టీడీపీకి బ్రాహ్మణులు అక్కర్లేదా?

591

చంద్రబాబునే లెక్కచేయను
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలనం

తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడకు సంబంధించి నేరుగా టీడీపీ అధిష్టాన్నాన్నే టార్గెట్‌గా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ తెలుగు దేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని గురువారం కొందరు పార్టీ నేతలే అడ్డుకుని నిలదీసిన నేపథ్యంలో శుక్రవారం ఎపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న ప్రజాబలంతో విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తానని వెల్లడించారు. తాను ఎవరి వెనకా నడవబోనని, ఎవరైనా సరే తన వెంటే నడవాలని తేల్చి చెప్పారు. బెజవాడలో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్నా, వారిని పట్టించుకోవట్లేదని వెల్లడించారు.

టీడీపీకి ప్రజల్లో మంచి స్పందనే ఉందని.. కానీ, కొందరు పార్టీ నేతలే సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వ్యక్తిత్వంతో పాటు సమర్థత ఉన్నవాడినే నమ్ముతారని.. అవినీతిపరులు, లాలూచీపరులను ఆమడదూరం ఉంచుతారని వ్యాఖ్యానించారు. సబ్జెక్ట్‌ దగ్గరకొస్తే పార్టీ అధినేత చంద్రబాబునే లెక్కచేయనని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా పార్టీని నడపడం ఆయన బాధ్యత అని, తనతో పని చేయించుకోవడం చేతకాకపోతే వదిలేయండని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ కేశినేని నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘టీడీపీ గ్రౌండ్‌లో బాగానే ఉంది. కానీ, పార్టీ నాయకులే సామంత రాజులుగా వ్యవహరిస్తున్నారు. నాకు కావాల్సింది గెలుపు గుర్రాలు మాత్రమే. ఏం, బ్రాహ్మణ సామాజిక వర్గం టీడీపీకి అక్కర్లేదా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బ్రాహ్మణ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. కనకదుర్గ టెంపుల్ ఆలయం సమీపంలో 25 వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు. చంద్రబాబును కూడా చెప్పమనండి.. బ్రాహ్మణులు వద్దని! నేనూ సైలెంట్ అయిపోతా.

విజయవాడలో ఎలా గెలవాలో నాకు తెలుసు. బెజవాడ గెలుపు బాధ్యత నాది.. అది గెలిపించుకుంటా! సహకరిస్తే సహకరించండి.. లేదంటే, లేదు. సింగిరెడ్డిని పెట్టుకుంటారో, సంగీతా రెడ్డిని పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎవరిని నష్టపరుస్తున్నారు మీరు.. చంద్రబాబును, టీడీపీని! మా అమ్మాయి (కేశినేని శ్వేత)కి మేయర్ పదవి అక్కర్లేదు. వాస్తవానికి మేము పని చేస్తే తప్ప ఇక్కడ పార్టీ నిలబడదు. దాని కోసమే నేను పోరాడుతున్నా. నేను ఎవ్వరికీ లొంగను.. చంద్రబాబుకు కూడా నేను లొంగను. ఎన్ఆర్‌సీ బిల్లుకు మద్దతుగా లోక్‌సభలో ఓటెయ్యమన్నా.. నేను వెయ్యలేదు. ఈ రోజు ముస్లిం సోదరులు బిహార్ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడికెళ్లినా చెప్పుకుంటారు. ఎన్నార్సీకి అనుకూలంగా చంద్రబాబు వద్దన్నా నేను వినలేదు. ప్రజల కోసం నేను ఎంత వరకు పోరాడుతాను.

నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను.. నన్ను ఉపయోగించకపోతే అది నీ ఖర్మ. చంద్రబాబుకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తే చేపించుకోమను.. లేకుంటే వదిలెయ్యమను.’’ అంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు టీడీపీలో తలెత్తిన సంక్షోభం సంచలనం రేపుతోంది. డైరెక్ట్‌గా పార్టీ అధిష్టానంపైనే ఎంపీ కేశినేని నాని నిప్పులు చెరగడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీ కేశినేని కామెంట్స్‌పై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.