రొయ్యల వ్యాపారి అపహరణ: హత్య

76

ఏలూరు, ఫిబ్రవరి 17 (న్యూస్‌టైమ్): రొయ్యల వ్యాపారిని అపహరించి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రెడ్డి కోదండరామారావు (39) రొయ్యలు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఈ నెల 11 నుంచి ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట-దమ్మపేట మండలాల సరిహద్దులో జీడిమామిడితోటలో ఓ మృతదేహం ఉన్నట్లు భీమవరం పోలీసులకు తెలియడంతో కోదండరామారావు కుటుంబ సభ్యులను అక్కడి తీసుకెళ్లారు.

మృతదేహం కోదండరామారావుదేనని ఆయన భార్య లీలాకుమారి గుర్తించినట్లు సీఐ ఆర్‌.విజయకుమార్‌ తెలిపారు. కోదండరామారావు కొద్దికాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన ఓ వ్యక్తికి రూ.1.5 కోట్లు చెల్లించే విషయంలో కొన్నేళ్లుగా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 11న బలుసుమూడికి చెందిన ఓ వ్యక్తి అతన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. వ్యాపార భాగస్వాములే అపహరించి, హతమార్చారని లీలాకుమారి ఆరోపిస్తున్నారు.