బాబు అమ్మకాల కథ ఇదీ…

0
658

తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడులు ఉపసంహరించాలన్న కేంద్ర యోచనపై రాష్ట్రంలో ప్రధాన విపక్షం మండి పడుతోంది. అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ మొదలు, సీనియర్‌ నేతలు, నాయకులు వరుసగా ట్వీట్లు, ప్రెస్‌ మీట్లతో ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అధీనంలో పని చేస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాటలోకి మళ్లించడానికి, సంస్థను కాపాడుకోవడానికి ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదమిద్దంగా నిర్ణయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకున్నా, ప్రధాన ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఎక్కడ ఏం జరిగినా నేరుగా సీఎం వైయస్‌ జగన్‌ను టార్గెట్‌ చేసే టీడీపీ పెద్దలు, నేతలు, నాయకులు ఇక్కడ కూడా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడానికి ఆయనే కారణమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి మహోద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటిస్తున్నారు.

అదే మహోద్యమంలా ఆనాడు!:

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, అందు కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని చెబుతున్న టీడీపీ పెద్దలు, నాడు తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల విషయంలో ఏ విధంగా వ్యవహరించారన్నది చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు ప్రైవేటీకరణను ఒక ఉద్యమంలా అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొనసాగించింది.

1999–2004 మధ్య:

1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ అయిదేళ్ల కాలంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 1999 నుంచి 2004 మార్చి వరకు మొత్తం 54 సంస్థల, కంపెనీలను మూసివేయడం, ప్రైవేటీకరించడం, పెట్టుబడులు ఉపసంహరించడం లేదా పునర్‌వ్యవస్థీకరణ పేరుతో అస్తవ్యస్తం చేయడం జరిగింది. సంస్కరణల పేరుతో మొత్తం 87 సంస్థలను టార్గెట్‌గా పెట్టుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం వాటిలో సక్సెస్‌ఫుల్‌గా 54 ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి లేకుండా చేసింది.

ఎన్నింటిని ఏమేం చేశారంటే?

మూసివేసిన సంస్థలు  –  22
పునర్‌వ్యవస్థీకరణ పేరుతో అస్తవ్యస్తం చేసినవి  – 12
ప్రైవేటుపరం చేసిన సంస్థలు    – 11
పెట్టుబడులు ఉపసంహరించినవి  – 9
అదే సమయంలో దేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలలో కలిపి కేవలం 84 సంస్థలు మాత్రమే సంస్కరణలకు లోనుకాగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంఖ్య 54 అంటే, ఏ స్థాయిలో చంద్రబాబు గతంలో తన పాలన హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ఎంత దారుణంగా ప్రైవేటీకరణ కొనసాగించారన్నది స్పష్టమవుతుంది.

రెండు దశల్లో కార్యక్రమం:

1999 నుంచి 2002 వరకు తొలి దశ, ఆ తర్వాత రెండో దశలో 2002 నుంచి 2006 వరకు నాలుగేళ్లలో ఈ ప్రైవేటీకరణ కొనసాగించాలని నాడు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు తొలి దశలో 19 సంస్థలను లక్ష్యంగా పెట్టుకోగా, వాటిలో 18 సంస్థలను ప్రైవేటుపరం చేసింది. మలి దశలో 68 సంస్థలను టార్గెట్‌గా పెట్టుకోగా, వాటిలో 2004, మార్చి నాటికి (ఎన్నికలు వచ్చే నాటికి) 36 సంస్థలను ప్రైవేటుపరం చేసింది.

టీడీపీ ప్రైవేటుపరం చేసిన సంస్థలు:

– శ్రీ హనుమాన్‌ కోఆపరేటివ్‌ షుగర్‌ మిల్‌
– ఏఎస్‌ఎం కోఆపరేటివ్‌ షుగర్‌ మిల్‌
– ఆదిలాబాద్‌ కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌
– రాజమండ్రి కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌
– నిజాం షుగర్స్‌ లిమిటెడ్‌కు చెందిన పలు యూనిట్లు:
చాగల్లు డిస్టిల్లరీ, శక్కర్‌నగర్‌ షుగర్‌ మిల్, శక్కర్‌నగర్‌ డిస్టిల్లరీ, మాంబోజిపల్లి షుగర్‌ మిల్, మెట్‌పల్లి షుగర్‌ మిల్, లచ్చయ్యపేట షుగర్‌ మిల్, మధునగర్‌ షుగర్‌ మిల్, మాంబోజిపల్లి డిస్టిల్లరీ.
– నంద్యాల కోఆపరేటివ్‌ షుగర్‌ మిల్‌
– నాగార్జున కోఆపరేటివ్‌ షుగర్‌ మిల్‌
– పర్చూరు కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌
– పాలేరు కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ
– పశ్చిమ గోదావరి సహకార షుగర్‌ మిల్‌
– ఎన్వీఆర్‌ సహకార షుగర్‌ మిల్‌. జంపని
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. అనకాపల్లి
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. చీపురుపల్లి
– వోల్టాస్‌ లిమిటెడ్‌
– గోదావరి ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌.
– వజీర్‌ సుల్తాన్‌ టుబాకో (వీఎస్‌టీ)
– టాటా మోటర్స్‌ (పూర్వ టెల్కో)
– అసోసియేట్‌ సిమెంట్‌ కంపెనీస్‌ (ఏసీసీ)
– సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌
– ఆంధ్రప్రదేశ్‌ పేపర్‌ మిల్స్‌
కోర్టు ఆదేశాలు ఉండడంతో నంద్యాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌ను ప్రైవేటుపరం చేయలేకపోయారు.

టీడీపీ మూసివేసిన సంస్థలు:

– ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ
– ఏపీ జౌళి అభివృద్ధి సంస్థ
– ఆల్విన్‌ వాచెస్‌ లిమిటెడ్‌
– నెల్లూరు కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌
– చీరాల కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌
– చిలకలూరిపేట కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్‌
– యాన్‌రిచ్‌ (ఏఎన్‌ఆర్‌ఐసీహెచ్‌)
– ఫెడ్కాన్‌ (ఎఫ్‌ఈడీసీఓఎన్‌)
– ఏపీ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌
– ఏపీ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌
– శ్రీకృష్ణదేవరాయ ఆయిల్‌సీడ్స్‌ గ్రోయర్స్‌ యూనియన్‌
– శ్రీ విజయవర్థని ఆయిల్‌సీడ్స్‌ గ్రోయర్స్‌ యూనియన్‌
– ఏపీ స్పిన్‌ఫెడ్‌
– కరీంనగర్‌ కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌
– ఏపీ షుగర్‌ఫెడ్‌
– చిత్తూరు జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం
– శ్రీ రాజరాజేశ్వర కోఆపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. ఆత్మకూరు
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. రాయచోటి
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. కదిరి తూర్పు
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. కదిరి పడమర
– గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ. జోగిపేట

నాడు చంద్రబాబు ఏం చెప్పారు?:

‘మనకు అందుబాటులో ఉన్న వనరులను ఏ మాత్రం వృథా కానివ్వబోము. పన్ను చెల్లింపుదారుల ఇచ్చే ప్రతి ఒక్క రూపాయికి మరింత విలువను జోడిస్తాము. ఆ విధంగానే వ్యయం చేస్తాము. ప్రైవేటుపరం చేసిన సంస్థలు, యూనిట్లు చాలా బాగా పని చేస్తున్నాయి. వాటిపై ఆధారపడిన రైతులు, కార్మికులు, స్థానికులు, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉన్నారు. మూతపడే దశలో ఉన్న సంస్థలు ప్రైవేటీకరణ వల్ల కొత్త జీవం పోసుకున్నాయి. ఆ యూనిట్లన్నీ లాభాల బాటలో నడిచి, పన్నులు కూడా చెల్లిస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై సబ్సిడీ భారం కూడా తగ్గింది. తొలి దశలో 17 యూనిట్లను మూసి వేయడమో లేక ప్రైవేటుపరం చేయడమో జరిగింది. దీని వల్ల రానున్న అయిదేళ్లలో  ప్రభుత్వం ఏకంగా రూ.1282 కోట్లు ఆదా చేసినట్లు అవుతుంది. ఆ మొత్తాన్ని ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలలో ఖర్చు చేయవచ్చు. ఆయా సంస్థల యాజమాన్యాలు మారడం వల్ల వాటిలో పెట్టుబడులు పెరిగి, ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతోంది’.

ఇదీ చంద్రబాబు నైజం:

ఆ విధంగా నాడు ప్రైవేటీకరణను అంత యథేచ్ఛగా యజ్ఞంగా కొనసాగించి, దాన్ని గట్టిగా సమర్థించుకున్న చంద్రబాబు, ఇవాళ వి«శాఖ ఉక్కు కర్మాగారం విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పునరుజ్జీవనం కోసం కేంద్రం ఒక ఆలోచన చేస్తుండగా, అది నేరం, ఘోరం, జాతి సంపదను దోచుకోవడం అన్నట్లుగా మాట్లాడుతున్నారు.  వి శాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

– శ్రీనివాస్