పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మూడో దశ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సక్రమంగా లేవు. ముందు నుంచి మేం అనుకున్నట్టుగానే జగన్ అందిస్తోన్న గొప్ప పరిపాలనకు తగ్గట్లు ఫలితాలు వచ్చాయి. పరిపాలనను ప్రజల గుమ్మం ముందుకి జగన్ తీసుకువెళ్లారు. ప్రత్యేకించి కొవిడ్ మహమ్మారి సంక్షోభంలోనూ ప్రభుత్వ పనితీరుతో ప్రజల మనస్సుల్లో జగన్ స్థానాన్ని సుస్థిరం చేశాయి. దీంతో వైయస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. దీనిబట్టి ఫలితాలు ఎలా ఉండాలో అలాగే ఒకటో దశ, రెండో దశ, మూడో దశలోనూ ఫలితాలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు మాట్లాడిన తీరులో వింత ఏమీ లేదు. కాకపోతే దశాబ్దాల తరబడి తన గుప్పిట్లో బిగించుకొన్న కుప్పం నియోజకవర్గ ప్రజలూ కూడా చంద్రబాబును పూర్తిగా ఛీత్కరించుకొన్నారు. చంద్రబాబును కుప్పం ప్రజలు చరిత్రహీనుడ్ని చేశారు. దీంతో ఓటమిని చంద్రబాబు తట్టుకోలేక పూనకం వచ్చినట్లు బెదిరింపులు మాటలు మాట్లాడారు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి నిరాశ, నిస్పృహలతో చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారో అందరూ గమనిస్తున్నారు. వైయస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు చంద్రబాబు వ్యవహారశైలిని, ఆయన తీరును ఎత్తి చూపుతోంది. టీడీపీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు.. గతంలోఅధికారంలో ఉన్నారు. ఇప్పుడు వైయస్ఆర్సీపీ పాలన చేస్తోంది. ప్రజలకు మంచి పాలన అందించాలని మొదటి రోజు నుంచి అడుగులు వేసిన పార్టీ మాది. ప్రతి మాటను చాలా జాగ్రత్తతో ఎలాంటి అపోహలకు, అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ విమర్శలు చేశారు. ఎందుకు అంటే.. అధికారంలో ఉన్నప్పుడు తనపై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయని అవతల వారివైపు గురించి ఆలోచించి వాస్తవాలపై మాట్లాడారు తప్ప అడ్డగోలుగా జగన్ ఏనాడూ మాట్లాడలేదు. కానీ, చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక అడ్డగోలు వాదనలు తప్ప నేరుగా నిజాయితీతో, నిబద్ధతతో మాట్లాడిన దాఖలాలే లేవు అన్నారు.
నిజం చెబితే చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో దివంగత మహానేత వైయస్ఆర్ శాసనసభలో చెప్పారు. ఎప్పుడైనా సరే.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు అబద్ధాలు తప్ప నిజాలు చెప్పటం రాదని వైయస్ఆర్ ఆనాడే చెప్పిన విషయాన్ని మరోసారి సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు విపరీతమైన నిస్పృహ ఆవరించింది. ఇక అధికారంలోకి రాగలననే ఆశ లేదు. కొడుకును చూస్తే కనీసం ఒక నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా గెలవలేని స్థితిలో ఉన్నాడు. భవిష్యత్‌లో పార్టీని నడపగల సామర్థ్యం లోకేశ్‌కు ఏమాత్రం లేదనే నిస్పృహ చంద్రబాబులో బాగా పెరిగిపోయింది అన్నారు.
