కొత్త రథం సరే…పాత నిందితులను పట్టుకోలేదేం?

623

సీబీఐ విచారణ అటకెక్కినట్లేనా?
నాలుగు నెలలయినా కదలని కేంద్రం
                  ( మార్తి సుబ్రహ్మణ్యం)

దేశంలోనే సంచలనం సృష్టించిన అంతర్వేది ఆలయ రథం దహన సంఘటన, కొత్త రథం ప్రారంభంతో మళ్లీ తెరపైకి వచ్చింది. 2020 సెప్టెంబర్‌లో గుర్తు తెలియని దుండగులు, రథాన్ని తగులబెట్టిన ఘటన రాష్ట్రంలో అలజడి రేపింది. టీడీపీ, బీజేపీ ఆ ఘటనపై ఆందోళన నిర్వహించాయి. అంతర్వేదికి ర్యాలీగా వెళ్లిన సందర్భంలో, అక్కడున్న చర్చి అద్దాలపై కొందరు రాళ్లు వేశారు. ఆ ఘటనలో మాత్రం పోలీసులు ఆగమేఘాలపై స్పందించి కొందరిని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. కానీ, రథాన్ని తగులబెట్టిన ముష్కరులను మాత్రం ఇప్పటివరకూ పట్టుకోలేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

తాజాగా అంతర్వేదిలో సీఎం జగన్ కొత్త రధాన్ని లాగడం ద్వారా, దానిని ప్రారంభించారు. మూడు నెలల సమయంలోనే జగన్ సర్కారు కొత్త రథం ఏర్పాటుచేయడం అభినందనీయమే. అయితే, ఇప్పటివరకూ పాత రథాన్ని తగులబెట్టిన నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో మాత్రం, ప్రభుత్వం విఫలమవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించేందుకు ఎవరికీ హక్కు లేదని, తాము 4 నెలల క్రితమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చామని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.  అంత‌ర్వేది ర‌థంసంఘ‌ట‌న‌పై సీబిఐ ద‌ర్వాప్తుపై రాష్ట్ర‌ బిజేపి నాయ‌కులు ఎందుకు  కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డం లేదు.. మౌనం వెనుక అర్థం  ఏమిటి అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు  ప్ర‌శ్నించారు.సిట్‌తో కూడా విచారణ జరిపిస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా కనిపెట్టకపోవడమే ఆశ్చర్యం. అంతర్వేది రథం దహనం కేసుపై టీడీపీ,బీజేపీ కంటే.. ఢిల్లీలో ఉన్న వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు ఒక్కరే గళం విప్పి, కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలసి వినతిపత్రం సమర్పించారు.

అంతర్వేది రథం దహనంపై రాష్ట్ర బీజేపీ నేతలు నానా యాగీ చేసి, విచారణకు డిమాండ్ చేశారు. అక్కడికి వెళ్లి నానా హడావిడి చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాయడంతో, బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో, రథం తగులబెట్టిన వైనంపై నానా యాగీ చేసిన బీజేపీ నేతలు, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా మౌనంగా ఉండటమే విస్మయం కలిగిస్తోంది. బీజేపీ నేతలకు నిజంగా రథంపై చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వద్దకు వెళ్లి, సీబీఐ విచారణ ప్రారంభించాలని ఒత్తిడి చేసేవారు. కానీ, ఇప్పటిదాకా బీజేపీ నేతలు ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. అసలు ఇప్పటిదాకా బీజేపీ నేతలు సీబీఐ విచారణపై ఎందుకు పెదవి విప్పడం లేదన్నది ప్రశ్న.

రథం తగులబడిన తర్వాత, రాష్ట్ర బీజేపీ నేతలు అనేకసార్లు వివిధ అంశాలపై నద్దా, అమిత్‌షాను కలిశారు. ఏ సందర్భంలో కూడా, రథం తగులబెట్టిన కేసులో సీబీఐ విచారణ ప్రారంభించాలని, తమ పార్టీ  డిమాండ్ చేసినట్లు ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా రెండురోజుల క్రితం అమిత్‌షాతో భేటీ అయినప్పుడు కూడా, అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభించాలని ఆయనను కోరకపోవడం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి, రాష్ట్ర బీజేపీ నేతలకు రథం తగులబెట్టిన నిందితులను తేల్చాలన్న చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంలో తొలుత రాష్ట్ర బీజేపీకి చెందిన ఇద్దరు ప్రముఖులు, సర్కారుతో సర్దుకుపోయినందుకే  అప్పట్లో బీజేపీ,  ఈ అంశంపై ఉద్యమం ఉధృతం చేయలేదన్న విమర్శలు వినిపించాయి.