పెట్రోల్ ధరల పెంపు వెనుక కథ ఇదీ..!

0
244

పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ ధరలు పెరుగుతుంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు. ఇది ప్రస్తుతం అందరినీ తొలుస్తున్న సమస్య. అయితే ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం లోని పెద్దలకి అవగాహన లేదా? ఉంది. అవగాహన లేకుండా ఎలా ధరలు పెంచుతారు? కానీ కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ అడ్రెస్ చేస్తాను.

గత సంవత్సరం మార్చ్ నెలలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మన దేశం తో పాటు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగినది. అదే సమయంలో OPEC(Oil and Petrol Exporting Coorporation-ఒపెక్) దేశాల మీద ఆర్ధికంగా భారం పడింది. ఎందుకంటే క్రూడ్ ఉత్పత్తి చేసే దేశాలు కేవలం క్రూడ్ ఆయిల్ ఎగుమతుల మీదనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్ లేకపోవడంతో ఒక దశలో ఒక బారెల్ క్రూడ్ ఆయిల్ ధర $15 డాలర్లకి పడి పోయింది. కానీ ఈ దశలో భారత దేశం మాత్రం ప్రధానంగా సౌదీ అరేబియా నుండి క్రూడ్ కొనుగోలు చేసింది పాత రేటు కే. మన రిఫైనరీలు వీలున్నంత ఎక్కువ దిగుమతి చేసుకున్నాయి లాక్ డౌన్ సమయంలో. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతి దారు భారత్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. లాక్ డౌన్ సమయంలో మన దేశంలో డిమాండ్ లేదు కనుక సౌదీ నుండి ఆయిల్ కొనడం ఆపలేదు మనం.

ఇప్పుడు అన్ని దేశాలు క్రమంగా మళ్ళీ యధా పూర్వ స్థితికి వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒపెక్ దేశాలు క్రూడ్ ధరని పెంచే ఆలోచనలో ఉండగా మన దేశం విజ్ఞప్తి మేరకు ఆసియా ఖండం వరకు మునపటి ధరకే ఇవ్వడానికి ఒప్పుకున్నాయి[ఫిబ్రవరి 6 వ తారీఖున ఈ విషయం బిజినెస్ అనే వెబ్ పోర్టల్ ప్రచురించింది[On India protest Opec keeps Asia Oil Price unchanged]. ప్రధానంగా సౌదీ అరేబియా మన అభ్యర్ధనని మన్నించి ధరలు పెంచలేదు.

Yes! క్రూడ్ ధరలు నిలకడగానే ఉన్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పేరుగుదలకి కారణం వీలున్నంత వరకు వీటి ద్వారా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసమే! మరి బడ్జెట్ లో ఆదాయపు పన్ను పెంచాలి కానీ ఆ పని చేయలేదు. కార్పొరేట్ టాక్స్ పెంచాలి కానీ పెంచలేదు ఎందుకు ? కార్పొరేట్ టాక్స్ పెంచితే పరిశ్రమల మీద ఆర్ధికంగా భారం పడుతుంది తద్వారా ఉద్యోగాల మీద ఆ ప్రభావం పడుతుంది కాబట్టి పెంచలేదు. లాక్ డౌన్ వలన చాలా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి అన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచిత రేషన్ ఇచ్చింది అల్పదాయ ప్రజలకి. జీతాలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం చేయలేదు.

ఇక అసలు విషయంలోకి వద్దాం. 2020 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు లడాక్ దగ్గర 50 వేల మంది సైనికులని మోహరించింది మన దేశం. యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్ తో పాటు నిత్యం యుద్ధ విమానాలని గస్తీ లో ఉంచింది. కేవలం సైనికులని తరలించడానికే 10 వేల కోట్లు ఖర్చు అయ్యింది. ఇక మీరేజ్ యుద్ధ విమానం ఒక గంట గాలిలో ఎగిరితే అయ్యే ఖర్చు 6 లక్షలు అవుతుంది. ఒక Su-30 MKI అయితే ఒక గంటకి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఒక C-30 రవాణా విమానం లోడ్ తో గాల్లోకి లేచి దింపినందుకు అయ్యే ఖర్చు అక్షరాల 750 కోట్లు అవుతుంది. యావరేజ్ గా చూస్తే మొత్తం 10 నెలల కాలానికి రోజుకి 5 వేల కోట్లు ఖర్చు అయ్యింది[పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే రోజుకి లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది – ఇది రెండు లక్షల కోట్లకి కూడా పెరగవచ్చు. మీరేజ్, రాఫెల్ ల తో వాడే ఒక్కో మిసైల్ ఖరీదు 600 కోట్లు ఉంటుంది] మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? ఎక్కడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో గట్టిగానే నిలబడ్డది. దేశ భద్రత దృష్ట్యా ఇది తప్పని సరి ఖర్చు.

ఈ ఖర్చు అంతా కోవిడ్ టాక్స్ పేరు మీదనో లేదా యుద్ధ టాక్స్ పేరు మీదనో మన నుండి వసూలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఆయిల్ పూల్ ఖాతా మీదనే భారం వేస్తున్నది. అది కూడా ఇంకో రెండు నెలలు మాత్రమే. మే నెల ఆరంభం నుండి మళ్ళీ పెట్రో రేట్లు తగ్గుతాయి. భయం అవసరం లేదు. 100 రూపాయలు ఉన్న బీరు 160 అయితే ఎవడూ కిక్కురుమనరు కానీ పెట్రోల్ లీటర్ 100 అయిపోతున్నది అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఒక కుటుంబం తో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తే 2000 అవుతున్నది కానీ ఎవరికీ ఇబ్బంది అనిపించడం లేదు. స్టేట్ హైవే ల మీద టోల్ గేట్ లు పెట్టి వసూలు చేస్తుంటే మాత్రం కమ్మగా ఉంటున్నది. అసలు 10 ఖరీదు చేసే ఒక క్వార్టర్ విస్కీ ని 150 రూపాయలకి అమ్ముతుంటే ఎవడూ అడగడు కానీ దేశానికి అవసరం అయ్యే ఖర్చు మీద మాత్రం గొంతులు లేస్తాయి ఇది మన దౌర్భాగ్యం. అసలు మూడేళ్ళ కిందటే పెట్రోల్, డీజిల్ ని GST పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం అడిగితే ఎవరూ ఒప్పుకోలేదు ఎందుకంటే వీళ్ళు పంచే ఉచితాలకి వచ్చే డబ్బు VAT రూపంలో  వసూలు చేస్తున్నదే! అదీ చాలక దాతలు భక్తి తో దేవుడికి ఇచ్చిన దేవాలయ భూములని అమ్మేస్తున్నారు. వీళ్ళ వ్యాపారాలని, ఆస్తులని అమ్మి ఉచితాలకి ఇవ్వమనండి తెలిసివస్తుంది.

– పార్ధసారధి పోట్లూరి