జగన్ మొదటిసారి అధికారంలోకి వచ్చినా..ఎంతో బాధ్యతాయుతంగా అడుగులు వేయటంతో ఎక్కడలేని పూనకం చంద్రబాబులో కనపడుతోంది. ఇవాళ మీడియాలో చంద్రబాబు ఏమి మాట్లాడారో అని పాయింట్స్ తెప్పిస్తే అందులో ఏమీ కనపడలేదు. విందామని వీడియో చూస్తే.. చంద్రబాబు పళ్లు పటపటామని కొరికారు. కోపంతో ఊగిపోయారు. ఏదైనా సమస్యపైన ఊళ్లలో ఏమనాలో అర్థంకాక తిట్ల బాట పడతారు. అలానే చంద్రబాబు కూడా ఎటువంటి హేతబద్దత లేకుండా నోటికొచ్చిన విమర్శలను చేశాడు. ఎత్తుకోవటం ఎత్తుకోవటమే బూతులు ఎత్తుకుంటారు. మీడియా కూడా చంద్రబాబును ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని, ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించలేదు. పైగా చంద్రబాబు నిన్న ఆరు గంటలకు టీడీపీ మద్దతుదారులకు 53, వైయస్ఆర్సీపీ మద్దతుదారులకు 35 సర్పంచ్ స్థానాలు వచ్చాయని చెప్పారు. ఏడున్నర నుంచి ఫలితాలు మారాయని చెప్పారు. టీడీపీ అంటే పడని టీవీలు కూడా అంకెలు వేశాయని చంద్రబాబు అనటంపై సజ్జల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబును భుజాన మోసే ఆ రెండు మీడియా సంస్థలు కూడా వైయస్ఆర్సీపీ మద్దతుదారులకు మెజార్టీ ఎక్కువ వచ్చిందంటే వ్యతిరేకించటం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్లు ఏదోలా వెళ్తున్నారు. కానీ, చంద్రబాబు చెబుతున్న దౌర్జన్యాలు, హింస, అక్రమాలు ఎక్కడున్నాయో అర్థమే కావటం లేదు. చూసేవారికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఓటుకు రూ.10వేలు, రౌడీలు, ఉన్మాదులు, రాజారెడ్డి రాజ్యాంగం అని చంద్రబాబు మాట్లాడటం సరికాదని సజ్జల హితవు పలికారు.
పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో ఓటమి ప్రజాస్వామ్యానిది తప్ప చంద్రబాబుది కాదట. మరి గతంలో కుప్పంలో గెలిచింది చంద్రబాబు కాదా? లేక ప్రజాస్వామ్యం గెలిచి చంద్రబాబు ఇంట్లో ఏమైనా ఉన్నారా? కుప్పంకు సంబంధించినంత వరకు ఎందుకు గెలవలేకపోయారో సంజాయిషీ ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి.. ఏజెన్సీలో గెలవగా కుప్పంలో ఎందుకు గెలవమని ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెబుతారు…? కుప్పం ప్రజలు సమాధానం చంద్రబాబే చెప్పాలి. కుప్పం ప్రజలను ఎవరైనా ఆవహించి చేశారో అదైనా చంద్రబాబు చెప్పాలి. ఏమీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఓడిపోయిందని చెప్పి చంద్రబాబు చేతులు దులుపేసుకుంటే ఎలా? అన్నారు.
ఓటమిపై చంద్రబాబు కొత్త థియరీ చెబుతున్నారు. చంద్రబాబు ఓడిపోయి.. వైయస్ఆర్సీపీ గెలిస్తే అక్రమాలు, ప్రజాస్వామ్యం ఓటమి. చంద్రబాబు గెలిస్తే ప్రజాస్వామ్యం విజయమా..! దీనికోసం చంద్రబాబు మాట్లాడటం ఎందుకు? వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ఓటమి. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి విజయంగా పరిగణించమని ఓ పత్రికా ప్రకటన ఇస్తే సరిపోలా..! దానికోసం చంద్రబాబు మాట్లాడటం ఎందుకు. ఓటమికి చంద్రబాబు సాకులు వెతికి పెట్టుకున్నారు. ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయాలని అనుకుంటే వీరోచితంగా పోరాడి నామినేషన్లు వేయించటం ద్వారా ప్రజాస్వామ్యానికి తొలి విజయంగా చెప్పుకునే దురవస్థలో 70 ఏళ్ల వృద్ధ నాయకుడు చంద్రబాబు ఉన్నారు. ఆ పార్టీ దుకాణం అయినా మూసుకోవటం మేలు. లేకపోతే చంద్రబాబుకు దణ్ణం పెట్టి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటే మేలు. ఇలా మాట్లాడటానికి సిగ్గూ, ఎగ్గూ ఏమీ ఉండవా…! అన్నారు.
