బీజేపీ ‘ఉక్కు’ సంకల్పం..భల్లే..భల్లే!

364

‘ట్వీట్’పై సోము తికమక
మీడి యాపై ఎదురుదాడి
( మార్తి సుబ్రహ్మణ్యం)

చెప్పేవాడు చంద్రబాబయితే, వినేవాడు వెర్రివాడన్నది రెండేళ్ల క్రితం వరకూ అందరినోటా వినిపించిన వ్యంగ్యస్త్రం.  ఇప్పుడు చెప్పేవాడు వీర్రాజుయితే వినే వాడు విలేకరన్న కొత్త సామెత అందరినోటా నానుతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై కమలదళపతి సోమువీర్రాజు చెప్పిన వింత భాష్యం వింటే,  ఎవరైనా ఆయన తెలివికి తెల్లబోవలసిందే. ఆఫ్టరాల్ ట్వీట్‌కే ఇంత యాగీ చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలపై విరుచుపడిన వీర్రాజువారు, మరి అదే ఆఫ్టరాల్ ట్వీట్‌కు కలవరపడి ఢిల్లీకి ఎందుకెళ్లారన్న విలేకరుల ప్రశ్నకు సోము దగ్గర సమాధానం లేకపోవడమే హాశ్చర్యం.

స్టీల్‌ప్లాంట్, మతమార్పిళ్లు, శాంతిభద్రతల సమస్యపై మూడురోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అమిత్‌షా- నద్దాతోపాటు, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. విశాఖ ఉక్కు ప్రైవీటకరణ అడ్డుకోవాలని వినతిపత్రం సమర్పించారు. తర్వాత విజయవాడ వచ్చి, ‘వీర్రాజు బృందం సాధించిన విజయ గాథలను’ వివరించేందుకు శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టారు. అయితే అందులో తాము ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెబితే బాగుండేది. తమ ఒత్తిడి ఎంతవరకూ ఫలించింది? అమిత్‌షా ఎలా స్పందించారు? కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి విస్పష్టమైన హామీ ఏమైనా పొందారా? అన్న వివరాలేమైనా చెబుతారా అని విలేకరులు ఎదురుచూశారు.

అయితే వీర్రాజు చివరాఖరకు రెండుపేజీల ప్రకటన పాఠాన్ని చదివి వినిపించారు. అందులో సారాంశమేమిటంటే.. రాష్ట్రంలో హిందుత్వాన్ని నిరోధించేందుకు వైసీపీ-టీడీపీ కలసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఇరవై నెలలుగా రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ప్రభుత్వ మద్దతు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మతమార్పిడికి అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు, క్రిస్టియన్ మిషనరీలు చేస్తున్న  కుట్రగా అభివర్ణించారు. విదేశాల నుంచి మిషనరీలు నిధులు తెచ్చి మతమార్పిళ్లు చేస్తున్నారని ఆరోపించారు. చివరగా.. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర తన నిర్ణయం ప్రకటించకపోయినా, ఒక చిన్న ట్వీట్‌తో వైసీపీ-టీడీపీ రాజకీయ ఉద్యమాలు చేస్తున్నాయని విరుచుపడ్డారు. దేవాలయాలపై దాడుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఆ రెండు పార్టీలు, బీజేపీకి కావాలని పక్కకునెట్టి చేస్తున్న రాజకీయ క్రీడగా అభివర్ణించారు. ఇదీ వీర్రాజు ప్రెస్‌మీట్ సారాంశం.  అయితే, కేవలం ట్వీట్‌ను ఆధారం చేసుకుని,  కేంద్రాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నాయని వీర్రాజు విరుచుకుపడ్డారు. అయితే.. ‘అదే ఒక చిన్న ట్వీట్ ఆధారంగా వచ్చిన అంశంపై కంగారుపడి,  మీరెందుకు ఢిల్లీ వెళ్లారన్న’ జర్నలిస్టుల ప్రశ్నకు, వీర్రాజు నుంచి సమాధానం లేదు.పైగా ప్రశ్నలడిగిన వారిపై, పెద్దగొంతుతో ఎదురుదాడి చేయడంతో జర్నలిస్టులు హతాశులయ్యారు. ఎంపీలు లేకుండానే ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రశ్నిస్తే, అవన్నీ మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదని దాటవేశారే తప్ప, దానికి సమాధానం ఇవ్వలేదు.

