అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే హత్య చేస్తారా..?

588

ఇది ప్రజాస్వామ్యమా.. రాక్షస పాలనా..?
వామన్ రావు దంపతుల హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం
అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యకు గురవ్వడం బాధాకరం. ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ హత్యలకు టీఆర్ఎస్ గూండాలే కారణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.  టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలకు వ్యతిరేకంగా చాలామంది బాధితులు అడ్వకేట్ దంపతులు వామన్ రావు, నాగమణిలను ఆశ్రయించారు. వీరిద్దరు నిజాయితీగా పేద ప్రజలకు అండగా నిలబడి న్యాయపరంగా పోరాడుతున్నారు. అయితే, చివరకు వారు కూడా దారుణ హత్యకు గురికావడం బాధాకరం.టీఆర్ఎస్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై వామన్ రావు దంపతులు న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్స్ వేశారు. అటు అనేక సంచలనాలకు సంబంధించి కేసులు కూడా వాదిస్తున్నారు.

గతంలో శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో వామన్ రావు గారు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించగా వారికి పూర్తి రక్షణ కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ హత్యలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినవే. హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కాదు. టీఆర్ఎస్ ది దుర్మార్గ పాలన. ప్రశ్నించే గొంతులను, ఎదురించే గొంతులను, అన్యాయాలను ఎదురించేవారిని అణచివేస్తోంది. ఇది అప్రజాస్వామికం.

కొంతమంది మంథనికి చెందిన అధికార పార్టీ నాయకులు పథకం ప్రకారం వామన్ రావు దంపతులను హత్య చేసి ముఖ్యమంత్రి పుట్టినరోజు గిఫ్టుగా ఇచ్చారు. ఈ ఘటన వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల హస్తముంది.రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకుంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితేంటి..? రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనడానికి ఈ ఘటనే సాక్ష్యం. అసలు రాష్ట్ర ప్రభుత్వం వామన్ రావు దంపతులకు ఎందుకు రక్షణ కల్పించలేకపోయింది..? దీనికి రాష్ట్ర ప్ఱభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. కొంతమంది పోలీసు అధికారుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోంది. సీఎం కేసీఆర్ అడ్వకేట్ల దృష్టిని సైతం మార్చే ప్రయత్నం చేస్తడు. గౌరవ న్యాయవాదులంతా జాగ్రత్తగా ఉండాలి. న్యాయవాదులు అందరికి కూడా బిజెపి అండగా ఉంటది.

వామన్ రావు దంపతుల హత్య ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి.  దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అంతేకాకుండా మంథని ప్రాంతంలో జరుగుతున్న టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది  అన్నారు.