మొన్నటి వరకు అధికారపక్షంగా వ్యవహరించిన పార్టీ నామినేషన్లు వేయించటమే గొప్ప విజయంగా చెప్పుకునే దౌర్భాగ్యస్థితిలో టీడీపీ ఉంటే ఏమనాలో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. నామినేషన్లు వేశారు. అయిపోయింది. రెండోదశకు వచ్చేసరికి అధికారపక్షం దౌర్జన్యాలను తట్టుకోలేకపోయాం. ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎన్నికలు జరిగినట్లైతే మేం గెలిచేవాళ్లమంటారు. ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఈ విషయాన్నే ఎస్ఈసీ కూడా చెబుతున్నారు. ఏకగ్రీవాలకు సంబంధించి ప్రభుత్వం పారితోషకాలు ప్రోత్సహించినా దాంట్లో ఓ సదుద్దేశం ఉంది. 2013లోనూ అలాగే ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు కూడా ప్రోత్సాహకాలను పెంచినట్లు ఉన్నారు. గ్రామస్థాయిల్లో ఏకగ్రీవాలు ప్రోత్సహించాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ, ఎస్ఈసీ, టీడీపీ కలిసి పెద్ద కుట్ర అన్నట్లు గాల్లో కత్తి తిప్పి.. మీకు మీరే ఏదో ఊహించారు. ప్రోత్సాహకాలు రావటంతో పాటు గ్రామాల్లో గ్రూపులు ఉండకుండా చైతన్యం వచ్చి ఏకగ్రీవాలు పెరిగాయి. అలా అని అత్యధికంగా నమోదు కాలేదు. చివరకు ఏకగ్రీవాలు 16%గా నమోదు అయ్యాయి. చంద్రబాబు దానిపై ఏదో ఊహించుకొని అధికారపక్షం అక్రమాలు తట్టుకోలేకపోయామని చంద్రబాబు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు అన్నారు.
వాలంటీర్లు బెదిరిస్తే ప్రజలు ఊరుకుంటారా? టీడీపీ అనుకూల మీడియా మిగిలిన ఛానల్స్ చూపించరా? జోగి రమేశ్ బెదిరించారని అన్నారు. ఆ వీడియో చూస్తే రిక్వెస్ట్లాగే ఉంది. మరి, చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారో గుర్తు లేదా? తాను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు కదా.. తాను ఇస్తున్న రేషన్ తింటున్నారు కదా ఎందుకు వేయరో వేయండని చంద్రబాబు ఆనాడు అన్నారు. అప్పుడు జనంలోంచి ఎవరో అమ్మాఅబ్బకు పుట్టినవాడైతే ఓట్లు వేయక ఎక్కడకి పోతారని అంటే.. సరిగ్గా చెప్పాడు బ్రదర్ అని చంద్రబాబు అటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మాట్లాడారు. అంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా? నిన్న విశాఖలో చంద్రబాబు మాటలు చూస్తుంటే అనిపిస్తోంది. పైగా ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్తస్థాయిలో పథకాలు అందిస్తోంది. ఇప్పుడు కాదు.. నాలుగు నెలలు తర్వాత వచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు హయాంలో ఒకరు చచ్చిపోతే తప్ప పింఛన్ ఇవ్వని దాఖలాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు అనుకున్నవన్నీ వైయస్ఆర్సీపీపై రుద్దాలని ప్రయత్నించటం సరికాదు అన్నారు.
