ఇది.. ఎవరికి ‘చెప్పు’ దెబ్బ?

996

విష్ణువర్దన్‌రెడ్డికి ‘అమరావతి’ అనుభవం

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అత్యంత అసహ్యంగా, జుగుస్పాకరంగా, నేలబారుడుతనంగా, మరగుజ్జుగా మారుతున్న వైనం ఆందోళన కలిగించేదే. పార్టీలన్నీ కులరాజకీయాలను పట్టుకుని వేళ్లాడుతున్న వేళావిశేషంలో,  ‘కనిపించని కోవర్టు రాజకీయాలు’ ప్రవేశించడంతో ఎవరి రూపమేమిటో అర్ధం కాని పరిస్థితి.  ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీని ప్రేమించే, రాజకీయ ప్రేమికులను గుర్తించడమే కష్టమవుతోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల నుంచి నడుస్తున్న మత రాజకీయాలు మరో మలుపు. ఇన్ని గందరగోళాల నడుమ, ఎవరి పార్టీని వారు ప్రేమించే టీవీ చానెళ్లు-పత్రికల అలౌకిక ఆన ందానికయితే హద్దుల్లేవు. ఎవరి భజన వారిది. ఎవరి బురద వారిది. ఎవరి గోల వారిదే.

ఈ క్రమంలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి చానెల్‌లో వెంకటకృష్ణ అనుసంధాన కర్తగా నడిచిన ఓ చర్చా కార్యక్రమం, రచ్చగా మారటం హాట్ టాపిక్‌గా మారింది. అందులో అమరావతి జేఏసీ కన్వీనర్, దళిత నేత శ్రీనివాస్- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం, చివరాఖరికి విష్ణువర్దన్‌రెడ్డిని చెప్పుతో కొట్టేంతవరకూ వెళ్లింది. దీనితో స్టుడియోలో ఉన్న నేతలు, ఆ దృశ్యాలను చూస్తున్న ప్రేక్షకులు హతాశులవాల్సి వచ్చింది. ఏదేమైనా జరిగిన ఘటన దురదృష్టకరం. నోటికే పరిమతవాల్సిన వ్యవహారం, చేతి వరకూ వెళ్లడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. కాకపోతే, ఈ వ్యవహారంతోనయినా ప్రజలు బీజేపీ వైపు చూడాల్సివచ్చింది. నిత్యం మీడియాలో ఉండే విష్ణు త్యాగం వల్ల, అదే మీడియాతో  బీజేపీకి ఈ వ్యవహారం రాజకీయంగా ఉపయోగపడినా.. పడవచ్చు.

అలాగని, రైతులు నడిపించే ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న దళిత నేతను, విష్ణువర్దన్‌రెడ్డి పెయిడ్ ఆర్టిస్టు అనడమూ అంతకన్నా భావ్యం కాదు. ఇది ఒకరకంగా నెలల తరబడి ఓపికగా ఉద్యమిస్తున్న రైతులను, వారి త్యాగాలను  అవమానించడమే. అది హుందాతనం కాదు. సహజంగా అధికార పార్టీ మాత్రమే పేటెంటీ పొందిన ఆ పదాన్ని,  చర్చలో పాల్గొన్న బీజేపీ పెద్ద వాడటమే ఆశ్చర్యం. ఇలాంటి అరువు పదాలు,  పెదాల వరకూ వస్తే ఫలితం ఇంతకు భిన్నంగా ఉండదన్న ‘హెచ్చరిక సంకేతంగానే’ ఆ దృశ్యం కనిపించింది. పెద్ద మనుషులుగా కనిపించే నాయకులు, బహిరంగంగా అంత విశృంఖలంగా మాట్లాడతారన్న విషయం ఆ చర్చావేదిక బయటపెట్టింది. బహుశా ఇకపై అమరావతిపై డిబేట్లు పెట్టే చానెళ్లు, అందులో పాల్గొనే వారికి క్రికెటర్లు వాడే హెల్మెట్లు కూడా సరఫరా చేసి, ఐదడుగుల దూరంలో కూర్చోబెట్టాల్సి వస్తుందేమో?

ఇక టీవీలో ఇలా నిస్సిగ్గుగా కొట్లాడుకునే సంస్కృతి, అలాంటి సందర్భాలను నియంత్రించలేక నిర్వహకులు చేతులెత్తేయడం  ఇప్పుడే మొదలుకాలేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో,  అమరవీరుల కుటుంబాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘుమారెడ్డి అనే నేత ,  కొమ్మినేని శ్రీనివాసరావు ఎన్‌టీవీలో నిర్వహించిన చర్చావేదికకు హాజరయ్యారు. అందులోనే పాల్గొన్న టీఆర్‌ఎస్ విద్యార్ధి నేత బాల్క సుమన్‌తో ఆయనకు వాగ్వాదం జరిగింది. దానితో ఒక్కసారిగా లేచిన బాల్క సుమన్, రఘుమారెడ్డిపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దికాలం క్రితమే టీవీ 5లో సాంబశివరావు నిర్వహించిన ఓ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు పోసాని, తన పక్కనే ఉన్న కాంగ్రెస్ నేత వి.హన్మంతరావును దుర్భాషలాడుతూ, మీదకు లంఘించారు. ఇవన్నీ యూట్యూబ్‌లో ఇంకా కనిపిస్తూనే ఉంటాయి.

