అడకత్తెరలో స్పీకర్ తమ్మినేని

309

గంటా రాజీనామా ఆమోదిస్తారా?లేదా?
ఆమోదిస్తే అధికారపార్టీపైనా తప్పని  ఒత్తిళ్లు?
ఉప ఎన్నికలకు జగన్ సర్కారు సిద్ధపడుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సాంకేతిక- నైతిక సంకటంలో పడ్డారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే తొలుత అది డ్రామాగా విమర్శలు రావడంతో,  గంటా తాజాగా స్పీకర్  ఫార్మెట్‌లోనే రాజీనామా చేసి, స్పీకర్ కార్యాలయానికి పంపించారు. ప్రస్తుతం అది తమ్మినేని కార్యాలయంలో ఆయన ఆమోదానికి వేచి చూస్తోంది.

సంప్రదాయం ప్రకారమయితే.. రాజీనామా చేసిన సభ్యుడిని స్పీకర్ స్వయంగా పిలిపించవచ్చు. లేదా తానే స్వయంగా సభ్యుడికి ఫోన్ చేసి, రాజీనామా స్వచ్ఛందంగా చేస్తున్నారా లేక ఒత్తిళ్లతో చేస్తున్నారా అని అడుగుతారు. పునరాలోచన చేసుకునేందుకు కొంత గడువు కూడా ఇవ్వవచ్చు. లేదా వెంటనే ఆమోదించారు. అయితే, సభ్యుడి అభిప్రాయం ఏదైనా..  దానిని ఆమోదించాలా? వద్దా అన్నది నిర్ణయించేది మాత్రం స్పీకరే. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సభ్యుల రాజీనామాను, నాటి స్పీకర్ సురేష్‌రెడ్డి నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన వైనం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ రాజీనామా ఆమోదం కోసం ఒకసారి.. పార్టీ ఫిరాయించిన తమ సభ్యులపై అనర్హత వేటు వేయాలని మరొకసారి,  టీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా,  తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, చివరాఖరకు స్పీకర్ దానిని ఆమోదించాల్సి వచ్చింది. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్, వైసీపీ ఆ ఎన్నికల్లో విజయం సాధించాయి. ఒకసారి మాత్రం టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవం ఎదురయింది.

తాజాగా విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా స్పీకర్ తమ్మినేనికి సంకటంగా మారింది. ఈ విషయంలో సాంకేతికంగా స్పీకర్ ఆమోదమే తుది నిర్ణయయమయినప్పటికీ, సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే కీలకం. ఒకవేళ సీఎం జగన్, ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించాలని గ్రీన్‌సిగ్నల్ ఇస్తే,  అది ఉత్తరాంధ్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా, విశాఖ కేంద్రంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తాజాగా వైసీపీ పార్లమెంటరీపార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, అదే అంశంపై 25 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేస్తున్నారు. అటు టీడీపీ యువనేత లోకేష్ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా అన్ని పార్టీలూ తమ ఎమ్మెల్యే-ఎంపీ పదవులకు రాజీనామా చేసి, కేంద్రానికి నిరసన ప్రకటిద్దామని ప్రతిపాదించారు. ఈ అంశం అటు తిరగి ఇటు తిరిగి ఎమ్మెల్యే-ఎంపీల రాజీనామాల వరకూ వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో గంటా రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక ఖాయం. స్పీకర్ ఇప్పుడు దానిని ఆమోదిస్తే, తిరుపతి లోక్‌సభతో పాటు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఆ ఎన్నికలో సహజంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశమే ప్రధాన ప్రచారాంశం అవుతుంది. అప్పుడు ఫలితం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి జగన్ సర్కారు అంత ధైర్యం చేస్తుందా అన్నది ప్రశ్న. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రయత్నాన్ని వైసీపీ నాయకత్వం విరమింపచేసింది. వంశీ ఒక్కడే రాజీనామా చేస్తే, వైసీపీలో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయవలసి వస్తుందన్న ముందుచూపుతో, వంశీ కోరినను వైసీపీ నాయకత్వం త్రోసిపుచ్చింది. ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గంటానే స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేసినందున, మరి ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది.

ఒకవేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే, ఉత్తరాంధ్రలో వైసీపీ ఎమ్మెల్యేలపై ఆ ప్రభావం ఖచ్చితంగా చూపే అవకాశం లేకపోలేదు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేసిన గంటా దారిలోనే, తమ ఎమ్మెల్యేలు కూడా నడవాలని స్థానికంగా ఉద్యమం మొదలయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తప్పవు. ఇప్పటికే నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గంటా రాజీనామా స్ఫూర్తితో మిగిలిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని జేఏసీ పిలుపు ఇస్తే, అది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారడం ఖాయం. గంటా రాజీనామా ఆమోదించాల్సిన స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా, ఉత్తరాంధ్రకు చెందిన వారే కావడం ప్రస్తావనార్హం.