(శ్రీనివాస్ కోడెం)
అరవయేళ్ళ పోరాటం
గడీల పాలాయేనా..
అమరుల త్యాగాలను
దొరల చెంతకు చేర్చెనా..
ఆకాంక్షలు ఆగమై
ఆశయాలు దూరమై
నిధులన్నీ భోగమై
నీళ్లన్నీ అమ్ముడై
నియామకాలు కల్లలై
నీరసించిపోవుచుండె
స్వరాష్ట్రానబిడ్డలు .
గొర్రెలు అడిగిందెవడు
బర్రెలు ఇమ్మందెవడు
భగీరథతొ బతుకెవ్వనికి
కాళేశ్వరం కాసులెవ్వనికి
హామీలు ఆటకెక్కే
పనికిరాని పనులొచ్చే.
దళితుడేడి ముఖ్యమంత్రి
లక్షల ఉద్యోగాలేవి
మాట తప్పితే తల
తెగిపడునని చెప్పలేదా?
వంద అబద్దాల చిట్టా
ఒక్కసారి విప్పాలా ?
తొలిరోజే తెగిపడింది
మననేలే దళిత తల
తలలేని మొండేమే
ఏలుతోంది ఏడేండ్లుగా…
తలలేని నిర్ణయాలు
తలనొప్పిగా మారాయి
కోరితెచ్చిన రాష్ట్రం
రాబందుల పాలాయే
అక్కున చేర్చిన ప్రజలను
దిక్కులేని వాళ్లుగా జేసీ
కాపాలకుక్కలుగా మారెను
మా నేతలు కొందరు.
దొర వేసే బొక్కలకు
మనలను బలిచేస్తుండ్రు.
ప్రజాపాలనెటోపోయి
రాజరికం వచ్చింది.
పాలాభిషేకాలూ….
తాళాలు, భజనలతో
తరించి పోతున్నరు.
గళాలన్ని గతితప్పి
అధికార భజన చేస్తున్నవి
ఎత్తిన పిడికిళ్లన్నీ
పోరుకోరకు చూస్తున్నవి
తెగించి కొట్లాడినోళ్లు
తగువుకు సిద్ధమవుతున్నరు
తిరగబడ్డ బిడ్డలంతా
అదును కొరకు చూస్తున్నరు
నైజాము వారసుడు
నరరూప రాక్షసుడు
నెత్తురు మరిగిన పులిలా
జనం సొమ్ము మెక్కుతుండే
అగమైన మన బతుకులు
బాగుపడాలనుకుంటే
దగాపడ్డబిడ్డలంతా
దండుగా కదలాలి
ఊరువాడ ఏకమయ్యి
పోరుబాట పట్టాలి
స్వరాష్ట్రాన్ని రక్షించగా
సమరంలో దూకాలి.
దొరల పాలనకు నేడు
చరమగీతం పాడాలి