విశాఖ స్టీల్‌పై ఏపీ నేతలకు అమిత్‌షా క్లాసు

697

ప్రధాన్‌తో మాట్లాడుకోండని చెప్పిన అమిత్‌షా
శాంతిభద్రతలు, మతమార్పిళ్లపై ఫిర్యాదు
అమిత్‌షాతో ఏపీ బీజేపీ నేతలతో భేటీ
మోదీతో దొరకని అపాయింట్‌మెంట్
                       ( మార్తి సుబ్రహ్మణ్యం)

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ నేతల వినతి వినేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా దానికి సంబంధించిన విషయాలను, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆర్ధికమంత్రి నిర్మిలా సీతారామన్‌తో చర్చించాలని సూచించినట్లు సమాచారం. దీనితో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, మతమార్పిళ్లకు సంబంధించిన అంశాలపై తీసుకువచ్చిన వినతిపత్రాన్ని సమర్పించి బీజేపీ నేతలు బయటపడాల్సి వచ్చింది.

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నద్దాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ ప్రతినిధి బృందానికి, మూడురోజుల తర్వాతగానీ అమిత్‌షా దర్శనభాగ్యం కలవలేదు. నాలుగురోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు బృందానికి,  బుధవారం రాత్రి 11 గంటలకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరికింది. అది కూడా కేవలం ఆరు నిమిషాలు మాత్రమే, ఆయన వారికి సమయం కేటాయించినట్లు తె లుస్తోంది. తొలుత ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా, ఆయన ఏపీ నేతలను కలిసేందుకు సుముఖత చూపలేదు. అమిత్‌షా కూడా మూడురోజుల తర్వాతనే అపాయింట్‌మెంట్ ఇవ్వడం ప్రస్తావనార్హం.

నిజానికి విశాఖ స్టీల్ అంశంలో ఎదురవుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ప్రధానితో భేటీ కావాలని బీజేపీ నేతలు భావించారు. ఆ మేరకు 14వ తేదీన మోదీనికి కలవాలని భావించారు. అయితే, ఆయన అపాయింట్‌మెంట్ లభించలేదు. అయితే విచిత్రంగా వైసీపీ ఎంపీల బృందం, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు,  ప్రధానిని కలవడం విశేషం. అటు  ఏపీ బీజేపీ నేతలు అమిత్‌షాను కలవకముందే, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు ఆయనతో భేటీ కావడం మరో విశేషం.

నిజానికి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ఏపీ నేతలు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు పవన్ కల్యాణ్, రఘురామకృష్ణంరాజుకు అపాయింట్‌మెంట్ ఇచ్చి, తమకు ఇవ్వకపోతే పార్టీ క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని నేతలు, అమిత్‌షా కార్యాలయ అధికారుల ముందు వాపోయారు. దానితో బుధవారం అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు. అయితే సమయం ఖరారు చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అమిత్‌షా బిజీగా గడిపారు. చివరకు రాత్రి పదిగంటలకు అమిత్‌షా వెళ్లేముందు 6 నిమిషాలు మాట్లాడి పంపినట్లు సమాచారం.దీన్నిబట్టి.. కేంద్ర నాయకత్వం, ఏపీ బీజేపీ నేతల వ్యవహారశైలిపై ఎంత అసంతృప్తితో ఉందో స్పష్టమవుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్న ఈ సమయంలో ఏపీ నేతలను కలిస్తే, మిగిలిన రాష్ట్రాల నుంచి డిమాండ్లతో వచ్చే బీజేపీ నేతల సంఖ్య పెరుగుతుందన్న ముందుచూపే, ప్రధాని ఏపీ నేతలను కలవకపోవడానికి  కారణం. అందుకే ఏపీ బీజేపీ నేతలను ప్రధాని కలిసే అవకాశం లేదని మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. చివరకు అదే నిజమయింది. విశాఖ స్టీల్ అంశాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో విఫలమవుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు, ఆ సమస్యను తెలివిగా తమపై రుద్దడంపై కేంద్ర నాయకత్వం ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అమిత్‌షాతో భేటీ అయిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ నేతలకు క్లాసు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి నిర్ణయాలు, దేశాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటారన్న విషయాన్ని గ్రహించాలన్నారు. రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ పెట్టరని వ్యాఖ్యానించినట్లు సమాచారం.  పార్టీ-ప్రభుత్వంపై దీనికి సంబంథించి, ఇతర పార్టీల నుంచే వచ్చే విమర్శలను తిప్పకొట్టాల్సిన బాధ్యత మీదేనని తేల్చేశారు. శాఖాపరమైన అంశాలను సంబంధిత మంత్రులతోనే మాట్లాడాలని నిర్మొహమాటంగా చెప్పారు. అనంతరం, ఏపీలో అదుపుతప్పతున్న శాంతిభద్రతలు, పెరుగుతున్న మతమార్పిళ్లపై బీజేపీ నేతలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.  కాగా, వచ్చే నెల 4,5వ తేదీల్లో తిరుపతికి రానున్న అమిత్‌షా పర్యటనకు సంబంధించిన అంశాలను, ఏపీ నేతలు ఆయనతో చర్చించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై అమిత్‌షాతో చర్చించారు.