కొంపముంచనున్న మంత్రి కమలాకర్ మాటలు!

437

సమైక్యాంధ్రతో సెంటిమెంట్ మళ్లీ రగిలిస్తున్నారా?
గంగుల వ్యూహం బెడిసికొడుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కొంపదీసి మళ్లీ సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారా?.. చంద్రబాబు, జగన్ మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? ఆ సెంటిమెంటే మళ్లీ తమ పార్టీని గెలిపిస్తుందని ఆశిస్తున్నారా?..  తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన కోరిక అదే అన్నట్లుగా కనిపిస్తోంది. షర్మిల పార్టీపై మాట్లాడిన ఆయన.. ఎక్కడ నుంచి ఎక్కడిదాకానో వెళ్లడం విస్మయపరుస్తోంది. షర్మిల తర్వాత బాబు, ఆ తర్వాత జగన్ వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. నీళ్లు-కరెంటును తీసుకువెళ్లేందుకే వీరంతా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాబట్టి కేసీఆర్‌ను రక్షించుకోవలసిన అవసరం ఉందన్న గంగుల వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమయ్యాయి.

తెలంగాణ సమాజం అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, ఇప్పటివరకూ ఏ ఒక్క తెలంగాణ నేత కూడా, మళ్లీ సమైక్యరాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. కాకపోతే సమైక్య రాష్ట్రంలో పడ్డ కష్టాలు, ఎదురైన మోసాలు, తెలంగాణకు జరిగిన నష్టాల గురించే మాట్లాడారు. అది కూడా తక్కువ సందర్భంలోనే. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిన తర్వాత, ఏపీ-తెలంగాణ మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ, కేసీఆర్ ఏపీ పట్ల చాలా దయతో వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం జగన్ స్వయంగా సభలొనే ప్రస్తావించారు. అటు కేసీఆర్ కూడా తమకు భేషజాలేమీ లేవని, ఇద్దరం కలసి సమస్యలు పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఓ దశలో ప్రశ్న అడిగిన జర్నలిస్టును మీరు మా మధ్య పంచాయతీ పెట్టలేరని కన్నెర్ర చేశారు.

నిజానికి చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పటి రోజుల కంటే.. జగన్ సీఎం అయిన తర్వాతనే, తెలంగాణతో సన్నిహిత సంబంధాలు పెరిగాయి. బాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీపై ఒంటికాలితో లేచిన తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు.. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీపై మాట్లాడటమే మానేశారు. ఆ రకంగా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతవరణమే కొనసాగుతోంది. మంచిదే. ఘర్షణలు ఎవరు మాత్రం కోరుకుంటారు? తాజాగా షర్మిల పార్టీ స్థాపనపై టీఆర్‌ఎస్ పెద్దగా ప్రతిస్పందన కనిపించలేదు. పైగా ఆమె ప్రయత్నాలను వెక్కిరిస్తూ,  టీఆర్‌ఎస్ సోషల్‌మీడియాలో పోస్టులు వెలువడ్డాయి. అయితే ఆశ్చర్యంగా కొన్ని గంటల్లోనే అవి మాయమయ్యాయి. అంటే పార్టీ-ప్రభుత్వాల మధ్య ఏ స్థాయిలో సత్సంబంధాలు కొనసాగుతున్నాయో,  మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

అటు రాజకీయంగా కూడా కేసీఆర్-జగన్ కలిసే అడుగులేస్తున్నారు. ఒకరకంగా జగన్‌కు కేసీఆర్ రాజకీయ గురువుగా మారారు. అలా ఒకరికోసం మరొకరు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎక్కడా పంచాయితీలు రాకుండా చూసుకుంటున్నారు. విచిత్రంగా.. తెలంగాణలో మద్యం కొనుగోలు చేసి, ఆంధ్రాకు తీసుకువెళుతున్న సరుకును,  నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భూభాగంలో పట్టుకున్న సందర్భాలు చాలు. వారిద్దరి మధ్య స్నేహం ఏ స్థాయిలో పరిఢవిల్లుతుందో చెప్పడానికి!

వీటికి మించి, తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆంధ్రా కాంట్రాక్టర్లే తెలంగాణలో ఇంకా పనులు చేస్తున్నారు. ఏపీ మంత్రుల్లో చాలామంది తెలంగాణలో  కాంట్రాక్టులు చేస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి రాష్ట్రం.. ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో మెజారిటీ కాంట్రాక్టులు చేసిన మెగా ఇంజనీరింగ్ కంపెనీయే, ఇప్పుడు తెలంగాణలోనూ చక్రం తిప్పుతోంది. నాడు-నేడు పాలకులకు మెగా కృష్ణారెడ్డి అత్యంత ప్రీతిపాత్రుడు. ఎన్నికల్లో ఆయన కంపీనీయే కామధేనువు. ఇది మనం మనుషులం అన్నంత నిఖార్సయిన నిజం.

ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లంటూ వ్యాఖ్యానించిన  టీఆర్‌ఎస్‌ను, ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ వాసులున్న డివిజన్లు ఓడించాయి. అయితే, విచిత్రంగా ఆంధ్రా సెటిలర్లు ఉన్న డివిజన్లలో మాత్రం అదే ఆంధ్రోళ్లు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. అంతకుముందు సనత్‌నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి వంటి సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో సైతం,  అదే ఆంధ్రోళ్లు కాంగ్రెస్-టీడీపీని కాదని టీఆర్‌ఎస్‌కే జైకొట్టడం ప్రస్తావనార్హం.

గత అసెంబ్లీ, తాజా గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ అసలు పోటీనే చేయలేదు. టీడీపీ చేసినా దానికొచ్చిన ఓట్లు అంతంతమాత్రం. చంద్రబాబు వచ్చి ప్రచారం చేసినా దిక్కులేదు. సెటిలర్లు ఆయనను పట్టించుకోకుండా, టీఆర్‌ఎస్‌కే ఓటేశారు. అంటే.. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో సెటిలర్లు, ‘కారు’లోనే పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు షర్మిల రంగప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని… మంత్రి గంగుల కమలాకర్ మళ్లీ విభజన తీసుకువచ్చేందుకు చేస్తున్న రాజకీయ ఎత్తుగడ ఎంతవరకూ ఫలిస్తుందన్నది పక్కనపెడితే, అది టీఆర్‌ఎస్‌కే బూమెరాంగయ్యే ప్రమాదం లేకపోలేదు.

నిజానికి, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా, ఉత్తర భారతదేశ ప్రజలెవరూ తిరిగి సమైక్య రాష్ట్రాన్ని కోరుకోవడం లేదు. ఆ భావనకు తెరపడి ఏడేళ్లయిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా సెటిలర్లెవరూ అక్కడికి వెళ్లలేదు. చివరాఖరకు ఉద్యోగులు కూడా,  అక్కడ గొల్లపూడిలో రూములు కిరాయికి తీసుకుని, ప్రతి శని-ఆదివారాల్లో హైదరాబాద్‌కు వస్తున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. అటు తెలంగాణ సమాజం కూడా ఆంధ్రా పెత్తనం లేని స్వాతంత్య్రం అనుభవిస్తోంది. సీమాంధ్ర అధికారులకు పెద్దగా కీలక పోస్టింగులు కూడా ఇవ్వడం లేదు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో కూడా, తెలంగాణ సెటిలర్లపై ఒక్క దాడి కూడా చేయని తెలంగాణ సమాజం, మంత్రి గంగుల చేసిన తాజా వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేస్తోంది.

మంత్రి వ్యాఖ్యలు తమ పార్టీకే నష్టంగా మారే ప్రమాదం కనిపిస్తోందన్న ఆందోళన, అటు టీఆర్‌ఎస్ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. కరెంటు, నీళ్లు దోచుకునేందుకు మళ్లీ ఆంధ్రా నేతలు వస్తున్నారన్న గంగుల ఆరోపణలు తెలంగాణ సమాజం సీరియస్‌గా తీసుకుంటే, అందుకు కచ్చితంగా తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ తమ పార్టీనే అధికారంలో ఉన్నందున, ఇప్పటిదాకా మరి ఏం చేశారన్న చర్చ సహజంగా తెరపైకి వస్తుందని తెరాస నేతలు చెబుతున్నారు. పైగా ఏపీ సీఎం జగన్‌తో కలసి అడుగులేస్తున్న కేసీఆర్, ఈ విషయంలో ఆయనను ఎందుకు నిలదీయడం లేదన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తాయంటున్నారు.

మంత్రి గంగుల వ్యాఖ్యల బట్టి.. తమ ప్రభుత్వం సమస్యల్లో ఉన్నందుకే, మళ్లీ సమైక్యాంధ్ర కార్డు తెరపైకి తీసుకువస్తున్నారన్న భావన, తెలంగాణ ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ భావన బలపడితే పార్టీ మరింత బలహీనపడుతుందన్న ఆందోళన టీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీటికిమించి.. ఇప్పటివరకూ టీడీపీని కూడా కాదని, టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్న సీమాంధ్ర సెటిలర్ల అభిప్రాయం మంత్రి గంగుల వ్యాఖ్యలతో మారితే, హైదరాబాద్-ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన టీఆర్‌ఎస్ వర్గాల్లో మొదలయింది. మంత్రి వ్యాఖ్యలు సీఎంను మెప్పించేందుకయినా, అది ఇతర వర్గాలపై పెను ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదన్న వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.