2013లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ జగన్ మోహన్ రెడ్డి ఇలా ప్రచారంలోకి దిగలేదు. ప్రతిరోజూ మీడియా సమావేశాలూ పెట్టలేదు. రెండేళ్ల క్రితం వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇన్ని మీడియా సమావేశాలు ఏంటి? 20-30 లేఖలు రాయటం ఏంటి? ఊగిపోతూ మాట్లాడటం ఏంటి? కాళ్లు, వేళ్లు పెట్టడం కాకపోతే ఏంటి? ప్రభుత్వాన్ని బెదరగొట్టాలని చూస్తున్నారు. చంద్రబాబుకు తోడు ఎస్ఈసీ. పైగా కోర్టుకు వెళ్లి లిటిగేషన్స్ వేస్తున్నారు. ఎస్ఈసీ ద్వారా బెదరగొట్టించాలని ప్రయత్నం. ఇంతవరకు గ్రామ పంచాయితీ ఎన్నికలపై ముఖ్యమంత్రి ఎక్కడైనా ఒక్కమాటైనా మాట్లాడారా? ఎవరికి టార్గెట్స్ పెట్టారు. టార్గెట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? స్వీప్ చేస్తామని మాకు తెల్సు. దీనికి కారణాలు తెల్సు. ప్రజలకు కావాల్సినవి చేస్తున్నాం. అందువల్లే ప్రజలు ఆదరిస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యేది.. చంద్రబాబుకు అర్థం కావటం లేదు. ఎందుకు అంటే చంద్రబాబు ఆలోచనల్లో రాష్ట్రం, సమాజం అనేవాటికి స్థానం లేదు. ఎంతసేపటికీ చంద్రబాబు .. చంద్రబాబు.. తప్ప.. వీలైతే కొడుకు, భార్య వస్తారేమో. ఇప్పుడు మనవడు తప్ప ఎవ్వరికీ ఆ విజన్‌లో స్థానం లేదు. దీనికి అండగా నిలబడే కోటరీ. ముఠా. వారి ప్రయోజనలే చంద్రబాబు ప్రయోజనాలు. చంద్రబాబు అసలు స్వభావాన్ని, వికృతమైన ఆలోచనలు, మాటల్ని ఎత్తి చూపిస్తున్నాం అన్నారు.
జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలు తీర్పు ఇస్తున్నారు. ఇలాంటి తీర్పు ఇవ్వటం సహజం. కానీ దీంట్లో తప్పులు ఉంటే ప్రతిపక్షం పట్టుకోవాలి కానీ కానీ వైయస్ఆర్సీపీనే పతనం అన్నట్టు మాట్లాడటం ఏంటి? వైయస్ఆర్సీపీ పతనం అవుతుందంటే టీడీపీ పైకి వస్తోందా? చంద్రబాబు, ఎస్ఈసీ కలిసి చేసిన వేధింపులు అధికార పార్టీ పడింది. ఒక పథకం ప్రకారం మమ్మల్ని వేధించారు. ఎస్ఈసీకి టీడీపీనే పాలాభిషేకం చేసినట్లు కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఈ శతాబ్ధంలోనే నిమ్మగడ్డ ఒక శక్తి అని మీరే ప్రొజెక్ట్ చేశారు. రిజల్ట్స్ ఇలా ఉంటాయని ఆయనపై పడుతున్నారా? సుప్రీంకోర్టు చెప్పినా… పంచాయితీ ఎన్నికలు ముందుకు వచ్చాయి. దాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రావటం లేదు.. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎక్కడా ఎస్ఈసీ గీసిన గీత దాటలేదు. మాకు అన్యాయం జరుగుతుంటే విమర్శలు చేస్తాం.. ఎత్తి చూపాం. గోపాలకృష్ణ ద్వివేదిని చంద్రబాబు తిట్టినట్లు బూతులు తిట్టలేదు. చేతులు కట్టేసుకొని పోరాడినట్లు పోరాడాం. కసిగా కార్యకర్తలు ప్రజల్లో తిరిగారు. వైయస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు. మీరు పొగిడిన ఎస్ఈసీ రిఫరీగానే ఎన్నికలు జరిగాయి. మూడు దశల ఎన్నికలూ బాగా జరిగాయని ఎస్ఈసీ కూడా అన్నారు.