అయితే, ఈ ఘటనలేవీ పోలీసుస్టేషన్లు, కోర్టులదాకా వెళ్లలేదు.  ఎవరికీ శిక్షలూ  పడలేదు. ఇవన్నీ లోకోత్తర దృశ్యాలు. వాటిని చూసి అసహ్యించుకోవలసిందే తప్ప, అవి విశ్లేషణాంశం కావు. ఇప్పుడు భాజపేయుడు విష్ణువర్దన్‌రెడ్డి-దళిత నేత శ్రీనివాస్ యవ్వారమూ అంతే. గత ఏడాది విపక్ష నేత చంద్రబాబు నాయుడుపై, వైసీపీ కార్యకర్తలు చెప్పులు విసిరేస్తే పెద్ద గొడవయింది. అయితే దానిని డిజిపి గారు భావ ప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణించారు. కాబట్టి.. రేపు విష్ణువర్దన్‌రెడ్డి కేసు పెడితే, పోలీసులు బహుశా తమ డీజీపీ మాదిరిగానే, దానిని భావ ప్రకటనా స్వేచ్ఛగా వదిలేయాల్సిందే. తప్పదు!

ఇక అమరావతి దళిత రైతునేత శ్రీనివాస్ కొట్టిన చెప్పుదెబ్బ ఎవరి మీద? నేరుగా విష్ణునా? లేక తమను పెయిడ్‌ఆర్టిస్టులని విమర్శించే పార్టీలపైనా? అన్నదే ఇప్పుడు చర్చ. విష్ణువర్దన్‌రెడ్డి నోరు జారి పెయిడ్ ఆర్టిస్టు అని రైతులను సంబోధించి ఉండవచ్చు. లేదా తనను విమర్శించినందుకు కోపంతో, అమరావతి రైతులపై తన మనసులోని మాటనే విష్ణు బయటపెట్టయినా ఉండవచ్చు. అమరావతి రైతులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న కోపమయినా అయి ఉండవచ్చు. ఏదైతేనేం.. రైతు నేతను పెయిడ్ ఆర్టిస్టు అన్నందుకు విష్ణువర్దన్‌రెడ్డి చెప్పుదెబ్బతినాల్సి రావడం బాధాకరమే.

అయితే, ఈ దెబ్బ.. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ విమర్శిస్తున్న అందరికీ వర్తిస్తుందన్నది, ఇప్పుడు జేఏసీ నేతలు చెబుతున్న భాష్యం. దీనిని ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ ట్వీట్లకు అమరావతి జేఏసీ సోషల్ మీడియా ఘాటు జవాబివ్వడం మరో దెబ్బ.  ‘ఒక్క చెప్పుదెబ్బకే ఇంత గించుకుంటున్నారే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి రాజధాని రైతుల బ్రతుకుల మీద కొట్టారు. మహిళలను కడుపులో కొట్టారు. జుట్టుపట్టుకుని ఈడ్చారు. అప్పుడు గుర్తు లే వా ఈ నీతులు’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో అమరావతి మహిళల గురించి, విష్ణువర్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి తెరపైకి రావడం సహజమే. ఇవన్నీ కలిసి.. జరిగిన సంఘటనలో దళిత నేత శ్రీనివాస్ తప్పేమీలేదని చెప్పే ప్రయత్నంగానే కనిపిస్తోంది.

ఇక్కడ ఇంకో తమాషా. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో,  ఆయనకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా, చంద్రబాబు 20 కోట్లు పంపించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అది సంచలనం సృష్టించింది. దానిని బీజేపీ జిల్లా స్థాయి నేతలు కూడా ఖండిస్తే, ఎమ్మెల్సీగా ఉన్న వీర్రాజు అండ్ కో పెద్దగా పట్టించుకోలేదు. సునీల్ దియోధర్ కూడా నేరుగా స్పందించలేదు. అప్పటి అధికార ప్రతినిధి జీవీఎల్ నోరు తెరిస్తే ఒట్టు. పాపం దానిపై ఆవేశపడి, వ్యాసం రాసిన ఓ.వి. రమణను మాత్రం తర్వాత సస్పెండ్ చేశారు. అది వేరే విషయం. కానీ, ఇప్పుడు విష్ణు మీద జరిగిన దాడిని ఖండిస్తూ, అంతా ఒంటిచేతితో పోటీలు పడి ట్వీటుతున్న తీరే ఆశ్చర్యం.

చివరాఖరుగా… ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా? వద్దా అన్నది మరో పితలాటకం. కొట్టిన శ్రీనివాస్ దళితుడు. చెప్పు దెబ్బతిన్న విష్ణు అగ్రకుల రెడ్డి సామాజిక వర్గం. ఒకవేళ శ్రీనివాస్‌పై కేసు పెడితే అది దళితులపై బీజే పీ నేతల కక్షసాధింపుగా జనంలోకి వెళుతుంది. అలాగని విష్ణు తనను కులం పేరు పెట్టి దూషించారని ఫిర్యాదు చేసినా, అది వర్కవుట్ కాదు. కాకపోతే  యవ్వారంలో అటు తిరిగి ఇటు తిరిగి చర్చ పేరటం పెట్టిన  వెంకట కృష్ణ  అందరికీ ప్రత్యక్ష సాక్షి. అదీ సంగతి!