బీజేపీలో.. ‘ఒకే ఒక్కడు’!

866

కడపలో గెలిచి నిలిచిన ఆదినారాయణరెడ్డి
బీజేపీ అగ్రనేతల ఇలాకాల్లో  బోల్తా
పోటీనే పెట్టలేని పార్టీ అధికారంలోకి వస్తుందా?
కమల దళంలో అంతర్మథనం
          ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎప్పుడొచ్చావన్నది కాదనయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్.. హీరో మహేష్ డైలాగును బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసి చూపించారు. ఏపీ బీజేపీలో థర్టీ ఇయర్స్, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేతల ఇలాకాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, మెజారిటీ శాతం సీట్లలో అసలు అభ్యర్ధులెవరూ పోటీనే చేయలేదు. చేసిన చోటేమో బొక్కబొర్లా పడ్డారు. 13, 16, 20 ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థులూ లేకపోలేదు. గుర్రం గుడ్డిదయినా దాణాకు లోటు లేదన్నట్లు.. పేరుకేమో, రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలు.  మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు. అధికారంలోకి వచ్చేస్తామన్న బీరాలు. ఇలాంటి బాపతు నేతలకు బీజేపీలో కొదువ లేదు. సొంత ఊళ్లలో ఠికాణా లేని నేతలు, సొంత నియోజకవర్గంలో పట్టుమని పదిమంది కౌన్సిలర్లు, గ్రామవార్డు మెంబర్లను గెలిపించుకోలేని వారంతా బీజేపీలో మహానేతలు. జాతీయ స్థాయి నేతలు. ఇంటిపక్కన వాళ్లు కూడా గుర్తించలేని మహానాయకులయితే వందలమంది. వారికి నామినేటెడ్ పదవుల కీర్తికిరీటాలూ! ‘తిండికి తిమ్మరాజులు పనికిపోతరాజులన్న’ సామెత, తమ నేతలకు సరిపోతుందన్నది పార్టీ శ్రేణుల ఉవాచ. నిజం సోమేశ్వరుడికెరుక?

ఇంతోటి దానికి స్టార్ హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో మీటింగులు, లక్షల రూపాయల్లో పార్టీ అద్దె భవనాలు, నేతలకు పెద్ద పెద్ద కార్లు,  ఫ్లెక్సీలు, ప్రెస్‌మీట్లు. సోషల్‌మీడియాలో హడావిడి! ఇదీ.. దేశంలో నాలుగుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ అనే జాతీయ పార్టీ నేతలు, ఏపీలో అనుభవిస్తున్న రాజకీయ వైభోగం. వీటికి గన్‌మెన్లు, నామినేటెడ్ పదవులు అదనపు ఆభరణం. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో ఏకంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీలో మాత్రం సొంతంగా పోటీ చేసి, ఒక సర్పంచిని కూడా గెలవలేని దిక్కుమాలిన పరిస్థితి. దశాబ్దాల నుంచి ఇదే దయనీయం!

తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా, బీజేపీ ‘పరాజయ పర్వం’ విజయవంతంగా కొనసాగింది. పార్టీలో చక్రం తిప్పుతున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి వంటి అగ్రనేతల నియోజకవర్గాల్లో, బీజేపీ ఎన్ని గెలిచిందన్నది పక్కనపెడితే.. అనేక పంచాయతీల్లో పోటీ చేయకుండా పారిపోయిన వైనం, రాష్ట్రంలో బీజేపీ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్ర కార్యవర్గంలో పదవులు అనుభవిస్తున్న నాయకుల సొంత ఊళ్లలో కూడా.. పార్టీ పోటీ చేసే దిక్కులేని, దిక్కుమాలిన పరిస్థితి బీజేపీకే సొంతం.

కడపలో పోటీ చేయాలంటే మహా మహా పార్టీలే హడలిపోతుంటాయి. చివరాఖరకు ఎన్నో ఏళ్లు అధికారం అనుభవించిన టీడీపీ సైతం, కడప జిల్లాలో పోటీ చేయాలంటే ముక్కి మూలిగి మమ అనిపిస్తుంటుంది. అలాంటిది జమ్మలమడుగు ఫ్యాక్షన్ నియోజకవర్గంలో, అధికార వైసీపీకి ఎదురునిలిచి పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 28 పంచాయతీలను గెలిపించడమంటే  ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ ఘనత బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికే దక్కింది. ఆయన తన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధులను బరిలోకి దింపారు. తన ఖర్చుతోనే ఎన్నికలు చేశారు. చివరకు 28 పంచాయతీలను గెలిపించారు. తన సొంత దేవగుడిలో ఏకగ్రీవం చేశారు. ఇంకో అద్భుతమేమిటంటే.. ఐదు పెద్ద పంచాయతీల్లో తాను నిలబెట్టిన అభ్యర్ధులను వేల మెజారిటీతో గెలిపించి, మీసం మెలేశారు.  ఆయనొక్కడే కాదు. ఎంపీ సీం రమేష్ కూడా తన ఇలాకాలో సత్తా చాటారు. అనంతపురంలో మరో నేత వరదాపురం సూరి కూడా ప్రత్యర్ధులతో చివరికంటా పోరాడారు.

నిజానికి కొత్తగా పార్టీలో చేరిన ఆదినారాయణరెడ్డి వంటి నేతలను చూసి, పార్టీలో థర్టీ-ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలుగా ఫీలయ్యే నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో మొదలయ్యాయి. రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిని, ఎన్నో ఎలక్షన్లు చేసిన ఆదినారాయణరెడ్డి వంటి సీనియర్ల సేవలను వాడుకునే,  తెలివితేటలున్న నాయకత్వం లేకపోవడమే విషాదం. కడపలో టీడీపీని మించి అద్భుత విజయం సాధించిన ఇదే ఆదినారాయణరెడ్డికి,  ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలన్న చర్చ గతంలో జరిగిన కోర్‌కమిటీ మీటింగ్‌లో జరిగింది.

ఆయనపై వైసీపీ కక్షసాధిస్తున్నందున, ఆయనకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలన్నది ఆ చర్చల సారాంశం. అయితే.. ఏపీలో పార్టీని ‘విజయాలబాటలో నడిపిస్తున్న’ రధసారథి సునీల్ దియోథర్ అనే మహానాయకుడు.. ‘ వ్యక్తుల గురించి ఇక్కడ చర్చ వద్దని’ హుకుం జారీ చేశారు. ఇప్పుడు అదే ఆదినారాయణరెడ్డి కడపలో పార్టీకి దిక్కయి, సునీల్‌దియోథర్‌కు సరైన సమాధానం చెప్పినట్లయింది.

కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్, వరదాపురం సూరి, రావెల కిశోర్ అగ్రనేతల సేవలను వినియోగించుకునే సత్తా రాష్ట్ర నాయకత్వానికి లోపించినట్లు,  పంచాయతీ ఫలితాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర అధ్యక్షుడు వారికి ఎలాంటి బాధ్యత అప్పచెప్పకపోవడమే ఆశ్చర్యం. ఈవిధంగా రాష్ట్రంలో పార్టీని ఇద్దరు ముగ్గురు అగ్రనేతలు, ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా మార్చారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో  వినిపిస్తున్నాయి.