ఈ విడతలో 3215 చోట్ల ఎన్నికలు జరిగితే 2604 చోట్ల వైయస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు. 527 పంచాయితీల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 19 చోట్ల జనసేన మద్దతుదారులు, 4 చోట్ల బీజేపీ మద్దతుదారులు, 62 చోట్ల ఇతరులు గెలిచారు. ఎప్పటిలాగే వైయస్ఆర్సీపీ మద్దతుదారుల ఫొటోలతో సహా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. మీరు డిక్లేర్ చేసి మీడియాకు రిలీజ్ చేయండి. వారు ఎవరో చెప్పించటం జరుగుతుంది. మరి, ఈ విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేయాలో అర్థంగాక కిందామీద పడుతూ విశ్లేషణలు చేస్తున్నారు అన్నారు.
పత్రికల్లోనూ ఫలితాలపై విశ్లేషణ చేయటం లేదు. టీడీపీ నాయకులు ఇలా, అధికారపక్షం మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా అంటున్నారని రాస్తున్నారు తప్ప మీడియా సంస్థలు ఎందుకు నిజాలు రాయలేపోతున్నారు. విశ్లేషణలు చేసే పని 2013లోనూ చేశారు. మరి, ఇప్పుడు ఎందుకు చేయటం లేదు. ఎల్లో మీడియా అష్టవంకరలూ తిరిగిపోతోంది. ఎందుకు అంతప్రయాస. గ్రామస్థాయి ఎన్నికలు ..గ్రామాలే ఓట్లు వేశాయి. మాకు టైం వస్తుందని చంద్రబాబు చెప్పాలి పైగా.. స్థానిక సంస్థల ఎన్నికలే కదా.. నిరాశపడొద్దు అని చంద్రబాబు చెప్పొచ్చు. కానీ కుప్పం దెబ్బ గట్టిగా చంద్రబాబుకు తగిలింది. 2019లో ఎన్నికల్లో 30,722 మెజార్టీ చంద్రబాబుకు వస్తే నేడు అది మైనస్ పడిపోయింది. కుప్పం నగర పంచాయితీ, ఇంకో రెండు మూడు పంచాయితీలు పోను.. 30,929 ఓట్లు వైయస్ఆర్సీపీ ఓట్లు సర్పంచ్ మద్దతుదారులకు వచ్చాయి. దీంతో, ఎంత మంది చంద్రబాబును ఛీత్కరించారో అర్థమైపోతోంది. చంద్రబాబు పుట్టి పెరిగిన చంద్రగిరిలో వైయస్ఆర్సీపీ మద్దతుదారులు స్వీప్ చేశారు. చంద్రబాబు కబంధహస్తాల నుంచి కుప్పం స్వేచ్ఛా గాలులు పీల్చుకుంది. చంద్రబాబు కుప్పం కోటలు బద్ధలైపోయింది. కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతైంది. అందుకు చంద్రబాబు బాధపడాలి అన్నారు.
చంద్రబాబు ఇజ్రాయిల్ టెక్నాలజీ అని తెచ్చి జేబులు నింపుకోవటానికి కుప్పంను వాడుకున్నారు.
