పైసలిస్తేనే పోటీ చేస్తాం..!

431

మున్సి‘పోల్స్’పై చేతులెత్తేస్తున్న ‘సీమ’ తమ్ముళ్లు
అప్పులపై కుటుంబసభ్యుల ఆగ్రహం
పత్తా లేకుండా పోయిన మాజీ మంత్రులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిధులిస్తే తప్ప పోటీచేసేది లేదని రాయలసీమ టీడీపీ నేతలు స్పష్టం చే స్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో పరువు, ప్రతిష్ఠ కోసం అప్పులు తె చ్చి తమ స్థాయిలో పోరాడిన టీడీపీ నేతలు, మున్సిపల్  ఎన్నికల్లో మాత్రం పార్టీ నాయకత్వం నిధులు పంపించకపోతే,  పోటీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. కుటుంబసభ్యులు సైతం అప్పులు తెచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనితో మున్సిపోల్స్‌కు ముందే టీడీపీ కష్టాల్లో పడినట్టయింది.

ఎంకిపెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లు..  మార్చి 10న ఏపీలో జరగనున్న మున్సిపాలిటీ-కార్పొరేషన్ల ఎన్నికలు టీడీపీకి, ప్రాణసంకటంగా పరిణమించాయి. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్ధుల్లో చాలామంది వైసీపీలో చేరిపోగా, మిగిలిన అభ్యర్ధులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ నేతలకు, మున్సిపల్ ఎన్నికలు ప్రాణసంకటంలా పరిణమించాయి. పంచాయితీ ఎన్నికల్లో పరువు కోసం అభ్యర్ధులను నిలబెట్టి, వారిని గెలిపించేందుకు అప్పులపాలు కావలసి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి రావలసిన బకాయిలు నిలిచిపోవడంతో, అప్పులిచ్చే ఆసాములు ముఖం చాటేస్తున్నారు. కొత్తగా మళ్లీ అప్పులు పుట్టే పరిస్థితి లేదు. దీనితో ఏం చేయాలో తెలియని సీమ నేతలు చివరకు ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఆ ప్రకారంగా.. నాయకత్వం నుంచి నిధులు వస్తే తప్ప, ఎన్నికల రంగంలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ  నుంచి పంచాయితీ ఎన్నికల వరకూ, ఏదో ఒక రూపంలో జేబుకు చిల్లి పడుతూ వస్తోందని నేతలు వాపోతున్నారు. పోనీ పార్టీ అధికారంలో ఉండగా, ఏమైనా సంపాదించుకునేందుకు నాయకత్వం అవకాశం ఇచ్చిందా అంటే.. అప్పుడు పెత్తనమంతా అధికారులకు ఇచ్చారని గుర్తు చే స్తున్నారు.  కనీసం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇవ్వాల్సిన సొమ్ములయినా ఇప్పుడు సర్దుబాటు చేస్తే, వాటితోనయినా ఎన్నికలు నడిపించవచ్చన్నది వారి వాదన.

ప్రధానంగా టీడీపీ అగ్ర నేతలకు వారి కుటుంబసభ్యుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తలనొప్పిలా మారింది. పార్టీ కోసం అప్పులు చేయడాన్ని కుటుంబసభ్యులు అంగీకరించడం లేదు. ఇప్పటికే అప్పులు ఇచ్చిన వ్యాపారులు రోజూ ఇళ్ల వద్దకు వచ్చి కూర్చోవడాన్ని, నేతల కుటుంబసభ్యులు అవమానంగా భావిస్తున్నారు. రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు గానీ, అప్పులు చేయడాన్ని అంగీకరించేది లేదని కుటుంబసభ్యులు ఖరాఖండీగా చెప్పడంతో, పార్టీ నేతలు కూడా ఎన్నికలను వదిలేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్న పరిస్థితి ఏర్పడింది. తమ వద్దకు వస్తున్న కౌన్సిలర్ అభ్యర్ధులకూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

కాగా అధికారంలో ఉండి మంత్రి పదవులు అనుభవించి, కోట్లకు పడగలెత్తిన సీనియర్లలో చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అధికారంలో ఉండగా జిల్లాలపై పెత్తనం చేసిన ఈ తరహా నేతలంతా, ఇప్పుడు నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న వైనంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అగ్రనేతలు మంత్రులుగా ఉంటూ జిల్లాలపై పెత్తనం చేశారు. వారిలో ఇప్పుడెవరూ జిల్లాల్లో పార్టీకి నయాపైసా  సాయం చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఇక విశాఖలో పెత్తనం చేసిన గంటా శ్రీనివాస్ లాంటి నేతలు, పార్టీ ప్రతిపక్షంలోకి రావడంతో అసలు పార్టీకే దూరంగా ఉంటుండగా, నెల్లూరు జిల్లాలో పెత్తనం చేసిన నారాయణ వంటి నేతలు ఇప్పుడు భూతద్దం వేసి వెతికినా కనిపించని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పార్టీ అధికారంలో ఉండగా, హవా సాగించిన యనమల అచ్చెన్నాయుడు, .కళా వెంకట్రావు, యనమల  రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, పుల్లారావు, దేవినేని ఉమ, అమర్‌నాధరెడ్డి, పరిటాల సునీత వంటి అగ్రనేతలు.. ఇప్పుడు ఎన్నికల్లో కష్టాల్లో ఉన్న పార్టీ అభ్యర్ధులను, ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకురాకపోవడం విమర్శలకు దారితీస్తోంది.