కోటప్పకొండ ఘటనకు 112 ఏండ్లు

393

1909 ఫిబ్రవరి 18 వ తేదీ.కోటప్పకొండ వద్ద మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆనవాయితిగా యధావిధిగా ఎడ్ల బండ్లల్లో ప్రభలను అలంకరించుకుని కోటప్పకొండ బయలుదేరాడు సై సైరా చిన్నపరెడ్డి.

  ఎవ్వరీ చిన్నపరెడ్డి? ఏమిటా ఘటన ?
   రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భరతగడ్డపై దురహంకారంతో చెలరేగుతున్న రోజులు….
భారతమాత కన్నీటి బొట్లు మాతృనేలను చిత్తడి చేస్తున్న దయనీయమైన రోజులు …
ఈ  సమయంలో -దాస్య శృంఖలాల విముక్తి కోసం….స్వేచ్ఛావాయువుల సంచారం కోసం….
కుదేలవుతున్న జాతి చైతన్యం కోసం… ప్రాణాలకు తెగించి.. సమరోత్సాహంతో ముందుకు నడిచాడు ఒక యువకుడు.. !

వందేమాతరం అంటూ ఎందరో యువతీ యువకులను ముందుకు నడిపించి….పల్లె పల్లెని తట్టిలేపి…. గుండె గుండెలో ఫిరంగులు  మోగించి….  ఆత్మస్థయిర్యమే ఆయుధంగా   పిడికిలెత్తి నినదించిన ఆ యువకుడు సై సైరా  చిన్నపరెడ్డి !

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం మోతుబరి రైతు కుటుంబానికి  చెందిన గాదె సుబ్బారెడ్డి లింగమ్మ దంపతులకు రాయపరెడ్డి, రామిరెడ్డి, చెన్నారెడ్డి, కోటిరెడ్డి, నాగిరెడ్డి తర్వాత  ఆరవ సంతానంగా 1864లో  చిన్నపరెడ్డి జన్మించాడు. చిన్నపరెడ్డికి చదువు పెద్దగా అబ్బలేదు. కానీ కత్తిసాము కర్రసాము గుర్రపు స్వారీ వంటి అస్త్ర విద్యల్లో ఆరితేరాడు. రామాయణ మహాభారతం కథల్ని సమూలంగా ఔపాసన పట్టాడు.

పాలెగార్ … చిన్నపరెడ్డి
మంచితనం… మానవత్వం… పుష్కలంగా కలిగివున్న చిన్నపరెడ్డి తన చిన్నతనం నుండే పేదలను ఆకట్టుకున్నాడు. ప్రజల బాగుకోసం ఉన్నతి కోసం జీవితాన్ని ధారపోసాడు. చుట్టుపక్కల గ్రామాలను అధీనంలో ఉంచుకుని,తమ ప్రాంతంలో పాలేగార్ వ్యవస్థ లేకపోయినా  “పాలెగార్ ” గా ప్రజలచేత పిలవబడి, పాలనా దక్షతకు పరోపకారానికి ప్రతీకగా మిగిలిన ఇతడే …. ఇదే ప్రజల చేత సై సైరా చిన్నపరెడ్డి….అనిపించుకున్నాడు కూడా!

ఇక్కడ పాలెగార్  అంటే పాలించేవాడు అని అర్థం. పరాక్రమవంతులకు, వ్యూహప్రతివ్యూహాలు నడిపే రాజనీతిజ్ఞులు ఈ పదవికి అర్హులుగా చెప్పవచ్చు. దత్తమండలాలు  ప్రాంతంలో ప్రధానంగా పాలెగాళ్ళ వ్యవస్థ  ప్రతిష్టాత్మకంగా కొనసాగింది. ఈ ప్రాంతంలో మొత్తం  80మంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. ఈ వ్యవస్థ ప్రభావం తర్వాతి కాలంలో  పలనాడు ప్రాంతంలో  చిన్నపరెడ్డిలో కనబడింది అని మాత్రం  చెప్పవచ్చు.  చేబ్రోలు రెడ్డిపాలెం పరిసర ప్రాంతాలను  చిన్నపరెడ్డి తన  గుప్పిట్లో ఉంచుకున్నాడు.  చిన్నపరెడ్డి అజమాయిషీలో ఉన్నది  చేబ్రోలు పరిసర ప్రాంతమే అయినప్పటికీ మద్రాసు నగరం వరకు వీరికి అనుచరులు ఉండేవారు.