పైగా  మీరడిగిన వాటికే సమాధానం చెప్పాలా? మేం అనుకున్నవి చెప్పకూడదా? అన్న ఎదురుదాడి వైఖరి, ఆయనకు చాలాకాలం నుంచి అలవాటయింది. దానితోపాటు చాలాకాలం నుంచి ప్రశ్నలడిగిన జర్నలిస్టులను.. టీడీపీ ఏజెంట్లుగా, ఒక కులానికి చెందిన వారిగా అనుమానించి, వారిపై ఎదురుదాడి చేయడాన్ని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో క్రిస్టియన్ మిషనరీలు విదే శీ నిధులతో మతమార్పిళ్లు చేస్తున్నారన్న సోము- జీవీఎల్.. కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉన్నందున, వాటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో, అందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా చెబితే చెబితే బాగుండేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

దీన్నిబట్టి సోము దగ్గర గొంతు తప్ప, సరుకులేదన్న విషయం ఖరారయిందన్న వ్యాఖ్యలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఒక జర్నలిస్టు గురించి, బీజేపీ శిక్షణా కార్యక్రమంలో విమర్శలు చేసిన వీడియో ఒకటి వెలుగుచూసింది.  విభజన జరిగిన తర్వాత కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ,  వారెప్పుడూ మీడియాతో  ఇలా ‘స్థాయి తక్కువ’గా వ్యవహరించలేదు. ఇక పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వెంకయ్యనాయుడు మీడియామ్యాన్ అన్న పేరుంది. బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కిషన్‌రెడ్డి వంటి  వారంతా  మీడియాతో హుందాగా వ్యవహరించారు. సూటిగా చెప్పాలంటే.. ఉమ్మడి- విభజిత రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసినవారెవరూ, రాష్ట్ర స్థాయి నాయకుల మాదిరిగానే వ్యవహరించారు తప్ప, ఒక వార్డు స్థాయి నేతగా ఎప్పుడూ వ్యవహరించలేదని పార్టీ సీనియర్లే విశ్లేషిస్తున్నారు.

హరిబాబు సాత్వికంగా ఉన్నప్పటికీ, నిర్దిష్టమైన విమర్శలే చేసేవారు. ఇక దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన కన్నా కూడా, ప్రత్యర్ధులపై విరుచుకుపడినా ప్రెస్‌మీట్లలో మాత్రం ఆచితూచి వ్యవహరించేవారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, పురందీశ్వరి…  చివరకు మోర్చాల అధ్యక్షులు కూడా ప్రెస్‌మీట్లలో హుందాగా వ్యవహనిస్తున్న విషయాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఎంపీ సుజనా చౌదరయితే వ్యక్తిగతంగా ఏ సందర్భంగా ఎవరినీ విమర్శించేందుకు సైతం సాహసించరు. ఇక యువ ఎమ్మెల్సీ మాధవ్ అటు సభలో గానీ, ఇటు బయటగానీ ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారు. మీడియా ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇస్తుంటారు. కౌన్సిల్‌లో హుందాతనంతో కూడిన ఆయన ప్రవర్తను అందరూ మెచ్చుకుంటారు కూడా. చివరకు మీడియాతో దశాబ్దాల అనుబంధం ఉన్న ఎంపీ జీవీఎల్ సైతం  చక్కగా మాట్లాడుతుంటారు. ఇష్టం లేని అంశాలను దాటవేస్తారే తప్ప, స్థాయి తక్కువగా ఎప్పుడూ మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకే ఆయన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్థాయికి ఎదగగలిగారు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుందన్న సామెత, సోము విషయంలో స్పష్టంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు అటు పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.

