రేవంత్‌రెడ్డికి సీనియర్ల సెగ!

451

సొంత పబ్లిసిటీపైనే అసంతృప్తి
పీసీసీలో చర్చించకుండానే సొంత యాత్రలా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై కన్నేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆశలపై సీనియర్లు నీళ్లుచల్లుతున్నారు. పార్టీలో చర్చించకుండా రేవంత్ సొంతగా చేపట్టిన పాదయాత్రకు జనస్పందన లభించినప్పటికీ, సీనియర్లు మాత్రం ఆయన ఒంటెత్తుపోకడపై కస్సుబుస్సుమంటున్నారు. పార్టీలో సూత్రప్రాయంగానయినా చర్చించకుండా, ఎవరంటే వారు పాదయాత్రలు చేస్తే ఇక పార్టీలో క్రమశిక్షణ మాటేమిటన్న చర్చ జరుగుతోంది.

జిల్లా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి హటాత్తుగా,  రాజీవ్ రైతు భరోసా పేరుతో చేసిన పాదయాత్రపై తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న యువతరం, వారిని సమర్ధించే నేతలు రేవంత్ పాదయాత్ర వల్ల పార్టీకి లబ్థిచేకూరుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రేవంత్ వంటి దూకుడుగా వెళ్లే నాయకుడే, పార్టీకి అధ్యక్షుడిగా అవ సరమని వాదిస్తున్నారు. పార్టీలో కొత్త తరం రావాలంటే, పాతతరానికి ప్రాధాన్యం తగ్గించాల్సిందేనని చెబుతున్నారు. పాత నాయకులనే కొనసాగిస్తే, కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని స్పష్టం చేస్తున్నారు.

అయితే సీనియర్లు మాత్రం రేవంత్ ఒంటెత్తుపోకడను సహించలేకపోతున్నారు. పీసీసీ అధ్యక్షులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులుగా చేసిన సీనియర్లకు రేవంత్ దూకుడు రుచించడం లేదు. రేవంత్ పాదయాత్ర, ఇతర కార్యక్రమాలకు చేస్తున్న ప్రచారంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రచారంలో కాంగ్రెస్‌ను కాకుండా, తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే పాటలు రాయించుకోవడంపై, సీనియర్లు అభ్యంతరం వ్కక్తం చేస్తున్నారు. పార్టీ కంటే వ్యక్తులు గొప్పవారు కాదని, కానీ రేవంత్ చేసుకుంటున్న సొంత ప్రచారం చూస్తే.. వ్యక్తుల తర్వాతనే పార్టీ అన్న భావన ఏర్పడుతోందని చెబుతున్నారు. ఈ సంకేతాలు మంచివికావంటున్నారు.

పైగా, రేవంత్ ఎక్కడికి వెళ్లినా కొందరు ఆయనను కాబోయే సీఎంగా చేస్తున్న ప్రచారంపై సీనియర్లు మండిపడుతున్నారు. ఇది ఆయన నియమించుకున్న స్వంత ప్రచార బృందాల పనేనన్న విషయం తమకు తెలుసంటున్నారు. రేవంత్ కంటే కొన్ని దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ల మనోభావాలు, ఇలాంటి ప్రచారాలతో దెబ్బతింటాయని చెబుతున్నారు. ఇలాంటి అతి ప్రచార శైలి వల్లనే రేవంత్‌రెడ్డికి, సీనియర్ల సహకారం కొరవడిందని విశ్లేషిస్తున్నారు. పార్టీలో ఎదగాలనుకుంటున్న నేత, సీనియర్ల సహకారం తీసుకుని దూసుకుపోవాలే తప్ప, సీనియర్లనే శత్రువులుగా కొని తెచ్చుకోరని వ్యాఖ్యానిస్తున్నారు.

పీసీసీ నాయకత్వానికి చెప్పకుండానే రేవంత్‌రెడ్డి ప్రచారం చేసినందుకే, ఆయన పాదయాత్ర ముగింపు రోజున నిర్వహించిన బహిరంగ సభకు, సీనియర్లెవరూ హాజరుకాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి నేత చేసిన పాదయాత్ర ప్రారంభానికి, ముగింపురోజున పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత, రాష్ట్ర ఇన్చార్జిలు హాజరవుతుంటారు. ఆ రకంగా సదరు నేతకు పార్టీ మద్దతు ఉందన్న సంకేతాలు ఇస్తుంటారు. కానీ రేవంత్ బహిరంగసభకు పీసీసీ అధ్యక్షడు ఉత్తంకుమార్‌రెడ్డి గానీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గానీ, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్, సీనియర్ నేతలయిన జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులయిన వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలు దూరంగా ఉండటం చర్చనీయాంశమయింది. దీనితో రేవంత్‌కు సీనియర్లు, భవిష్యత్తులో కూడా సహకరించరన్న విషయం స్పష్టమయింది. దీనికిమించి.. రేవంత్ నిర్వహించిన పాదయాత్రకు అధిష్ఠానం అనుమతి లేదన్న సంకేతాలు కార్యకర్తలు వెళ్లడం ప్రస్తావనార్హం. భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి నిర్వహిస్తానంటున్న పాదయాత్రకు సైతం, అధిష్ఠానం అనుమతి లభించడం అనుమానమేనన్న విషయం నాయకత్వ తాజా వైఖరితో స్పష్టమవుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి క్రౌడ్‌పుల్లర్, ఇమేజ్ ఉన్న నేత అయినప్పటికీ, ఆయన సొంత ప్రచారం నిర్వహించుకునే తీరు వల్లే సీనియర్లు దూరమవుతున్నారని ఓ పీసీసీ మాజీ చీఫ్  వ్యాఖ్యానించారు. రేవంత్‌కు తమకంటే  ఫాలోయింగ్, మీడియాలో స్థానం, యువతరంలో ఇమేజ్ ఎక్కువగా ఉన్న విషయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. అయితే, ఇన్ని సానుకూల అంశాలున్న రేవంత్.. తమలాంటి సీనియర్లను కాదని తీసుకునే సొంత నిర్ణయాలే,  సహజంగా అందరి ఇగోను దెబ్బతీస్తాయని విశ్లేషించారు. కాబోయే సీఎం, కాబోయే పీసీసీ చీఫ్ అని ప్రచారం చేసుకుంటే దానివల్ల నష్టపోయేది రేవంత్‌రెడ్డి మాత్రమేనంటున్నారు.

కాంగ్రెస్‌లో అధిష్ఠానంగా వ్యవహరించిన వైఎస్ సైతం, ఎన్నికల చివరిలో సీనియర్ల వద్దకు వెళ్లి రాజీ చేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన కూడా తాను కాబోయే సీఎంను ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని, పార్టీ కన్నా తాను చిన్నవాడినన్న భావనే కల్పించారని విశ్లేషించారు. అంత చే సినప్పటికీ, వైఎస్‌కు పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు తప్పలేదని గుర్తు చేశారు. కానీ రేవంత్ మాత్రం కొత్త తరహా పోకడతో అందరినీ దూరం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన తీరు పార్టీ కన్నా తానే ఎక్కువ అన్నట్లుందని చెప్పారు. మీడియాలో పేరు, యువకుల చప్పట్లు పెద్దగా పనిచేయవని, వాటిని చూసుకుని మురిసిపోతే అసలుకే నష్టమని స్పష్టం చేశారు.