ఆంధ్రరాష్టంలో గుంటూరు జిల్లా 1906 లో ఏర్పాటు చేయబడింది. అంతకు పూర్వం గుంటూరు పరిసర ప్రాంతాలు చిన్న చిన్న రాజ్యాలుగా   కొనసాగేవి. వీటిలో చిన్నపరెడ్డి ఇలాఖ ఒకటి. ఇది కేవలం అనధికార ప్రజల రాజ్యం.

కోటప్పకొండ ఘటన :
దారుల వెంబడి జనాలు కూడా ఎప్పట్లా బారులు తీరి ఉన్నారు. అందరికి ముందుగా ఎత్తయిన ప్రభతో సాగిపోతున్న చిన్నపరెడ్డి బండి మీదే అందరి చూపులు ఉన్నాయి. అందరి ఉత్సాహం ఉత్తేజాన్ని నింపుతుండగా ఎడ్ల బండ్లు చేబ్రోలు దాటాయి.

నాదెండ్ల గ్రామం వద్ద అనూహ్య సంఘటన ఎదురయ్యింది. పెత్తందార్ల అనుచరులుగా కొందరు గ్రామస్థులు చిన్నపరెడ్డి బండ్లను అడ్డుకుంటూ దారికి అడ్డంగా తాళ్లు కట్టి భైఠాయించారు. చిన్నపరెడ్డి బండ్లు ఆగిపోయాయి. అడ్డుతగిలిన గ్రామస్థులు చిన్నపరెడ్డిని వెనక్కి వెళ్ళమని అరవడం మొదలెట్టారు. ఇది చేబ్రోలు కాదని గుర్తు చేస్తూ మరీ అరవడం మొదలెట్టారు.అందుకు చిన్నపరెడ్డి ఎంత మాత్రం జంకలేదు. బండి దిగి, అడ్డు తగిలిన జనాలతో మంతనాలు వెళ్తున్నట్టుగా నటించాడు. అది చూసి జనాలు పక్కకు జరిగారు. ఇంకేం? అదే ఉదుటన బండి మీదకు సింగంలా లంఘించి బండిని ముందుకు ఉరికించాడు.

దెబ్బకు తాళ్లు తెగిపోయాయి. బండెనుక బండ్లు అదే వరుసలో ముందుకు ఉరికాయి. అడ్డుతగిలిన జనాలు ఏమీ చేయలేకపోయారు.జనాలను ఉసిగొల్పిన పెత్తందార్లు మాత్రం పరిస్థితికి ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అవకాశం వస్తే చిన్నపరెడ్డిని  మట్టు పెట్టాలని  లేదా కనీసంగా అవమానించాలని ఎదురుచూస్తున్న తొత్తులకు  ఈసారి కూడా చిన్నపరెడ్డి తీరు భంగపాటునే కలిగించింది.

రెట్టించిన జాతర సమీపించిన చిన్నపరెడ్డి జాతరలో అదే బండిమీద తిరుగాడుతూ “వందేమాతరం – మనదే రాజ్యం ” అంటూ సింహనాదం చేసాడు. అది చిన్నపరెడ్డే అని బ్రిటిష్ సైన్యానికి తెలియంది కాదు. విషయం వెంటనే కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి 150 మంది పోలీసులు కోటప్పకొండను చుట్టుముట్టారు. ఈ విషయం చిన్నపరెడ్డికి తెలియలేదు. పసిగట్టిన రత్తమ్మ వాయువేగంతో విషయాన్ని చిన్నపరెడ్డికి చేర్చింది. చిన్నపరెడ్డి అప్రమత్తుడయ్యాడు. తప్పించుకునే మార్గంగా గుట్టల్లోకి వెళ్ళిపోయాడు.

