జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయమా..?

425

–  ప్రభుత్వ చీఫ్ విప్ డికోట శ్రీకాంత్ రెడ్డి 

రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి  అన్ని ప్రాంతాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో తన పార్టీ ఉనికి కోల్పోతామన్న భయంతో చంద్రబాబు, తనకు 15 శాతం లోపు సీట్లు మాత్రమే వచ్చాయని తెలిసి, ఇక ఫేక్ వెబ్ సైట్లు పెట్టుకుని ప్రచారం చేసుకునే పరిస్థితికి దిగజారాడు. దీంతో ఫేక్ ఎవరో, ఫేక్ పార్టీ ఎవరిదో తేలిపోయిందని  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి   స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబు తీరుపై విరుచుకుపడ్డారు. శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే…

2019 జనరల్ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు వైయస్ఆర్సీపీకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా పంచాయితీ ఎన్నికల్లో వేయలేదు, ఎందుకంటే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని ప్రజలకు బాగా అర్థమైంది.  కాబట్టే నిన్నటి వరకు నమ్ముకున్న ఎన్నికల కమిషనర్‌ను నమ్మటం లేదంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. గతంలో ఈవీఎంల వల్ల ఓడామని చెప్పారు. ఇప్పుడు బ్యాలెట్‌ ఎన్నికలు అయినా.. ఈ సారి ఎందుకు ఓడారంటే… చీకట్లో లెక్కపెట్టారంటూ సిగ్గులేని వాదనలు చంద్రబాబు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ఓటమి నుంచి డైవర్ట్‌ చేయటానికి తండ్రీ కొడుకులు చెత్త నాటకం ఆడుతున్నారు.

మొన్నటివరకు నిమ్మగడ్డను ఇంద్రుడు-చంద్రుడు అని పొగిడిన టీడీపీ, ఎల్లో మీడియా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎక్కడ ఆగాయో, అక్కడి నుంచి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రకటనను వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అదే జరుగుతోంది. ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడ నుంచి నిర్వహించాల్సిందిగా సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత ఇందులో మొదటి నుంచీ నిర్వహించాలని వాదన చేయడమే దిగజారుడుతనం. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో కూడా నిమ్మగడ్డ ఇదే విషయాన్ని చెప్పారు.  రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియా ఈ రెండు కూడా చంద్రబాబు ఏం చెబితే అదే మాట్లాడేందుకు అలవాటు పడ్డారు కాబట్టి అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ ఎందుకు ప్రజాదరణ కోల్పోతుందన్న ఆలోచన చంద్రబాబు చేయటం లేదు. ఎప్పుడూ ఫేక్ మాటలు, ఫేక్ చేష్టలతో తాత్కాలికంగా ప్రజలను ఎలా ఏమార్చాలని చంద్రబాబు చూస్తున్నాడు.

ఈరోజు హిందూ పత్రికను చూస్తే ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గం కుప్పంలో నామినేషన్లు వేయించారన్నది ఆ పత్రిక వారికి గొప్ప వార్తగా కనిపించింది. బహుశా టీడీపీ వారు, వారికి అనుకూలంగా ఉండే కొద్ది మంది మీడియా వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఫలానా ఎమ్మెల్యే గెలిచింది, ఫలానా ఎంపీ గెలిచింది అని రాసే అవకాశం లేదు కాబట్టి, అన్నిచోట్ల నామినేషన్లు వేయగలిగారు, ఫలానా వార్డులో టీడీపీకి మెజార్టీ వచ్చింది అని ఆనందపడే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నిచోట్ల గెలిచారో చెప్పే పరిస్థితి  ఎటూ ఉండదని అర్థమవుతుంది.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికొస్తే.. విశాఖలో పల్లా శ్రీనివాస్ కు కరోనా వచ్చిందని, దాన్నుంచి కోలుకున్న ఆయన చాలా బలహీనంగా ఉన్నారని అచ్చెన్నాయుడే చెప్పాడు. మరి అంత బలహీనంగా ఉన్న శ్రీనివాస్ ను మానవతా ధృక్పథంతో దీక్ష మాన్పించి, ఆసుపత్రిలో చేర్పించడం ఏ రకంగా తప్పో చంద్రబాబే చెప్పాలి. దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంత బలహీనంగా ఉన్న పల్లా శ్రీనివాస్ ను నిరాహార దీక్షకు కూర్చోబెట్టే బదులు, తన కొడుకును లేదా ఎంవీవీఎస్ మూర్తి మనవడ్ని కూర్చోబెట్టవచ్చు కదా.. ఆ పని ఎందుకు చేయలేదు..?

