ఆ ఊర్లో వెంకన్న చెప్పిన వాళ్లకే ఓట్లు.

604

– వరుసగా ఆరు సార్లు విజయం
– ఓటర్లకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా
– దణ్ణం పెట్టకుండా

సర్పంచిగా ఒక్కసారి గెలవడానికే ఆపసోపాలు పడిపోయే కాలం ఇది.పంచాయతీని బట్టి ఎన్నికల ఖర్చు లక్షలు కోట్ల రూపాయలు దాటి పోతున్నాయి.అలాంటిది ఓటర్లకు వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు ఎన్నికలలో అంటే ముపైమూడేళ్లుగా ఆ నాయకుడు చెప్పిన వాళ్లకే ఓట్లు వేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్తాన అగ్రహారం ప్రజలు.అలాగని అదేదో వెయ్యో పదిహేను వందల ఓట్లున్న చిన్న గ్రామం కాదండోయ్.మొత్తం ఓటర్లు 5,563 మంది.ప్రతి ఎన్నికలలో అయిదు వందల ఓట్లు తగ్గకుండా మెజారిటీ.

ఇక ఆ నాయకుడు గురించి తెలుసుకుందాం..
అతని పేరు సలాది వెంకట్రావు. అందరూ వెంకన్న అంటారు.1988లో సర్పంచిగా తొలిసారి పోటీ చేసి 864 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. అధ్వానంగా ఉండే ఊరిని బాగు చెయ్యడంలో విశేష కృషి చేసారు.  1995 ఎన్నికలలో సర్పంచ్ పదవి బిసి మహిళకు కేటాయించారు. అప్పుడు కుడిపూడి శారదను వెంకట్రావు పోటీలో నిలపగా 1347 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.2001లో ఒసి జనరల్ కావడంతో ఆయనే పోటీ చేసి 1046 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.2006లో బిసి జనరల్ అయ్యింది ఇళ్ల శేషాద్రి శ్రీనివాస్ ని పోటీలో నిలిపి 678 ఓట్లు మెజారిటీతో గెలిపించారు.2013లో ఎస్సీ జనరల్ అయ్యింది. అయితే ఎంతో నమ్మకంగా ఉండే పంచాయతీలో పారిశుధ్య కార్మికరాలు యర్రంశెట్టి వెంకాయమ్మను పోటీలో నిలిపి 1310 ఓట్లు మెజారిటీతో గెలిపించారు.ఇప్పుడు కూడా ఎస్సీ లకే రిజర్వ్ అయ్యింది. ఈసారి ఎమ్ఎ చదివిన లంక వర ప్రసాద్ ను పోటీలో నిలిపారు. నామినేషన్లుకు రెండు రోజుల ముందు ప్రసాద్ ను పిలిచి పోటీ చేయాలని వెంకట్రావు ప్రతిపాదించారు. మొత్తం అయిదుగురు పోటీలో ఉండగా జనసేన అభ్యర్థిగా వెంకట్రావు పోటీచేయించిన ప్రసాద్ 776 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

వెంకట్రావు ఎన్నికల ప్రచారం చాలా విచిత్రంగా ఉంటుంది. బలపర్చిన అభ్యర్థి దండం పెట్టుకుని నడుస్తుంటే పక్కన చేతులు వెనక్కి పెట్టి వెంకట్రావు ఓట్లు అడిగేతీరు ఆశ్చర్యం కల్పిస్తుంది. నేను ఇతన్ని పోటీలో నిలబెట్టాను…నామీద నమ్మకం ఉంటే ఓటు వెయ్యండి లేకపోతే మానేయండి.. అని మొహమాటం లేకుండా చెబుతాడు. ఏ ఓటరకు చేతులు జోడించి దణ్డం పెట్టరు.ప్రచారానికి కూడా ఎవరనీ పనులు మానుకుని రావద్దంటారు.అభ్యర్థితో పాటు ఈయన ఒక్కరే తిరుగుతారు.ఓటర్లకు ఎలాంటి ప్రలోబాలు ఉండవు.కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వరు.ఎన్నికల గుర్తు తెలిడం కోసం డోర్ పోస్టర్స్ ముద్రిస్తారంతే.ఈ సారి తక్కువ సమయం ఉన్నందున మైకు పెట్టి ఆటలో ప్రచారం చేసారు.అందుకునే ఈ సారి ఎన్నికలకు పదివేల రూపాయలు ఖర్చు అయ్యాయి. మొత్తం 14 వార్డులలో పది వార్డులు వెంకట్రావు పోటీ పెట్టించిన వారినే గెలిపించారు.

మూలస్థాన అగ్రహారం వెళ్ళి వెంకన్న ఎలాంటోడని అడిగితే పిచ్చొడండి బాబూ..అని తిట్టుకుంటారు.ఎందుకంటే ఎవరికీ అనుకూలంగా చేయరు. తను చెయ్యాలనుకున్నదనే చేస్తారు.అందరికీ న్యాయం జరగాలంటారు.అందుకునే తిట్టుకున్న వాళ్లు కుడా ఓట్లేసి గెలిపిస్తారు.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ అభిమాని.దేశంలో అవినీతిపై ఆయన చేసిన పోరాటానికి ఆకర్షితుడై వాళ్ల అబ్బాయికి జయప్రకాష్ నారాయణ అని పెట్టారు. ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలు సన్నగిల్లాయని పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు.

తన రాజకీయమంతా సైకిల్ పైనే సాగింది…సాగుతుంది. తెల్లారకుండా లేచి సైకిల్ వేసుకుమను ఊరంతా తిరిగి పారిశుధ్యం,త్రాగు నీరు,వీధి లైట్లు వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు.రాజకీయంగా రూపాయి ఆశించరు..పావలా పెట్టరు.అందుకునే తల్లిదండ్రుల నుంచి వచ్చిన పదిన్నర ఎకరాల భూమి పెరగలేదు. తరగలేదు.డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే వాటిని సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతారంటారు వెంకట్రావు. అసలు సర్పంచ్ కు చెక్ పవర్ ఉండకూడదని వాదిస్తారు. అంతేకాదు రెండున్నర ఏళ్ల తర్వాత సర్పంచ్ పాలన ప్రజలకు నచ్చకపోతే రీకాల్ ద్వారా తొలగించే చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేస్తారు.పన్నెండో తరగతి చదివిన ఈయన భగవద్గీత, బైబిల్ కంఠస్థం చేసుకున్నారు.ఈకాలం వారికి అంతగా నచ్చని ఎన్నో మంచి విషయాలు ఈయన వివరిస్తూ ఉంటారు.రావులపాలెం సర్పంచిగా చేసిన సఖిలేటి వాకులరాజు తన గురువని ఆయనను ఆదర్శంగా చేసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడ్డానని వెంకట్రావు వివరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇటువంటి నాయకులు అత్యంత అరుదుగానే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.