అదే సమయంలో తిరునాళ్లలో తాగుబోతుల గొడవ అనుకోకుండా మొదలయ్యింది. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్, తిమ్మారెడ్డి అనే రైతు మధ్య సారాయి దుకాణంలో అల్లరి మొదలయ్యింది. సయ్యద్ హుస్సేన్ పోలీసు కాబట్టి, మిగతా పోలీసులు తిమ్మారెడ్డిపై  హంతకుడుగా అభియోగం మోపి, ఎటువంటి విచారణ లేకుండా అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించసాగారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ జనాలు పోలీసులను అనుసరించసాగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయసాగారు. ఆవేశాన్ని ఆపుకోలేక ఒక వ్యక్తి దారిలో శేషయ్య అనే పోలీసుని కర్రతో కొట్టాడు.  ఆగ్రహించిన శేషయ్య తనను కొట్టిన వ్యక్తిని గ్రహించుకోలేని వాడై మరొక వ్యక్తిని తన వద్ద ఉన్న కత్తితో పొడిచి చంపాడు.

ఇంకేం? పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనాలను చెదర గొట్టడానికి పోలిసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చిన్నపరెడ్డి ఎద్దు ఒకటి మరణించింది. అది చూసి ప్రజలు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. “” శివుడి సమక్షంలో శివుడి వాహనం నందీశ్వరుడిని చంపుతారా… ఇంక ఏ అరిష్టం దాపురిస్తున్నదో ” అంటూ జనాలు పోలీసుల మీద తిరగబడ్డారు. పోలీసు శేషయ్యను ఎట్టకేలకు దొరకపుచ్చుకున్నారు. తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన శేషయ్యపై గడ్డి పరిచి నిప్పు పెట్టారు. అంతటితో ఆగని జనాలు పోలీసు ఠాణాకు కూడా నిప్పుపెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారావు అక్కడికి వచ్చేసరికి సగం ఠాణా తగలబడింది. అది చూసి సుబ్బారావు కూడా పారిపోయాడు. ప్రజలు అంతకంతకు రెచ్చిపోతూ…. కలెక్టర్ జవాన్లను కూడా గాయపర్చారు. సైనికుల గుడారాలు తగులబెట్టారు. మొత్తానికి పరిస్థితి అదుపు తప్పింది. ప్రభుత్వ ఆస్తులు నాశనం అయ్యాయి.నేల రక్తసిక్తం అయ్యింది.

చిన్నపరెడ్డిపై నేరారోపణ :
అప్పటికే గుట్టల్లోకి వెళ్లిపోయిన చిన్నపరెడ్డికి ఈ మొత్తం ఘటనతో ఏ మాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ  జరిగిన మారణకాండ చిన్నపరెడ్డి జనాలను ఉద్దేశ్య పూర్వకంగా ప్రేరిపించడంతో జరిగింది అనే నిర్దారరణకు వచ్చారు పోలీసులు.బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా ఇదే నివేదించారు. ప్రభుత్వం భగ్గుమంది.  చిన్నపరెడ్డిని పట్టుకుని తీరాలిసిందే అని సంబంధిత అధికారులకు హెచ్చరికతో కూడిన ఆదేశాలు జారీచేసింది.

ఇక ఆ మరుసటి రోజు  19-2-1909 నాడు -బ్రిటిష్ తొత్తులైన గ్రామ పెద్దలను బ్రిటిష్ ప్రభుత్వం
తరుపున అధికార యంత్రాంగం  హెచ్చరించింది. చిన్నపరెడ్డిని అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని భయపెట్టింది. ఈ క్రమం లో కలెక్టర్ ఆదేశం ఇవ్వడం ,  అందుకు సబ్ కలెక్టర్ కొంత సమయం తీసుకుని మప్పించి చిన్నపరెడ్డిని పట్టుకోవాలని సూచించడం కూడా జరిగింది.

మొత్తానికి తమ అధికారాలకు ఆస్తులకు భంగం కలుగుతుందని భయపడిన ఆ పెద్దలు ఆగమేఘాలమీద తమ  తొత్తులైన ప్రజలను  ఏకం చేసారు. పకడ్బందీగా వ్యూహరచన చేశారు. ఈ నేపథ్యంలో  వేగుగా పనిచేసే రత్తమ్మ మూడో కంటికి కూడా దొరకకుండా….. చిన్నపరెడ్డి గుర్రాల కంట పడకుండా…..వెన్నంటే  అనుచరులకు  అభిమానించే జనాలకు అనుమానం రాకుండా…. చిన్నపరెడ్డిని పట్టుకోవాలి అనేది వ్యూహం. ఈ ప్రకారం ప్రతికూల గ్రామస్తులు అనుకూలం నటిస్తూ చిన్నపరెడ్డి పక్షం చేరారు. ఈ క్రమంలో తమకు తాము అల్లర్లు సృష్టించుకుని చిన్నపరెడ్డి వర్గాన్ని నమ్మించారు.. కానీ వాళ్ళెవరికీ చిన్నపరెడ్డి ఆచూకీ దొరకలేదు.అట్లాంటివి జరగొచ్చు అనే జాగ్రత్తలో చిన్నపరెడ్డి ఉన్నాడు.

వీరుడి ఉరి
కోటప్పకొండ అల్లర్లకు సంబందించి చిన్నపరెడ్డితో పాటుగా 100 మంది అనుచరులపై గుంటూరు అదనపు సెక్షన్ న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నెం 27/1909 కింద కేసు నమోదు చేయబడింది. కాగా ఈ విషయమై భారతదేశానికి అనుకూలంగా ఉన్న కొందరు విముఖం వహించారు. ఐషర్ కార్షన్ అనే న్యాయవాది 21 మందికి ఉరిశిక్ష విధించాడు. 24 మందికి కఠిన కారాగారా శిక్షలు విధించాడు. మిగతావారికి సాధారణ శిక్షలు విధించాడు.

కాగా చిన్నపరెడ్డి తాము నిరపరాధులం అంటూ మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు.
17/1910 అనేది విచారణ నంబరు. . న్యాయమూర్తులుగా శ్రీమున్, శంకర్ నాయర్ లు ఉన్నారు. విచారణ జరిగింది. ముద్దాయి తరుపున స్వామినాధన్, ప్రభుత్వం తరుపున రిచ్ మాండ్, వాదోపవాదాలు జరిపారు. 1910 ఆగస్టు 18 న మద్రాసు హైకోర్టు చిన్నపరెడ్డికి ఉరిశిక్ష విధించింది.

చిన్నపరెడ్డి పారిపోయే ప్రయత్నం చేయలేదు. తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. తనను దొంగ దెబ్బ తీసి పట్టుకోవాలి అనుకున్న వాళ్లకు తలఎత్తి పొగరు చూపాడు. స్వచ్ఛందంగా లొంగిపోయాడు.

వేల జనాలు దిక్కులు పిక్కటిల్లేట్టుగా రోదిస్తుంటే… న్యాయం ధర్మం అనాథలై ఆ కన్నీళ్ళలో ప్రవహిస్తుంటే….   1910 లోనే  వీరుడిని చిన్నపరెడ్డిని ఉరితీస్తూ ఎదురు తిరిగే మిగతా పాలెగాళ్లను  ప్రభుత్వం హెచ్చరిక చేసింది. చిన్నపరెడ్డిని ఉరి తీసిన తేదీ కోసం వంశస్థులు ఇప్పుడు అన్వేషణ చేస్తున్నారు.

చిన్నపరెడ్డి సంతానం :
చిన్నపరెడ్డికి సంతానం లేదు. అన్నదమ్ముళ్ల పిల్లలే వంశస్తులుగా వెలుగొందుతున్నారు.

