‘పీవీ’ కీర్తి ‘కారు’కు కలిసొస్తుందా?

691
PV's daughter as candidate for MLC polls a masterstroke by KCR

‘గ్రేటర్’ పరాభవం నుంచి గట్ట్టెక్కుతుందా?
చీలిపోనున్న బ్రాహ్మణుల ఓట్లు
పీవీ కుటుంబంలోనే చీలికలు
అభ్యర్ధిపై ‘బలిపశువు’ ప్రచారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని నగరంపై గులాబీ జెండా ఎగురేసిన టీఆర్‌ఎస్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న కల మాత్రం కలగానే మిగిలింది. ఆ కలను దివగంత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె వాణీదేవి  సాకారం చేస్తారా? గులాబీ దళపతి కేసీఆర్ కలను ఆమె సాకారం చేస్తారా? అన్న ఆసక్తి మొదలయింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిని బరిలోకి దింపకూడదని ఒక దశలో భావించిన కేసీఆర్, అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో వాణీదేవి టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా నింపింది. ఈ ఎంపిక ముందు, అసలు టీఆర్ ఎస్‌కు గెలిచే అవకాశం లేదన్న నిరాశతో ఉండటమే దానికి కారణం. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్ధి రామచందర్‌రావు బ్రాహ్మణ సామాజికవర్గానికే చెందిన వాణిని బరిలోకి దింపడంతో, ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. వాణి రంగప్రవేశం చేయకముందు.. రామచందర్‌రావు వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య ఉన్న పోటీ, ఇప్పుడు రామచందర్‌రావు వర్సెస్ వాణిగా మారింది. అంతవరకూ టీఆర్‌ఎస్ వ్యూహం ఫలించినట్లు చెప్పాలి.

ఈ నేపథ్యంలో  కేసీఆర్ నిర్ణయం సరైనదా కాదా? అన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గ ఓట్లు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చీలిపోవడం ఖాయం. బీజేపీ అభ్యర్ధి రామచందర్‌రావు ఒక బ్రాహ్మణ వర్గానికే కాకుండా, న్యాయవాద- విద్యార్ధి వర్గాలకు సుపరిచితుడు. బ్రాహ్మణ సంఘాలతో ఆయనకు ఏళ్ల తరబడి సంబంధాలున్నాయి.  ఏబీవీపీ నేపథ్యం ఆయనకు కలసివచ్చే అంశం. ఉస్మానియా వర్శిటీలో చదివిన ఓటర్లలో ఎక్కువ మొగ్గు ఆయన వైపే ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ నేతగా అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరుంది.  పైగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య విజయంతో ఊపుమీద ఉన్న బీజేపీ, మరో గెలుపు కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించిన బీజేపీ, క్షేత్రస్థాయిలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్జీ ఇన్చార్జిగా, బీజేపీ ఇప్పటికే తన కార్యాచరణ మొదలుపెట్టింది.

ఇక టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా అనుకోకుండా బరిలో దిగిన వాణికి, పివి నరసింహారావు కార్డు ఎంతో కొంత కలసివచ్చే అంశం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న వాణి, హటాత్తుగా టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా అవతారమెత్తారు. ఆమెకు రామచందర్‌రావు స్థాయిలో సొంత సామాజికవర్గంతో అంత సంబంధాలు లేవు. ఓటర్లకు సైతం ఆమె పేరు పెద్దగా తెలియదు. కేవలం పివి కుమార్తె అన్న పేరు తప్ప, ఆమెకంటూ ఉన్న గుర్తింపు తక్కువ. దీనితో ఆమె గెలుపు భారాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మోయాల్సిందే. కేసీఆర్ స్వయంగా ఆమెను బరిలోకి దింపినందున, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కష్టపడక తప్పదు.

నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత ‘గ్రేటర్’ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీనితో ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకు,  కేసీఆర్ వ్యూహాత్మకంగా పివి కుమార్తెను తెరపైకి తీసుకువచ్చారు.  ఆమె బరిలో ఉన్నందున, ఎన్నికల ప్రచారంలో పివి కుటుంబ నేపథ్యం ఒక్కటే చర్చనీయాంశమవుతుందన్నది, కేసీఆర్ వ్యూహంగా స్పష్టమవుతోంది.

అయితే, కేవలం పివి కార్డు ఒక్కటే వాణిని గెలిపిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ వ్యూహాత్మకంగా వాణిని బరిలోకి దింపి, బీజేపీకి షాక్ ఇచ్చినప్పికీ.. అది ఫలితాలలో ఎంతమేరకు గట్టెక్కించగలదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టిన బీజేపీ-కాంగ్రెస్.. దాదాపు ఒకే నినాదంతో ప్రచారం ప్రారంభించడం టీఆర్‌ఎస్‌కు ఇరకాటంగా మారింది.  నిజంగా పివి  కుటుంబంపై కేసీఆర్‌కు అంత ప్రేమ ఉంటే ఆమెకు రాజ్యసభ, ఎమ్మెల్సీ సీటు ఇవ్వకుండా, ఓడిపోయే సీటు ఇచ్చి బలిపశువును చేస్తున్నారన్న విమర్శకు ఆ రెండు పార్టీలు పదునుపెడుతున్నాయి. బీజేపీ నేత డికె అరుణ నుంచి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి వరకూ ఇదే అస్త్రం సంధిస్తున్నారు. దీనిని క్షేత్రస్థాయికి చేర్చే పనిలో ఉన్నారు.  మరోవైపు పివిని సీఎం, కేంద్రమంత్రి, ప్రధానిని చేసింది తమ పార్టీయేనని, కాంగ్రెస్ ఎదురుదాడి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో పివి కార్డుతో అభ్యర్ధిని గెలిపించాలన్న టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది మొదలయింది.

తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు కీర్తి ప్రతిష్ఠలు, టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా మారిన ఆమె కుమార్తె ఓటు బ్యాంకుకు పూర్తి స్థాయిలో ప్లస్ అవుతుందన్న గ్యారంటీ ఏమీ లేదన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను నిర్మూలించి, బీసీ,ఎస్సీలలో రాజకీయ చైతన్యం తెచ్చిన ఎన్టీఆర్‌ను ఇప్పుడు మర్చిపోయారని విశ్లేషిస్తున్నారు. అలాంటిది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం భూ సంస్కరణలు తెచ్చి, దేశానికి ప్రధానిగా చేసిన పివి సేవలను ఇంకా గుర్తుపెట్టుకుంటారనుకోవడం భ్రమే అవుతుందని రాజకీయ పరిశీలకు విశ్లేషిస్తున్నారు.

కాగా, వాణి ఎంపిక వ్యవహారైం  పివి కుటుంబసభ్యుల్లోనే అసంతృప్తికి గురిచేసింది. తమ చిన్నమ్మకు ఓడిపోయే సీటిచ్చిన కేసీఆర్ పివి కుటుంబాన్ని మోసం చేస్తున్నారని పివి మనవడయిన సుభాష్ విమర్శించారు. బ్రాహ్మణుల ఓట్లు చీల్చేందుకే వాణిని బరిలోకి దింపపారని ఆయన చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే.. పివి కుటుంబానికి ఓడిపోయే సీటిచ్చారన్న విపక్షాల విమర్శలకు బలమిచ్చిన ట్లు స్పష్టమవుతోంది. మరి ఈ సెంటిమెంట్ ప్రచారాన్ని కేసీఆర్ ఎలా అధిగమిస్తారో చూడాలి.