అమరావతి నుంచి రైతుల్ని విశాఖకు తీసుకువెళ్ళి వారితో జై కొట్టించానని చంద్రబాబు చెబుతున్నాడు. విశాఖ వాసులు కానివ్వండి, రాయలసీమ వాసులు కానివ్వండి.. మేమంతా అమరావతిలో శాసన రాజధాని  ఉంటే బాగుంటుందని, అక్కడ ఉండటానికి మేం వ్యతిరేకం కాదు, అమరావతి కూడా మాదే అని చెప్పాం.  కానీ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి వీల్లేదంటున్న చంద్రబాబు, ఆయన కొడుకు విశాఖలో ఎలా అడుగు పెడతారు..? అమరావతిలోనే అన్నీ ఉండాలంటున్న వారిని విశాఖ ఎలా తీసుకెళతారు..? ఈ విషయాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.

విశాఖ ప్రైవేటీకరణ అంశం ఇప్పటికిప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం కాదు. అది 2014లోనే, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కేబినెట్ మంత్రులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం గా ఉన్నప్పుడే.. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు అంటూ అన్ని జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇలా 2012 నుంచి 2019 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి వార్తలు వస్తే.. చంద్రబాబు అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు. ఈరోజుకీ ప్రధాని మోడీకి చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేకపోతున్నాడు. దీనికి కారణాలేమిటి..? చంద్రబాబుకు ఎందుకు భయమో ప్రజలకు చెప్పాలి.

ఎన్నికల కమిషన్ కు సంబంధించి వ్యవహారాన్ని, సంబంధం లేకపోయినా కేంద్ర మంత్రులకు, ప్రధాన మంత్రికి.. మరొకరికి పదుల కొద్దీ లేఖలు రాసే చంద్రబాబు నాయుడు..  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి జాతీయ పత్రికల్లో అన్ని వార్తలు వచ్చినా ఎందుకు ఒక్క లేక రాయలేదో సమాధానం చెప్పాలి. ఇది గూడు పుఠానీ కాదా..?

చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ ను ప్రభుత్వం అమ్మితే ఊరుకుంటారా.. ? అలానే కేంద్ర  ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా అమ్మగలదా..? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతున్నారు. అలాగే, విశాఖ ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు వంటివి అమ్మాలనుకుంటే అమ్మగలమా.. అవి కేంద్ర ప్రభుత్వానివి. వాటి ఆస్తుల్ని ఎవరు అమ్మగలుగుతారు? కేంద్రమే కదా? ముఖ్యమంత్రి జగన్  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధానికి లేఖ రాస్తూ, దానిని కాపాడేందుకు మూడు ప్రత్యామ్నాయాలను సూచించారు. అలానే మా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి  ఈ నెల 20న విశాఖపట్నంలో 25 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టబోతున్నారు. విశాఖ ఉక్కు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు.

ఎప్పుడూ నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబుకు అలవాటు.  ఇటువంటి రాజకీయాలు చేయడం వల్లే, రాజకీయాలంటేనే ప్రజల్లో అసహ్యం వేసే పరిస్థితికి తీసుకొచ్చింది చంద్రబాబే. పోస్కో కంపెనీ ప్రతినిధులతో అనేక సార్లు కలిసింది చంద్రబాబు కాదా.. అది టీడీపీ అనుకూల మీడియాలో కూడా వార్తలు రాలేదా..?

– చంద్రబాబు నాయుడు ఒక మనిషి లా కూడా మాట్లాడటం లేదు.. కేవలం రాజకీయం కోసమే అన్నట్టు మాట్లాడుతున్నాడు.
మంగళగిలో ఓడిపోయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం కూడా గెలిపించుకోలేని వ్యక్తులు.. గాడిదలు అని మాట్లాడుతున్నారు. అంతకంటే ఎక్కువగానే మేం మాట్లాడగలం. కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థల్ని ఇష్టారాజ్యంగా తెగనమ్మింది చంద్రబాబు కాదా.. ?
1999-2004 వరకు దేశవ్యాప్తంగా 84 సంస్థలను ప్రైవేటీకరిస్తే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 54 సంస్థలను చంద్రబాబు తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కట్టబెట్టేశారు. అందులో ఆల్విన్, రిపబ్లిక్‌ ఫోర్జ్, నిజాం సుగర్స్, పాలేరు సుగర్స్, నూలు మిల్లులు, పంచదార ఫ్యాక్టరీలు… ఒకటేమిటి చాలా ఉన్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు. ప్రధానిని కలవటానికి కూడా అపాయింట్ మెంటు కోరారు. ఇంకా స్టీల్ ప్లాంట్  కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ఏమి చేయాలో అవన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం సంబంధం లేని అంశాల్లో ఎవరెవరికో లెటర్లు రాస్తారు, కానీ రాయాల్సిన వారికి మాత్రం రాయటం లేదు. ప్రధాని మోడీ గారికి లేఖ రాస్తే..  జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయం. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదు. మాట మీద నిలబడడు. చంద్రబాబు మాటలే ఫేక్.. ఆర్టీసీని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలని చూస్తే… ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఒక కార్పోరేషన్ గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ గారు.. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయమని ఎక్కడైనా చెబుతారా..? అని ప్రశ్నించారు.