ఎన్నికల్లో ఇదో ‘లడ్ల’ పంచాయితీ

0
337

వైసీపీ ‘గడప గడపకూ తిరుపతి లడ్డు’ పథకం
చంద్రగిరిలో ఇదో ఆధ్యాత్మిక ఎర
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రజల వద్దకు పాలన, ఇంటికే రేషన్ వంటి పధకాలు ప్రవేశపెట్టిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ‘ఇంటివద్దకే తిరుపతి లడ్డు’ పథకం ప్రవేశపెట్టి, భక్తుల పుణ్యం పుచ్చేలా చేస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న  పంచాయితీ ఎన్నికల్లో, చిత్తూరు జిల్లా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే ‘రెడ్‌మనీ’మంచినీళ్లు కూడా సిగ్గుపడేలా పారుతుంటే, కొత్తగా దానికి ఆధ్యాత్మిక ఎర తోడయింది. మరింకేం..? ఓ చేత్తో డబ్బు, మరోచేత్తో ప్రసాదంతో ఓటరు ఓటేసిపోతున్నారు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో అధికార వైసీపీ కొత్తగా ప్రవేశపెట్టిన, తాత్కాలిక బృహత్తర ఆధ్యాత్మిక పథకం. ఇది రెగ్యులర్‌గా ఉంటుందనుకుంటే లడ్డులో కాలేసినట్లే. ఈ బంపర్ ఆఫర్ జస్ట్.. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల వరకే సుమా!

ఇక చంద్రగిరి లోకంలో కాసేపు కాలుపెడితే.. ఇప్పుడక్కడ తిరుపతి లడ్డు ఉచితంగానే దొరుకుతోంది. తిరుపతి దాకా వెళ్లి, అక్కడ క్యూలో నిలబడి, ఆపసోపాలు పడి, సోష వచ్చి పడే సినిమా కష్టాలేమీ లేకుండా, ఎంచక్కా వైసీపీ నేతలు జగనన్న ఈమధ్య రేషన్ సరుకుల డెలివరీ కోసం ఇచ్చిన వాహనాల్లోనే లడ్లు పంపిణీ చేస్తున్నారు. దానితో భక్తులు కమ్ ఓటరు మహానుభావులు మహదానందపడి, ఫుణ్యానికి వచ్చిన లడ్లను కళ్లకు అద్దుకుని మరీ తీసుకుంటున్న దృశ్యాలు, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.

ఆ దృశ్యాలు చూసిన ఇతర ప్రాంతాల భక్తశిఖామణులు, తాము కూడా చంద్రగిరిలో పుడితే ఎంత బాగుండనుకుని, చంద్రగిరి వాసుల అదృష్టాన్ని చూసి యమ ఈర్ష్య పడుతున్నారు. అన్నట్లు వైసీపీ ప్రవేశపెట్టిన ఈ ఉచిత లడ్ల సేవ గురించి టీడీపీ యువనేత లోకేష్ కూడా ట్వీట్ చేసి, ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారనుకోండి. అది వేరే విషయం.టీటీడీ వారు మాత్రమే పంపిణీ చేయాల్సిన లడ్లు, రేషన్ సరుకుల వాహనంలో ఎలా వచ్చాయని అడక్కండి. కళ్లు ట్రాన్స్‌ఫార్మర్లలా పేలిపోతాయ్. టీటీడీ అంటే ఏమైనా పరాయిదా ఏంటి? అది కూడా ‘మనవాళ’్లదే కదా? అక్కడ కొలువు దీరింది కూడా మనవాడే కదా? మరి వడ్డించేవాడు మనవాడయితే, ఒక్క చంద్రగిరి ఏం ఖర్మ? చైనాకూ చాలా వీజీగా ఎన్ని లక్షల లడ్లలయినా పంపిణీ చేయవచ్చు. కాకపోతే జగనన్న రేషన్ డెలివరీ వాహనాలను, అక్కడిదాకా అనుమతించాలంతే!

రాష్ట్రంలో జగన్ సర్కారు ప్రాయోజితంతోనే మతమార్పిళ్లు జరుగుతున్నాయని ఓ వైపు ఆరోపణలు వస్తుంటే , చంద్రగిరిలో మాత్రం భక్తులకు ఏమాత్రం కష్టం లేకుండా శ్రీవారి ప్రసాదాన్ని ‘గడపగడపకు వైఎస్సార్’ పథకం మాదిరిగా,  ఇంటికే ప్రసాదం ఇచ్చిపోవడం విచిత్రంగా లేదూ?! ఏదయితేనేం చంద్రగిరి భక్తుల పుణ్యం పుచ్చింది.  స్వామి కార్యం, స్వకారంతో అటు అధికారపార్టీ నేతల జన్మ కూడా తరించిపోయింది. సంతోషం! సర్వేజనా లడ్లతో సుఖినోభవంతు!!