నిమ్మగడ్డ నిన్న హీరో..నేడు జీరో!

844

మున్సి‘పోల్స్’ రీ షెడ్యూల్‌పై విపక్షాల ఫైర్
రాజీ పడ్డారంటూ సోషల్‌మీడియాలో కథనాలు
   ( మార్తి సుబ్రహ్మణ్యం)

నిన్నటి వరకూ ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రతిపక్షాల దృష్టిలో హీరో. జగన్‌ను ఢీకొని, ఆయన అభీష్ఠానికి వ్యతిరేకంగా నిలిచి మరీ, తాను అనుకున్న స్థానిక సంస్థలు జరిపించిన కథానాయకుడు. మరి ఇప్పుడు.. మున్సిపల్ ఎన్నికలను మళ్లీ మొదటినుంచి జరిపించకుండా, రీ షెడ్యూల్ చేసిన అదే నిమ్మగడ్డ జీరో!  సర్కారు ఒత్తిళ్లకు లొంగారంటూ సోషల్‌మీడియాలో కథనాలు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో విఫలమయ్యారంటూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి కాంగ్రెస్ పార్టీ వరకూ వెల్లువెత్తుతున్న విమర్శలు.

పంచాయితీ ఎన్నికల తర్వాత, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. తొలుత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వేసిన నామినేషన్లు, ఏకగ్రీవాలను రద్దు చేసి, తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకపోవడాన్ని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. దీనివల్ల ఎన్నికలు నిర్వహించి ఏమి ప్రయోజనమని వాదిస్తున్నాయి. నిమ్మగడ్డలో హటాత్తుగా వచ్చిన ఈ నిర్ణయంపై విపక్షాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

గత ఏడాది ఆగిన చోట నుంచే తిరిగి ఎన్నికలు మొదలుపెడుతూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని… నిన్నటి వరకూ ఆయనను ఆకాశానికెత్తేసిన విపక్షాలే ఇప్పుడు తూర్పారపడుతున్నాయి. ఇది కచ్చితంగా వైసీపీకి ప్రయోజనం కల్పించే నిర్ణయమేనని చెబుతున్నాయి. గతంలో విపక్షాలన్నీ ఏకగ్రీవాలను రద్దు చేసి, తిరిగి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని నిమ్మగడ్డను కలసి కోరాయి. బీజేపీ కూడా ఏకగ్రీవాలను రద్దుచేయాలని, వైసీపీ తమ అభ్యర్ధులను బెదిరించి నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. అయినా నిమ్మగడ్డ, తమ డిమాండును పట్టించుకోకుండా గత ఏడాది ఎక్కడయితే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని నిర్ణయించడం విపక్షాలకు ఏ మాత్రం రుచించడం లేదు.

అయితే దీనికి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమన్న అనుమానాలు, రాజకీయ  పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో మంత్రి నారాయణ శాఖలో చక్రం తిప్పిన ఓ అధికారి మధ్యవర్తిత్వంతోనే, నిమ్మగడ్డ వెనక్కి తగ్గారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో గెలిచిన స్థానాలను కూడా రద్దు చేస్తే, తిరిగి వారు కోర్టుకు వె ళ్లక తప్పదని, అప్పుడు ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని, సదరు అధికారి నచ్చచెప్పినట్లు సమాచారం. పైగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా.. తనంతట తానే ముందుకువచ్చి సహకరిస్తున్నందున, ఈ పరిస్థితిలో సర్కారుతో ఘర్షణ పెట్టుకోవడం మంచిది కాదని కూడా, సదరు అధికారి నిమ్మగడ్డకు సూచించినందువల్లే.. నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అటు సోషల్‌మీడియాలో సైతం,  నిమ్మగడ్డ వైఖరిపై పలు అనుమానాస్పద కథనాలు వెలువడుతుండటం ప్రస్తావనార్హం. ఆయన ప్రభుత్వంతో రాజీ పడ్డారన్న చర్చ సోషల్‌మీడియాలో జోరుగా సాగుతోంది.

కాగా  గతంలో జరిగిన ఎన్నికలు రద్దు చేయకుండా, వాటిని ఆమోదించడం అప్రజాస్వామ్యమని టీడీపీ విమర్శించింది. రీ నోటిఫికేషన్ ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేయగా, ఎన్నికల ప్రకియను మొదటినుంచి చేపట్టాలని పిసిసి చీఫ్ శైలజనాధ్ డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రతిపక్షాల అభ్యర్ధులను బె దిరించి చేసుకున్న ఏకగ్రీవాలను,  ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయం ఆమోదించిన ట్టయిందని జనసేన  నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకోకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.