైసీపీ రెండు జిల్లాల్లో విజయం సాధించడంతో, జగన్ ఆలోచనా విధానం మారిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే రానున్న మున్సిపల్, జడ్పీ ఎన్నికల కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనను వైసీపీ వర్గాలు కొట్టివేస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీని ఓడించిన తమ పార్టీకి, కేవలం రెండు స్థానిక ఎన్నికల కోసం 3 వేల కోట్లతో భవనాలు నిర్మించడం ద్వారా.. ఓట్లు పొందాలన్న ప్రయత్నం చేస్తుందనుకోవటం హాస్యాస్పదమని ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో, టీడీపీపై ఎదురుదాడి చేసేందుకు తమకు కొత్త అస్త్రం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

‘పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు సహా టీడీపీ అగ్రనేతల నియోజకవర్గాల్లో మేం ఆ పార్టీని 80 శాతం తేడాతో ఓడించాం. ఆ ప్రకారంగా అక్కడ గెలవాలంటే, టీడీపీ వర్గాలు చెబుతున్నట్లు  కొన్ని వేల కోట్లతో ఇలాంటి పనులు చేయాలి. కానీ ప్రజలు జగన్ ప్రభుత్వ పనితీరుకు మెచ్చి మమ్మల్ని గెలిపించారు. రేపు అమరావతి నగరంలో ఆగిన భవనాలు నిర్మించాలని తీసుకున్న నిర్ణయం కూడా అభివృద్ధి కోణంలో తప్ప, ఓట్ల కోణంలో తీసుకున్నది కాదు. అది పాలనలో భాగంగా తీసుకున్న నిర్ణయమే తప్ప, రాజకీయపరమైన నిర్ణయం కాదు. చంద్రబాబు మాదిరిగా జగన్, రాజకీయ లాభ నష్టాలు ఆలోచించే రాజకీయ వ్యాపారి కాద’ని వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వీ.ఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటమి పాలయినా ఇంకా టీడీపీ, దానికి మద్దతునిస్తున్న మీడియా ఆలోచనలో మార్పు రాకపోవడం విచారకరమన్నారు.