వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణ వ్యక్తిత్వం-ఉపరాష్ట్రపతి

897

దేశ రాజకీయ యవనిక పై ఎన్టీఆర్ అంటే ఓ శకం
• ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ విజయం యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించింది
• సమాఖ్యవాద స్ఫూర్తిని రక్షించేందుకు ఎన్టీఆర్ పని చేశారు
• పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకుపోయిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది
• ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాల పాత్ర గురించి ఎన్టీఆర్ ఆలోచనలు నేటికీ ఆచరణీయం
• ఎన్టీఆర్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి
• ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్ర నేపథ్యంలో మావెరిక్ మెస్సీయా పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు

కందుల రమేష్.. పాత్రికేయ కులంలో ఈ పేరు తెలియని వారుండరు. పాత తరం జర్నలిస్టులకు ఆయన సుపరిచితం.  పలు తెలుగు, ఇంగ్లీషు దినపత్రికల్లో పనిచేసి, ప్రస్తుతం మహాటీవీలో కీలకపాత్ర పోషిస్తున్న కందుల రమేష్.. చాలా ఏళ్లపాటు పొలిటికల్ రిపోర్టింగ్‌లో పనిచేశారు. ఎంతోమంది ప్రముఖులతో సన్నిహితంగా మెలిగారు. వివాదరహితుడిగా పేరు. ఇప్పుడు కందుల ర మేష్.. తెలుగుజాతి ఉన్నంతవరకూ గుర్తుంచుకోదగ్గ యుగపురుషుడయిన దివంగత నందమూరి తారకరామారావు రాజకీయ గురించి, తనకు తెలిసిన, తాను స్వయంగా చూసిన అనుభవాలను గుదిగుచ్చి.. ‘మావెరిక్ మెస్సీయ’ అనే పుస్తకంతో మరోసారి, అన్న గారి అలనాటి తీపి-చేదు ఘటనలను  జ్ఞప్తికి తెచ్చారు. ఆ పుస్తకాన్ని..  ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్న  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌తో తన అనుభవాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన వేదికగా సింహావలోకనం చేసుకున్నారు.

వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వమని గౌరవ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు గారి స్మృతికి ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు ఘన నివాళులు అర్పించారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ప్రజల హృదయాల్లో గొప్ప స్థానాన్న సంపాదించుకున్న ఎన్టీఆర్ ది రాజకీయ యవనికపై ఓ శకమని తెలిపారు.

ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల రచించిన రాజకీయ జీవిత చరిత్ర ‘మావెరిక్ మెస్సీయ’ పుస్తకాన్ని హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ రాక రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసిందన్న ఆయన, ఎన్టీఆర్ విషయంలో ప్రజలంతా ఏకమై అధికారాన్ని కట్టబెట్టారని, నిజమైన ప్రజాస్వామ్య భావనకు నాంది పలికారని తెలిపారు. నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ సంస్కృతిని ఎన్టీఆర్ పునర్నిర్వచించారన్న ఉపరాష్ట్రపతి, సరికొత్త రాజకీయాలకు నాంది పలికిన ఆయన జీవితాన్ని పుస్తక రచయిత చక్కగా వివరించారని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఎన్టీఆర్ మార్గనిర్దేశనం చేశారన్న ఉపరాష్ట్రపతి, రాజకీయాల్లో ఎన్టీఆర్ రాక, ప్రాంతీయ పార్టీ ద్వారా తొమ్మిది నెలల్లోనే సాధించిన చారిత్రక విజయం, జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశను చూపించిందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఉప-జాతీయవాద సిద్ధాంతం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించిందన్న ఉపరాష్ట్రపతి, వారి అన్ని ప్రాంతాల అభివృద్ధి సిద్ధాంతం భారతదేశంలోని ఎంతో మందిని ఆలోచింపజేసిందని తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య వాద భావనను బలోపేతం చేసేందుకు ఆయన చేసిన కృషి, ప్రాంతీయ ఆకాంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పాత్ర గురించి ఆయన చెప్పి, ఆచరించిన అంశాలు నేటి కాలానికి కూడా వర్తిస్తాయని అభిప్రాయపడ్డారు.

