రగలించని విశాఖ ఉక్కు సెంటి‘మంట’

306

తెలంగాణ ఉద్యమ స్థాయి స్ఫూర్తి ఏదీ?
 రాజకీయాల కోసమే రాజీనామాల రగడ
( మార్తి సుబ్రహ్మణ్యం)

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పిడికిలి బిగించి, ఏకకంఠంతో నినదించిన ఉత్తరాంధ్ర.. ఇప్పుడు అదే ఉక్కు ప్రైవేటుపరం అవుతున్నా, నెత్తురు ఉడకకుండా చైతన్యరహితంగా పడిఉండటం విస్మయపరుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో యావత్ తెలంగాణ సమాజాన్ని రోడ్డెక్కించిన ఆ నినాదం, ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నెరవేర్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా తమ పదవులను త్యాగం చేసి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించారు. పదవులపై ప్రేమ ఉన్న ఎమ్మెల్యేలు కూడా, ఉద్యమ వేడికి తాళలేక రాజీనామా చేయక తప్పని అనివార్య పరిస్థితి అప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ సెంటిమెంట్ నాడు పార్టీలకు మంట పుట్టించింది.

ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం జరుగుతున్న ఉద్యమం మాత్రం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఒక్క శాతం కూడా చాటకపోవడమే విస్మయం కలిగిస్తోంది. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా పర్వానికి తెరలేపి, మిగిలిన ప్రజాప్రతినిధులకు ఒక దారి చూపారు. నిజానికి టీడీపీలో ఉండాలా? వద్దా? అన్న తర్నభర్జన తో ఇప్పటికే,  అటు బీజేపీ ఇటు వైసీపీ గడప తొక్కిన గంటాకు, విశాఖ ఉక్కు వ్యవహారం గొప్ప మేలు చేసింది. ఆయన రాజీనామాతో రాజకీయ భూకంపం రాకపోయినా, మిగిలిన వారికి స్ఫూర్తి కలిగించింది. గంటా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయకముందు, తాను కూడా అవసరమైతే ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేస్తానని విశాఖ వైసీపీ ఎంపి సత్యనారాయణ ప్రకటించారు. అయితే ఆ ‘అవసరం’ ఎప్పుడన్నది ఆయన చెప్పలేదు. గంటా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేసినప్పటికీ, విశాఖ ఎంపీ మాత్రం తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించడం లేదు. అంటే.. రాజీనామాలు,  రాజకీయ రగడ కోసమేనని స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గంటా రాజీనామాతో, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు నైతిక-రాజకీయ సంకటంలో పడ్డారు. అయితే ప్రజలు మాత్రం విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేయాలని తెలంగాణ సమాజం మాదిరిగా, ఇంకా వారి ఇళ్ల ముందు ధర్నాలు చేసేంత స్థాయికి, ఆ సెంటిమెంట్ రగిలినట్లు కనిపించడం లేదు. రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయిన మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్, విశాఖ ఉక్కు పుణ్యాన మళ్లీ తెరపైకి వచ్చారు. లక్ష్యసాధన కోసం ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అటు టీడీపీ సైతం విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఎంపీలందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి, ఉద్యమంలో కలసి రావాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాజాగా డిమాండ్ చేశారు.

మరోవైపు సీఎం జగన్ కూడా విశాఖ ఉక్కును కాపాడాలని ప్రధానికి లేఖ రాశారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగనే, విశాఖ కేంద్రంగా ఉద్యమం కొనసాగుతోంది. అయితే అది ఆశించిన స్ధాయిలో ఉత్తరాంధ్రకు విస్తరించకపోవడం ప్రస్తావనార్హం. తెలంగాణ ఉద్యమ స్థాయి వేడి ఇంకా రాజుకోకపోవడం వల్ల,  ఎమ్మెల్యేలు రాజీనామాలకు దూరంగా ఉన్నారు. చలసాని శ్రీనివాస్ పిలుపు ఇచ్చినట్లు ప్రజలు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేసి ఉద్యమంలో కలసిరావాలని నినదించేంత చైతన్యం,  ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చినట్లు లేదు. ఈ విషయంలో ఆంధ్ర ప్రజల చైతన్యాన్ని తెలంగాణ సమాజంతో పోల్చుకోవడం అత్యాశనే అవుతుంది. ఉత్తరాంధ్రలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స వంటి వారు ప్రాతినిధ్యం విహ స్తున్నారు. వీటికిమించి మూడు రాజధానుల కాంక్షతో, విశాఖను క్యాపిటల్‌గా మార్చేందుకు పరితపిస్తున్న వైసీపీకి, విశాఖ ఉద్యమం కచ్చితంగా తలనొప్పి వ్యవహారమే. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, విశాఖ ఉక్కు ప్రధాన ప్రచారాస్త్రం కానుండటమే దానికి కారణం. ప్రస్తుత ఉద్యమం.. ప్రజల సెంటిమెంట్‌గా మారుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉక్కు ప్యాక్టరీ కార్మికులే రిలే నిరాహారదీక్షలు చే స్తుండటం, వారికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడం వరకే ఉద్యమం పరిమితమవుతోంది. టీడీపీ నేత పల్లా  శ్రీనివాసరావు ఒక్కరే ఒకడుగు ముందుకేసి, ధైర్యంగా  ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. దానికీ ఆశించినంత మద్దతు వ్యక్తం కావడం లేదు. ప్రజల్లో కూడా నాటిరోజుల్లో మాదిరిగా, భావోద్వేగం ఎక్కడా కనిపించడం లేదు. రక్తం మరగడం లేదు. సాధించి తెచ్చుకున్న ఫ్యాక్టరీ దూరమయిపోతున్నా నిలబెట్టుకోవాలన్న కసి కనిపించడం లేదు. రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లయిన ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్ధి లోకం కూడా, చేవచచ్చి చేష్టలుడిగిపోవడమే ఆశ్చర్యం. అందుకే బహుశా వైసీపీ సర్కారు కూడా, విశాఖ వైపు సీరియస్‌గా చూడటం లేదనిపిస్తోంది.