కోర్టు చెప్పినా దిక్కులేని ‘మావన హక్కుల కమిషన్’

593

ఇప్పటిదాకా భేటీ కాని స్క్రీనింగ్ కమిటీ
ధిక్కరణ దాకా తెచ్చిన అధికారులు
ఏపీ సీఎంఓ ఏం చేస్తున్నట్లు?
           ( మార్తి సుబ్రహ్మణ్యం)

ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల సమన్వయలోపం జగన్ సర్కారును కోర్టులో ముద్దాయిగా నిలబెడుతోంది. కీలక అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని.. దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన సీఎంఓ అధికారుల బాధ్యతారాహిత్యం, కోర్టుల్లో ప్రభుత్వం పరువు తీసేందుకు కారణమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నిర్లక్ష్యం చివరకు కోర్టు ధిక్కరణ దాకా వెళ్లి, న్యాయమూర్తుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక, ప్రభుత్వ న్యాయవాదులు నీళ్లు నమలాల్సిన దుస్థితికి తీసుకువెళుతోంది. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం, నిర్లక్ష్యమే దానికో నిదర్శనం.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మానవ హక్కుల కమిషన్‌ను,  ఏపీకి తీసుకురావడంలో గత చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించింది. దానితో ఇప్పటికీ హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయమే, ఏపీకీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఏపీకి సంబంధించిన ఫిర్యాదులు కూడా తెలంగాణ హక్కుల కమిషన్ కార్యాలయమే తీసుకుంటున్నా, దానిపై ఎలాంటి తీర్పులివ్వడం లేదు. పోనీ వాటిని ఏపీ ప్రభుత్వానికయినా పంపిస్తుందా అదీ లేదు. దీనితో ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ నేత బి.మోహన్‌రావు,  ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

నిజానికి ఏపీలో హెచ్చార్సీ ఏర్పాటుచేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, అందుకు నాలుగు నెలలు గడువు ఇచ్చింది. ఆ మేరకు 2019 అక్టోబర్ 30న ధర్మాసం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ విషయంలో ప్రభుత్వం రెండు నెల గడువు మాత్రమే కోరినా, కోర్టు మాత్రం నాలుగు నెలల గడువిచ్చింది.అయితే ఆ తర్వాత కూడా సర్కారులో చలనం లేకపోవడంతో, పిటిషనర్ మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దానిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. హక్కుల కమిషన్ సభ్యుల కోసం అర్హతలను నిర్ణయిస్తూ, ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్‌ప్రకాష్ పేరుతో  నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం,  సీఎం ఆధ్వర్యాన ఉన్న  స్క్రీనింగ్ కమిటీ భేటీ ఏర్పాటుచేయడాన్ని విస్మరించింది. దానితో హెచ్చార్సీలో సభ్యుల పదవి కోసం దరఖాస్తులు వచ్చినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

సీఎం ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీలో అసెంబ్లీ- కౌన్సిల్‌లో ప్రధాన ప్రతిపక్షనేత, స్పీకర్-శాసనమండలి చైర్మన్, హోంమంత్రి సభ్యులుగా ఉంటారు. వీరంతా కలసి హెచ్చార్సీ సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కమిటీలో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందుకే, ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ విపక్ష సభ్యులు హాజరుకాకపోతే, హాజరయిన సభ్యుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుని, వారి నిర్ణయాన్ని కోర్టును అందించే వెసులుబాటు ఉంది. దానిని కూడా ప్రభుత్వం వినియోగించుకోకపోవడం బట్టి.. ప్రభుత్వానికి ఇప్పట్లో హక్కుల కమిషన్ ఏర్పాటుచే యటం ఇష్టం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి.. ‘హమ్మయ్య.. హక్కుల కమిషన్‌కు జగనన్న ఓకే’