సమాఖ్య స్ఫూర్తి మరియు వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎన్టీఆర్ నిలిచారన్న ఉపరాష్ట్రపతి, దేశంలో ఒకే పార్టీ ఆధిపత్యాన్ని చూసిన దేశప్రజలు, ఎన్టీఆర్ మీద నమ్మకాన్ని ఉంచి, ఓ స్పష్టమైన, చెప్పుకోదగిన ఫలితాన్ని అందించారని తెలిపారు. రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వాల అధికాల మధ్య సరైన సమతుల్యత విషయంలో ఆయన ఓ స్పష్టతనిచ్చేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు ఎన్టీఆర్ అందించిన సహకారం, ఓ మార్గదర్శక కృషి అని అభిప్రాయపడ్డారు.
క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన ఎన్టీఆర్ పరిపాలన ఓ నూతన మార్గాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, ఆయన మొదటి శాసనసభలోనే తీసుకొచ్చిన ఉప-లోక్ పాల్ చట్టం, సమాజం మరియు రాష్ట్రంలో అవినీతిని అంతం చేసే దిశగా సాగిందని, సుపరిపాలన కోసం వారు చేసిన కృషి ఉన్నతమైనదని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కుతో పాటు రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి ఉన్నతమైనదన్న ఆయన, జిల్లా పరిషత్ లలో బీసీలకు రిజర్వేషన్లు సహా, 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకాలు అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని కాంక్షించాయని తెలిపారు.

నటుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారన్న ఉపరాష్ట్రపతి, మన పురాణ పాత్రలైన రాముడు, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలను ఎన్టీఆర్ పోషించినంత గొప్పగా మరే నటుడు పోషించలేడనే విషయాన్ని అందరూ అంగీకరించారని తెలిపిన ఆయన, మరో భిన్న పార్శ్వంలో ప్రజా రంజక పాలన ద్వారా ఆయనలోని ప్రజా నాయకుడు కూడా ఆదర్శమయ్యారని తెలిపారు.

1983లో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన విషయాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సునామీని తట్టుకున్న అతికొద్ది మంది అభ్యర్థుల్లో తానుకూడా ఒకడిననే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

మన సంస్కృతిని, సంప్రదాయలను గౌరవిస్తూ జాతిని నవ్యపథంలో నడిపే నాయకుల అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన కృషిని ప్రజలు కలకాలం గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ తో పాటు అంతకు మించిన సామాజిక-రాజకీయ మార్గాన్ని మార్చేయగల మహాపురుషునిగా ఎన్టీఆర్ కనిపించారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ఎన్టీఆర్ రాజకీయాలు మంచి ఉద్దేశం, మంచి హృదయంతో సాగాయని తెలిపారు. ఆయన రాజకీయాల్లో రావడం వెనుక అధికారం, ఆర్జన మాత్రమే లేవని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారని తెలిపారు.
ఎన్టీఆర్ తో తన సుదీర్ఘమైన, సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి తనకు ఎన్టీఆర్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అన్యాయంగా కూలదోయడం, తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా ముందు వరుసలో నిలబడి కృషి చేయడం తదితర అంశాలను గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని అతిపెద్ద తిరుగుబాట్లను నిష్పాక్షికంగా వివరించడంలో, అనుభవంతో కూడిన రచయిత పరిశీలనా శక్తి పుస్తకంలో ప్రతిబింబించిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ పుస్తకం ఆ నాటి స్మృతులను గుర్తు చేసిందన్నారు. ఈనాటి యువత ఇలాంటి పుస్తకాల ద్వారా గతాన్ని తెలుసుకుని, ఎన్టీఆర్ లాంటి నాయకుల ఆదర్శంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మాజీ సలహాదారు సంజయ్ బారు, రచయిత కందుల రమేష్ సహా పలువురు పాత్రికేయులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.