ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్ మద్దతు?

358

మరో ఓటమి భారం మోయలేకనే కేసీఆర్ నిర్ణయం?
               ( మార్తి సుబ్రహ్మణ్యం)

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం మార్చే అవకాశం కనిపిస్తోంది. రానున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో,  పార్టీ అభ్యర్ధిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను బరిలోకి దింపాలని తొలుత టీఆర్‌ఎస్ నాయకత్వం భావించింది. అయితే, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో నగరంలో టీఆర్‌ఎస్‌కు సానుకూల పరిస్థితి లేదన్న విషయం తేలడంతో, సీఎం కేసీఆర్ వ్యూహం మార్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం విహ స్తున్న బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకే ఎక్కువ విజయావకాశాలున్నట్లు, ఆ సర్వే నివేదికలో వెల్లడయినట్లు సమాచారం. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గతంలో సాధించిన నాలుగుపదుల సీట్లను కోల్పోయి, అత్తెసరు మెజారిటీతో బయటపడి న వైనం, నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. నగరంలో బీజేపీ రాను రాను బలపడుతున్న క్రమంలో, పార్టీ అభ్యర్ధిని బరిలోకి దింపి మరో ఓటమి కొని తెచ్చుకోవడం అనవసరమని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో విశ్లేషించిన తర్వాతనే, అసలు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో,  పార్టీపరంగా అభ్యర్ధిని నిలబెట్టకపోవడమే మంచిదన్న సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

నిజానికి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్, ఇప్పటివరకూ ఎమ్మెల్సీని గెలిపించుకోకపోవడం పార్టీ నాయకత్వానికి అవమానంగానే మారింది. టీఆర్‌ఎస్ ప్రభంజనం ఉన్న 2015లోనే ఆ పార్టీ అభ్యర్ధి విజయం సాధించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది ఎన్. రామచందర్‌రావు బీజేపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సారధ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగగా, బీజేపీ అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం నగరంలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో సైతం బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధులు గెలుపొందడం ద్వారా, అధికార టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చినట్టయింది.

అయితే, పూర్తిగా బరి నుంచి తప్పుకుంటే వేరే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నందున.. వామపక్షాలు బలపరిచిన అభ్యర్ధి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతునివ్వాలని భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఆయనకు సైతం విద్యావంతుల్లో మంచి పేరు ఉన్నందున, పోటీ రామచందర్‌రావు-నాగేశ్వర్ మధ్య ఉంటుందని భావిస్తోంది. హైదరాబాద్‌లో వామపక్షాల అభ్యర్ధికి మద్దతునిచ్చినందున, భవిష్యత్తులో వారితో సంబంధాలకు మార్గం ఏర్పడుతుందన్న మరో యోచన కూడా టీఆర్ ఎస్‌లో లేకపోలేదు. ఈ కారణంతోనే బొంతు రామ్మోహన్,  మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడయినప్పటికీ, వామపక్షాలు బలపరిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కే మద్దతునిచ్చేందుకు టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, టీఆర్‌ఎస్ మద్దతును నాగేశ్వర్ తీసుకుంటారా? లేదా ? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టీఆర్‌ఎస్ మద్దతు తీసుకుంటే, ప్రభుత్వ వ్యతిరేకతను కూడా తన ఖాతాలో జమ కాక తప్పదు. అయితే, టీఆర్‌ఎస్‌కు నగరంలో ఉన్న బలమైన యంత్రాగం, ఆర్ధికవనరులు, మీడియాలో ప్రచారం నాగేశ్వర్‌కు కలసిరావవచ్చంటున్నారు. మరి ఈ విషయంలో నాగేశ్వర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

కోందండరామ్ రాకతో మారిన కేసీఆర్ నిర్ణయం?

నిజానికి గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీపరంగా దూరంగా ఉండాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో జయాపజయాలు పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉండటమే దానికి కారణం.  సహజంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వామపక్షాల అభ్యర్ధులకే అనుకూలంగా ఉంటాయి. ఆ కారణంతోనే కేసీఆర్ తొలుత అలాంటి నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వివరించారు. అయితే, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ బరిలోకి దిగడంతో, దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ తన యోచన మార్చుకోవలసి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అక్కడ వెంటనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు. కానీ, హైదరాబాద్‌లో మాత్రం ప్రత్యేక పరిస్థితి నెలకొన్నందున, అక్కడ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకపోవడమే మంచిదని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకు ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలే కారణమంటున్నారు.