ఎంపీలకు చెప్పకుండానే ఢిల్లీకి వెళతారా?

685

సోము తీరుపై బీజేపీ సీనియర్ల ఫైర్
నాయకత్వం తీరుపై ఎంపీల అసంతృప్తి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పటికే మినీ కోర్‌కమిటీలో స్థానం లేకుండా చేసిన ఎంపీలను, ఇప్పుడు ఢిల్లీ పర్యటనలకూ దూరంగా ఉంచిన వైనంపై ఏపీ బీజేపీ సీనియర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో తాజాగా జరుగుతున్న ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలు లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై అటు ఎంపీలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ వ్యవహారంగా మారుతున్నందున, దానిపై కేంద్రం పునరాలోచన చేయాలంటూ సోము ఆధ్వర్యంలోని ఓ ప్రతినిధి బృందం డిల్లీకి వెళ్లింది. ఆమేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మురళీధరన్‌ను కేంద్రమాజీ మంత్రి పురందీశ్వరి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఆంధ్రుల మనోభావాలు గౌరవించాలని వారు కోరగా, వారు  ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. పావుగంటలో వారి భేటీ ముగిసింది. అటు ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫోన్ చేసి, విశాఖ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల ఇదే అంశంపై రాష్ట్ర నేతలు నిర్మలా సీతారామన్‌కు కలిసిన సందర్భంలో.. తాను ఏమీ చేయలేనని, ప్రధాని పరిథిలో ఉన్న ఈ అంశంపై తానెలాంటి హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు. నద్దాను కలసిన సందర్భంలో ఫొటోల కోసం ఆయన మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా, ఇప్పటిదాకా ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు.

ఈ మొత్తం వ్యవహారంలో పార్టీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌ను దూరంగా ఉండటం చర్చనీయాంశమయింది. సహజంగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్లే సందర్భాల్లో ఆయా పార్టీల ఎంపీలను, రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకత్వాలు తమ వెంట తీసుకువెళుతుంటాయి. కానీ, సోము వీర్రాజు మాత్రం..  అసలు వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, ఎంపిక చేసుకున్న కొద్దిమంది రాష్ట్ర నేతలను తీసుకువెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. చివరకు ఢిల్లీలో జరిగే రాష్ట్ర నేతల పర్యటనలకు దిశానిర్దేశం చేసే,  ఎంపీ జీవీఎల్ కూడా కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏపీలో మాత్రమే మినీ కోర్ కమిటీ-కోర్ కమిటీ అని రెండు కమిటీలను ఏర్పాటుచేశారు. దీనికి కేంద్ర నాయకత్వం అనుమతి ఉందా? లేక అధ్యక్షుడు, ఇన్చార్జి తీసుకున్న సొంత నిర్ణయమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలకమైన మినీ కోర్‌కమిటీలో ఎంపీలకు స్థానం లేకుండా చేసిన వైనంపై, ఇప్పటికే ఎంపీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది తమను అవమానించడంగానే భావిస్తున్నారు. రాష్ట్ర నాయక్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఎంపీలు ప్రశ్నిస్తున్నందుకే, వారిని మినీ కోర్‌కమిటీ నుంచి తప్పించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోనీ ఎన్నికల ప్రచారంలో ఎంపీలంతా  బిజీగా ఉన్నారనుకున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం ఎంపీలు, మాజీ మంత్రులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దానితో వారంతా ఖాళీగానే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ఎంపీలు బిజీగా ఉన్నారని చెప్పి తప్పించుకునే అవకాశం లేదంటున్నారు. వారిని తీసుకువెళ్లడం ఇష్టం లేకనే, రాష్ట్ర నాయకత్వం ఎంపీలను దూరంగా ఉంచిందని సీనియర్లు చెబుతున్నారు.

అసలు ప్రతినిధుల బృందం ఎంపికపై సోము ఎంచుకున్న ప్రాతిపదికనే విమర్శలకు గురవుతోంది. పార్టీలో ప్రధాన కార్యదర్శులు, మాజీ మంత్రులు ఉన్నప్పటికీ,  కొందరినే తీసుకువెళ్లడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన వారిని ఎంపిక చేశారన్న చర్చ జరుగుతోంది. ఇంతచేసినా సోము బృందం, కేంద్రం నుంచి ఎలాంటి విస్పష్టమైన హామీ సాధించకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు నద్దా కలిసినప్పటికీ, ఆయన ఎలాంటి హామీ ఇవ్వకపోగా కనీసం ఫొటోలకు మీడియాను కూడా అనుమతించలేదు. దీన్నిబట్టి  ఢిల్లీకి వెళ్లి, తమ నాయకత్వం ఏం సాధించిందో అర్ధం కావడం లే దని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.