గతంలో రోశయ్య సీఎంగా ఉండగా, 2010 జులై 14న హెచ్చార్సీ సభ్యుల ఏర్పాటుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, కౌన్సిల్‌లో విపక్ష నేత దాడి వీరభద్రరావును స్క్రీనింగ్ కమిటీ భేటీకి ఆహ్వానం పంపారు.  దానికి బాబు-దాడి హాజరయినప్పటికీ, తర్వాత  డిసెంట్‌నోట్ పంపారు.  అయినా, మెజారిటీ ప్రాపతిపదికన హెచ్చార్సీ సభ్యులను నియమించారు. నిజానికి స్వయంగా ముఖ్యమంత్రే, స్క్రీనింగ్ సభ్యులకు ఫోన్లు చేసి హెచ్చార్సీలో నియమించాలనుకున్న సభ్యుల పేర్లు వివరించడం సంప్రదాయం. దానిని విపక్ష సభ్యులు ఆమోదిస్తే సమస్య ఉండదు. లేకపోతే డిసెంట్ నోట్ ఇచ్చి ప్రభుత్వానికి పరోక్షంగా  సాయం చేస్తుంటారు. కానీ, ఈసారి అలాంటి సంప్రదాయాలేమీ అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

కాగా.. ఇలాంటి కీలక అంశాలపై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి, సర్కారుకు సమస్యలు రాకుండా చూడాల్సిన సీఎంఓ, తమ విధిలో విఫలమవుతోంది. హైకోర్టు అడ్వకేట్ జనరల్‌తో చర్చించి, గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నించాల్సిన సీఎంఓ, ముఖ్యమంత్రి చెప్పేవరకూ మీనమేషాలు లెక్కిస్తుండటం వల్లే,  కోర్టుల్లో సమస్యలు వస్తున్నాయన్న వ్యాఖ్యలు అటు వైసీపీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ఇలాంటి కీలక అంశాలను సీఎంతో చర్చించేందుకే అధికారులు భయపడుతున్నారంటున్నారు. అధికారులు సకాలంలో సీఎం దృష్టికి తీసుకువెళ్లకపోతే, ఆయనకు సమస్య ఎలా తెలుస్తుందని ఓ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

 గతంలో డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు, వేతనం ఇవ్వకుండా నిలిపివేసిన వైనంపై హైకోర్టు ప్రశ్నించింది. పోస్టింగ్ ఇవ్వకపోయినా, సస్పెండయిన సీనియర్ అధికారికి జీతం ఇవ్వకపోతే.. ఆ విషయాన్ని కోర్టు ప్రశ్నిస్తుందన్న కనీస విషయం కూడా తెలియని అధికారులు, సీఎంఓలో ఉన్నారన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో అప్పుడే వినిపించాయి.

ఏదైనా పీకలదాకా వచ్చేవరకూ మీనమేషాలు లెక్కిస్తూ, నిర్ణయాలు తీసుకోని సీఎంఓ వ్యవహార శైలి కారణంగానే, ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతోందన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సర్వం తానై చక్రం తిప్పుతున్న ఓ అధికారి,  ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు అటు అధికార వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. కీలక అంశాలను స్వయంగా సమీక్షించాల్సిన సీఎంఓ అధికారుల వైఫల్యానికి, వైసీపీ నేతలు ఒక ఉదాహరణను తెరపైకి తీసుకువస్తున్నారు. ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ తప్పులతడకగా ఉండటంతో, శుక్రవారం నాడు కోర్టు దానిని తిరస్కరించింది. మళ్లీ దానిని సరిచేసే లోపు శని, ఆదివారాలు సెలవులురావడంతో, సర్కారు లక్ష్యం దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సహజంగా ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపడిన అంశాలపై సీఎంఓ ముఖ్య కార్యదర్శి.. అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో చర్చిస్తారు. దానికి కావలసిన నోట్స్‌ను సిద్ధం చే సే వరకూ, న్యాయబృందాన్ని ఊపిరిరాడనీయరు. తర్వాత దానిని సీఎం వద్దకు తీసుకువెళ్లి, ఆయనకు ఆ వివరాలు చెప్పి ఫైనల్ నోట్‌ను పిటిషన్‌లో పొందుపరచడం ఆనవాయితీ. కానీ, ఏపీ సీఎంఓలో ఇప్పుడు అలాంటి సంప్రదాయం అమలవుతున్నట్లు లేదన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.