ప్రజల్లో చచ్చిపోయిన చైతన్యం!

594

ప్రజల్లో మానవత్వం చనిపోయిందా..? సాటి మనిషి చనిపోతున్న పట్టించుకోవడం లేదా..? రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు..? బస్సుల్లో ఉన్న జనం చోద్యం చూశారు..? భయపడి కొందరూ దూరం జరిగితే.. మరికొందరూ అక్కడే ఉండి సినిమాల్లో సీన్‌ను చూసినట్టు చూసి ఉండిపోయారు. దుండగులను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు.. ఇదీ హైకోర్టు న్యాయవాది వామన్‌రావు హత్య కేసులో జరిగిన దారుణం. అసలు సాటి మనిషి చనిపోతుంటే ఎందుకు స్పందించలేక పోయారు. హైటెక్ యుగంలో అందరూ బిజీనే క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. పక్కవాళ్లు ఎటు పోతే తమకేంటి అనే రీతిలో ఉన్నారు. అందుకే ఎదురుగా ఒక మనిషి చనిపోతుంటే చూస్తూనే ఉన్నారు కానీ, ఎవరూ అడ్డుకోలేదు. చుట్టూ జనం ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. కత్తులతో విచక్షన రహితంగా నరుకుతూ ఉంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రహదారి అది. వేలాది మంది ప్రయాణిస్తారు. సాటి మనిషి రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతుంటే మనిషి చనిపోతుంటే మనవత్వం లేకుండా ప్రవర్తించారు. పదుల సంఖ్యలో జనాలు చూస్తుండగానే దంపతులిద్దరూ చనిపోయారు.

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతుల హత్యకేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిపై  అభియోగాలు నమోదు చేశారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు 120బి, 302, 341, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎ-1గా వెల్ది వసంతరావు, ఎ-2గా కుంట శ్రీనివాస్‌, ఎ-3గా అక్క పాక కుమార్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.కత్తిపోట్ల అనంతరం రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్‌’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపించింది.

బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే.కారులో హైదరాబాద్‌ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండలం గుంజపడుగ గ్రామానికి చెందిన వామన్‌రావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్‌ వంటి అక్రమాలపై వారు హైకోర్టుకు లేఖలు రాశారు.

బుధవారం ఉదయం 11 గంటలకు వారు కారు డ్రైవర్‌ సతీశ్‌తో కలిసి మంథని వచ్చారు. అక్కడ ఓ కేసుకు సంబంధించి దస్తావేజులు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.50 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు. మంథని నుంచి గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి కారులో వీరి వాహనాన్ని వెంబడించారు. కల్వచర్ల సమీపంలో లాయర్‌ కారు ముందు తమ వాహనాన్ని ఆపి అడ్డగించారు. కొబ్బరిబొండాలు నరికే కత్తులతో కారు అద్దాలు పగలగొట్టి వామన్‌రావును కిందకు లాగారు. మెడ, పొట్ట భాగంలో నరికారు. భయంతో కారులోనే ఉండిపోయిన నాగమణి మెడపైనా నరికారు. అప్పటికే రహదారిపై వాహనాలు నిలిచిపోవడం, వాహనదారులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అరవడంతో దుండగులు మంథని వైపు పరారయ్యారు. అక్కడున్నవారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్సులో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి కల్వచర్ల చేరుకున్న క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరిస్తోంది. మరో వైపు వామన్‌రావు దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించింది.