తిరుపతి సీటు జనసేనకు ఇవ్వకపోతే ‘నోటా’కే ఓటు

556

ఆస్తులు కబ్జా చేస్తున్న వైసీపీ నేతల యత్నాలపై సీరియస్
బీజేపీకి సీటివ్వకూడదని బలిజ సంఘాల తీర్మానం
 నేడు  శ్రీకాళహస్తిలో మరొక భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో జనసేన అభ్యర్ధికి సీటు ఇవ్వకపోతే, ఏ పార్టీకీ ఓటు వేయకుండా నోటాను ఎంచుకోవాలని తిరుపతి బలిజ సంఘాలు తీర్మానించడం సంచలనం సృష్టిస్తోంది. తిరుపతి సీటు బీజేపీకి ఇవ్వకూడదని బలిజ సంఘం స్పష్టం చేసింది. కొద్దిరోజుల క్రితం ఐదు బలిజ సంఘాలు చంద్రగిరి సమీపంలోని ఒక తోటలో కుటుంబాలతో సహా సమావేశమయ్యాయి. దాదాపు మూడువేల మంది బలిజలు హాజరయిన ఈ సమావేశంలో, మహిళలే ఎక్కువగా గళం విప్పినట్లు సమాచారం. రాయలసీమలో అత్యధిక సంఖ్యలో ఉన్న బలిజలను రెడ్డి సామాజికవర్గం అణిచివేస్తోందని, చివరకు గత ప్రభుత్వం బలిజభవన్ కోసం ఇచ్చిన భూమి కూడా కబ్జా చేసేందుకు, రెడ్డి సామాజికవర్గ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీకి ఓటు వేయకూడదని తీర్మానించారు.

విశ్వసనీయ సమాచారం.. కొద్దిరోజుల క్రితం తిరుపతి ఉప ఎన్నిక లోక్‌సభ అభ్యర్ధి ఎంపిక అంశంపై,  తిరుపతి నియోజకవర్గంలోని ఐదు బలిజ సంఘాలు,  చంద్రగిరి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యాయి. వీటికి కుటుంబసమేతంగా హాజరయిన బలిజలకు సంఘం నేతలు భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో మాట్లాడిన మహిళా నేతలు, రాయలసీమ రాజకీయాల్లో బలిజలకు ప్రాధాన్యం తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో 9 మంది బలిజలు ఎమ్మెల్యేలుగా ఉంటే, ఇప్పుడు ఒక్కరు మాత్రమే వైసీపీలో ఉన్నారని వివరించారు.
52 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్‌లో.. వైసీపీ బలిజలకు కేవలం ఇద్దరు బలిజలకే సీట్లు ఇచ్చి, 9 మంది రెడ్లకు కేటాయించిందని గుర్తు చేశారు. తిరుపతిలో 48 శాతంతో 60 వేల మంది ఉన్న బలిజలకు ైవె సీపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని మహిళా నేతలు ప్రశ్నించారు. ఈలోగా స్పందించిన బలిజ నేతలు, తిరుపతి నగరంలో బలిజలకు సంబంధించిన పురాతన ఆస్తులను, వైసీపీకి చెందిన రెడ్డివర్గ నేతలు కబ్జా చే సుకుంటున్నారని చెప్పారు. ఒక టింబర్ డిపోను కూడా అదేవిధంగా స్వాధీనం చేసుకుంటే, మరొకరి ఆస్తి కబ్జా చేస్తే కోర్టు అడ్డుకుందని వివరించారు.

చివరకు గత చంద్రబాబు సర్కారు, బలిజ భవన్ కోసం ఇచ్చిన భూమి కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తుంటే, బలిజ కుల సమాజం ఏం చేస్తోందని మహిళలు ప్రశ్నించారు. తిరుపతిలో కమ్మ, రెడ్డి, యాదవ భవనాలు ఉన్నప్పుడు, బలిజ భవన్ ఎందుకు ఉండకూడదని ఆవేశంగా ప్రశ్నించారు. వైసీపీ నేతలను ప్రాధేయపడే బదులు, అందరం చందాలేసుకుని బలిజ భవన్ నిర్మించి, బలిజల సత్తా ఏమిటో వైసీపీ రెడ్డినేతలకు చూపించాలని మహిళలు పిలుపునిచ్చారు. దానికి స్పందించిన బలిజ సంఘ నేతలు.. నగరంలో ఆర్ధికంగా బలంగా ఉన్న వెయ్యి కుటుంబాలు లక్ష రూపాయల చొప్పున చందాలు వేసుకుని, బలిజ భవన్ నిర్మిస్తామని చెప్పారు. దానితో అప్పటికప్పుడు స్పందించిన మిగిలిన వారు, లక్షల్లో విరాళం ప్రకటించారు.

ఇక తిరుపతి ఉప ఎన్నిక లోక్‌సభ అభ్యర్ధిగా బీజేపీ నేతను ఎంపిక చేస్తే, ఎట్టి పరిస్థితిలోనూ ఓటు వేయకూడదని సమావేశం తీర్మానించింది. తిరుపతి సీటు జనసేనకు ఇస్తేనే అందరూ ఓట్లు వేయాలని, దానికి భిన్నంగా ఎంపిక జరిగితే బీజేపీ, వైసీపీ, టీడీపీకి బదులు.. నోటాకు వేయాలని బలిజ సంఘాలు తీర్మానించాయి. తిరుపతి అభ్యర్ధి ఎస్సీ అయినప్పటికీ, బలిజల సత్తా ఏమిటో తేల్చేందుకు జనసేనకే సీటివ్వాలని బలిజ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇదే డిమాండ్‌తో ఆదివారం నుంచి బలిజల ప్రాధాన్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో, బలిజ సంఘ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తిలో బలిజ సమావేశం జరగనుంది.

నిజానికి గత 15 రోజుల నుంచి తిరుపతి వేదికగా, రాయలసీమ బలిజ సంఘాలు భేటీ అవుతనన్నాయి. తిరుపతి నగరంలో బలిజల ఆస్తులే లక్ష్యంగా, వైసీపీకి చెందిన రెడ్డి వర్గ నేతల చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. పైగా.. తిరుపతి నియోజకవర్గం ఈసారి బలిజలు కైవసం చేసుకోకపోతే, ఇక అది రెడ్డి వర్గానికే శాశ్వతంగా దక్కుతుందన్న ఆందోళనతో ఉన్న బలిజ సంఘాలు, రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను అందుకు వేదికగా మలచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.