పంచాయితీ ఎన్నికల్లో తమ పార్టీ వారిని నామినేషన్లు వేయకుండా,  వైసీపీ అడ్డుకున్న విషయాన్ని కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశామని వీర్రాజు వెల్లడించారు. అయితే అదే ఎన్నికల్లో అసలు బీజేపీ ఎన్ని స్థానాలకు పోటీ చేసింది? ఎన్ని గెలిచిందన్న విషయాన్ని చెప్పకపోవడమే ఆశ్చర్యం. స్టీల్‌ప్లాంట్‌పై రాసుకువచ్చిన రెండు పేజీల స్క్రిప్టును చదివిన వీర్రాజు గానీ, ఆయన తర్వాత మీడియాతో మాట్లాడిన జీవీఎల్ గానీ.. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయమని ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోవడం మరో ఆశ్చర్యం. రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించిన జీవీఎల్.. అంతర్వేది రథం దగ్ధం కేసులో,  సీబీఐ ఇంతవరకూ ఎందుకు దర్యాప్తు ఎందుకు చేపట్టలేదన్న విషయాన్ని కూడా వివరిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సోము తాజా ప్రెస్‌మీట్, ప్రశ్నలు వేసిన మీడియాపై ఆయన  ఎదురుదాడి చూసిన బీజేపీ సీనియర్లు మరోసారి తలపట్టుకోవలసి వచ్చింది. ఏపీలో అసలే తమ పార్టీకి మీడియాలో స్థానం లేకుండా పోయిందని, అలాంటి పరిస్థితిలో సోము చేసే ఎదురుదాడి, గోదావరి వ్యంగ్యాస్త్రాలతో,  తమకు మీడియా పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని వాపోతున్నారు. ‘మాకు అసలే మీడియాలో స్పేస్ లేదు. వీర్రాజు గారి వైఖరి వల్ల పూర్తిగా మీడియాకు దూరమవాల్సి వస్తోంది. ఆయన ఒక్కడి వల్ల, మాకు కూడా జిల్లాల్లో మీడియావాళ్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం మానేశారు. వచ్చేది ఎన్నికల సీజన్. ఈ క్లిష్ట పరిస్థితిలో మీడియా మద్దతు సంపాదించాల్సిన మా పార్టీ, కేవలం మా అధ్యక్షుడి నోటిదురుసు వల్ల మొత్తం మీడియాకే దూరం కావల్సిన దుస్థితి వచ్చేలా ఉంద’ని పార్టీలో దశాబ్దాల నుంచి పనిచేస్తున్న ఓ సీనియర్ నేత వ్యాక్యానించారు. ఆయన అధ్యక్షుడయిన తర్వాత అనేక టీవీ చానెళ్లలో ప్రశ్నలడిన జర్నలిస్టులపై ఎదురుదాడి చేసి, వారిపై వ్యంగ్యాస్తాలు సంధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి, సోము వ్యవహార శైలివల్ల, పార్టీలో సీనియర్లు ఏ స్థాయిలో ఇబ్బందిపడుతున్నారో స్పష్టమవుతోంది.

మొత్తంగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన సోము అండ్ కోకు.. విశాఖ స్టీల్‌పై అక్కడ నిర్దిష్టమైన హామీ లభించలేదన్న విషయం ప్రెస్‌మీట్‌లో ఆయన మాటల బట్టి తేలిపోయింది. నిజంగా ఢిల్లీలో విస్పష్టమైన హామీ లభించి ఉంటే, దానిని బోలెడంత ప్రచారం చేసుకునేవారు.  అక్కడెలాంటి హామీ లభించకపోవడం.. అది చెప్పలేకనే, హిందుత్వం-మతమార్పిళ్లు-విశాఖ ఉద్యమాలపై ప్రెస్‌మీట్‌లో ప్రసంగాలు చేసినట్లు,  మెడమీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది.

ఇక చివరలో టీడీపీ కూడా సూడో సెక్యులర్‌విధానాలకు పాల్పడుతోందన్న వీర్రాజు వ్యాఖ్య పార్టీ వర్గాలను విస్మయపరిచింది. దేశాన్ని హిందూమార్గం పట్టించడమే పార్టీ లక్ష్యమన్నది సుస్పష్టం. అలాంటప్పుడు.. తన రాజకీయ ప్రయోజనాల కోసమయినా టీడీపీ ఆ దారిలో నడుస్తుంటే, దానిని సమర్ధించాల్సిన హిందూ పార్టీ అధ్యక్షుడు, దానిని ఆక్షేపించడమే వారి ఆశ్చర్యానికి కారణం. వీర్రాజు వ్యాఖ్యల వల్ల బీజేపీ తప్ప, మరెవరూ హిందూ కార్డును వాడటానికి వీల్లేదన్న సంకేతాలు,  ిహిందూ సంస్ధలు- హిందూ సమాజానికి వెళ్లే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.