జానపదగాథలు :
సైరా చిన్నపరెడ్డి
సై సైరా చిన్నపరెడ్డి
నీ పేరే బంగారుకడ్డీ
పుట్టింది రెడ్డిపాలెములో
పెరిగింది చేబ్రోలున రెడ్డీ…. “”సైరా “”

చిన్నపరెడ్డి మాటలాకు
చుట్టూనొక పన్నెండామడ
నిప్పులేక మండిస్తివి రెడ్డీ
చుట్టును యొక్క నాలుగామడ
బందిపోటు కొట్టిస్తివి రెడ్డీ….. “”సైరా “”

చిన్నపరెడ్డి ఎక్కే అశ్వానికి
నాలుగు భాషలు నేర్పినావురా
చేబ్రోలు నడివీధిలో నిలిచి
కమ్మవారితో
ఏమనిరెడ్డీ పలికినావయ… “”సైరా “”

చిలుకలా తలగుడ్డ చుట్టి
గోరంచు పంచెను గట్టి
ఏడాది ఒక్క దినంబు
కోటప్పకొండ వెళ్ళడానికి
బండిని ప్రభనుగా తయారుజేసే
ఏభై ముళ్ళా ప్రభను గట్టే
నాలుగు గాండ్ల ఎద్దులు గట్టే… “”సైరా “”

అంటూ….మరణం తర్వాత కూడా జనాలు చిన్నపరెడ్డిని మరిచిపోలేదు. పాటలుగా పాడుకుంటూ చిన్నపరెడ్డి తమ మధ్యనే జీవిస్తున్నట్టుగా పాటల్లో వెదుక్కోవడం మొదలెట్టారు.
చిన్నపరెడ్డి వీరత్వపు కథలను బుడిగజంగాలు, పెద్దింటి గొల్లలు, గుర్రాలు ఆడించేవాళ్ళు , తదితర జానపదులు  తమ పాటల్లో నేటికిని స్మరించుకోవడం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కోలాటాల పాటల్లో, వరి నార్లల్లో, వినిపించే చిన్నపరెడ్డి పాటలు రాగయుక్తమైనవి. వివిధ బాణీల్లో వివిధ కథాంశాలుగా
మౌఖిక సాహిత్యంగా వినిపించే చిన్నపరెడ్డి పాటల్ని సమగ్రంగా సేకరించి గ్రంథరూపం తేవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రేడియో కళాకారుడు సి. పుల్లయ్య చిన్నపరెడ్డి బుర్రకథను జన బాహుళ్యంలోకి తీసుకువచ్చాడు.
రగిలిన భారతం

చిన్నపరెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన తర్వాత స్వతంత్ర్యోద్యమ జ్వాలలు  జనాల్లో మరింత పెరిగాయి. ఆవేశం అగ్గి బరాటాలా వెలిగింది. కాంక్ష భగభగ మండింది. నిరసన జ్వాలలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఇందులో భాగంగా ముట్నూరి కృష్ణారావు తన ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణాపత్రికను నిలిపివేశాడు. అందుకు ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తెల్లదొరలని దేశం నుండి తరిమి కొట్టేవరకు…. దొరల తాబేదార్లను ఊర్ల నుండి వెలివేసేవరకు…..నిద్ర పోలేమనే శపథాలు ఊరూరున వినిపించాయి.

ఇది చిన్నపరెడ్డి కథ…..

జనం కోసం ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగిన వీరుడి గాథ…..
ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అని నిరూపించిన మహాయోధుడి గాథ !
జయహో….
సై సైరా చిన్నపరెడ్డి !!

ఉరితీసిన తేదీ కోసం అన్వేషణ :
సై సైరా చిన్నపరెడ్డి గారిని ఉరితీసిన తేదీ కోసం వంశస్తులు నేటికిని అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం అండదండలు సంపాదించి సంబంధిత పోలీసు స్టేషన్ల వెంట తిరుగుతున్నారు. కానీ ఘటన జరిగి 112 ఏండ్లు గడుస్తున్నా నేటికీ తారీఖు వివరాలు తెలియరాలేదు. చిన్నపరెడ్డి వంశస్తులు గాదె వెంకటసుబ్బారెడ్డిగారు తన 72 ఏండ్ల వయసులోనూ తన ప్రయత్నం అవిశ్రాంతంగా కొనసాగించడం ప్రశంసనీయం. వీరి కృషి ఫలించాలని ఆశీద్దాం!

(ఆధారం : చిన్నపరెడ్డి వంశస్తులు గాదె వెంకటసుబ్బారెడ్డి కొత్తరెడ్డిపాలెం గారి నుండి విషయ సేకరణ చేయడం జరిగింది. సెల్ : 8885812375)