ఇప్పుడు జగన్ పాజిటివ్ ఓటు వచ్చింది. రాష్ట్రం ఎలా ముందుకుపోతోందో ప్రజలు నమ్మటం వల్లనే ఇన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పటికైనా ప్రజల బాధలు తీర్చటానికి ప్రయత్నం చేసే పాలకుడు నాయకుడు కావాలన్న సంగతి చంద్రబాబు, లోకేశ్ తెల్సుకోవాలి. మీ ఆలోచనల్లో మీరే ఉండటం వల్ల తిరస్కరిస్తున్నారు. మీ హయాం అయిపోయింది. ఇది జగన్ ఎరా. ఇది దశాబ్ధాల పాటు సాగుతుంది. ముందు లోకేశ్ ప్రజల్లోకి వెళ్లి తిరగాలి. సిన్సియర్‌గా పనిచేస్తే ప్రజలు నమ్ముతారు. ప్రజల్ని అవమానించవద్దు. లోపం చంద్రబాబులో ఉంటే.. ప్రజల్ని విమర్శించటం సరికాదు అన్నారు.
నిన్నటి నుంచి విశాఖ స్టీల్‌పై 7వేల ఎకరాలు అమ్మేస్తే సరిపోతుంది అని సీఎం అన్నది ప్రచారంలోకి తెచ్చారు. దీనికి బదులు వేరే పరిష్కారం ఏమైనా ఉంటే చంద్రబాబు చెబితే బావుంటుంది. విశాఖ స్టీల్ నిలబడాలి, ఉద్యోగుల భద్రత ఉండాలంటే ముడిసరుకు కావాలి. అసెస్ట్స్కు తగినంతగా నగదు నిల్వలు పెరగాలి. ప్లాంట్ నిలబెట్టాలి. దాంట్లో భాగంగా సీఎం మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఇడుపుల పాయలో పెట్టుకోమని చంద్రబాబు మాట్లాడటం సరికాదు. సీఎం జగన్ పరిపాలనకు ప్రజలు ఢంకా బజాయించి ఇచ్చిన తీర్పు ఇది. చంద్రబాబును రాష్ట్రానికి ఒక దిష్టి బొమ్మలా ప్రజలు ఛీత్కరిస్తున్నారు అన్నారు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
– ఎంపీటీసీ, జెడ్ పీటీసీల్లో ఏకగ్రీవాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని మొదట్లో ఎస్ఈసీనే అన్నారు. మధ్యలో ఏం జరిగిందో అందరికీ తెల్సు. ఆరోజు ఇదే ఎస్ఈసీ.. ఉన్నారు. ఈరోజు ఆయనే.. పిల్లాటల్లా చేస్తే అనుమతించం. పిల్ల ఆటల్లాగా ఎస్ఈసీ వ్యవహరిస్తే న్యాయస్థానాల్లో సవాలు చేస్తాం. వాస్తవం ఏదైతే అదే ఉంటుంది. అప్పుడు వేరే ఎస్ఈసీ ఉన్నారనుకుంటే వేరు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఈసీనే అన్నారు. ఎలాంటి స్ర్కూటీకైనా, స్ర్కీనింగ్‌కు అయినా సిద్ధం.
– డబుల్ డిజిట్ ఉంటే.. రీకౌంటింగ్ చేయకూడదు. అప్పుడు ఇప్పుడూ అధికారులు వారే ఉన్నారు. ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే ఎస్ఈసీకి కంప్లైంట్ ఇస్తారు. డిక్లేర్ చేస్తే అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉంటారు. మొబైల్లో అయినా షూట్ చేసి పైకి పంపించవచ్చు. గ్లాస్ హౌస్‌లో జరుగుతున్నట్లు పారదర్శకుంగా కౌంటింగ్ జరుగుతుంది. 2014లో ఇలా దిక్కుమాలిన ఆరోపణలు మేం చేయలేదు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈవీఎం మెషిన్లు తప్పు అనేవారేమో. అడ్డగోలు ఆరోపణలు.. అడ్డగోలు కామెంట్స్ చేయటం చంద్రబాబుకే చెల్లింది అన్నారు.