‘పాత్ర‌త క‌లిగిన నాయ‌కుల‌కు గౌరవం’

136

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (న్యూస్‌టైమ్): దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశానికి విశేష‌మైనటువంటి తోడ్పాటును అందించిన క‌థానాయ‌కుల, క‌థానాయిక‌ల తోడ్పాటును స్మ‌రించుకోవ‌డం మరింత ముఖ్య‌ం అయిపోతుంది అని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. భార‌త‌దేశం కోసం, భార‌తీయ‌త కోసం స‌ర్వ‌స్వాన్ని త్యాగం చేసిన‌ వారికి చ‌రిత్ర పుస్త‌కాలలో ఇవ్వ‌వ‌ల‌సినంత గౌర‌వాన్ని ఇవ్వ‌డం జరుగలేదు అంటూ ఆయ‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు. ఈ అపసవ్యాలను, భార‌త‌దేశ చ‌రిత్ర ర‌చ‌యిత‌ల ద్వారా దేశ చ‌రిత్ర నిర్మాత‌లకు జ‌రిగిన అన్యాయాన్ని మ‌నం మ‌న స్వాతంత్య్ర 75వ సంవ‌త్స‌రంలోకి ప్రవేశించనున్న ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం స‌రిదిద్ద‌డం జ‌రుగుతున్నద‌ని ఆయ‌న అన్నారు. వారి తోడ్పాటును ఈ దశలో గుర్తుకు తెచ్చుకోవ‌డం అధిక ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొంటుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మంగ‌ళ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఉత్త‌రప్ర‌దేశ్‌లోని బహ్ రాయిచ్‌‌లో చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నులకు, మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మారకానికి ప్రధానమంత్రి శంకుస్థాప‌న చేసిన తరువాత ప్రసంగించారు.

భార‌త‌దేశం చ‌రిత్ర అంటే అది వల‌స‌వాద శ‌క్తులు లిఖించిన చ‌రిత్రో, లేదా వ‌లస‌వాద మ‌న‌స్త‌త్వం ఉన్న‌టువంటి శ‌క్తులు రాసిన చ‌రిత్రో మాత్రమే కాదు అంటూ ప్ర‌ధానమంత్రి నొక్కి చెప్పారు. భారతదేశం చరిత్ర ఏది అంటే అది సామాన్య ప్రజానీకం వారి జాన‌ప‌ద సాహిత్యంలో పెంచి పోషించుకొన్న‌ది, తరాల త‌ర‌బ‌డి ముందుకు తీసుకుపోయినటువంటిదీనూ అని ఆయ‌న అన్నారు. ఆజాద్ హింద్ ప్ర‌భుత్వం తొలి ప్ర‌ధాని నేతాజీ సుభాశ్ చంద్ర బోస్‌కు ఆయ‌న పాత్రత ప్ర‌కారం ల‌భించ‌వ‌ల‌సిన స్థానాన్ని ఇవ్వ‌డం జ‌రిగిందా? అంటూ ప్రధానమంత్రి ప్ర‌శ్నించారు. నేతాజీ గుర్తింపును ఎర్ర‌ కోట నుంచి అండ‌మాన్ నికోబార్ వర‌కు బలోపేతం చేయ‌డం ద్వారా ఆయ‌నకు మేము గౌర‌వాన్ని ఇచ్చామ‌ని మోదీ అన్నారు.

అదే విధంగా 500కు పైగా సంస్థానాలను ఒక్క‌టిగా కలిపిన స‌ర్ దార్ ప‌టేల్‌కు ఇచ్చిన ఆదరణ కూడా అందరికీ తెలిసినటువంటిదే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇవాళ, ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన విగ్ర‌హం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స‌ర్ దార్ ప‌టేల్ విగ్ర‌హ‌మే అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగ కీల‌క శిల్పి, దోపిడికి గురైన వర్గాల, ఆద‌ర‌ణ‌కు నోచుకోని వర్గాల, అణచివేత బారిన ప‌డ్డ వ‌ర్గాల వారి గొంతుకగా ఉంటూ వ‌చ్చిన బాబా సాహెబ్ ఆంబేడ్ కర్‌ను ఎప్ప‌టికీ రాజ‌కీయ కోణం నుంచే చూడ‌టం జ‌రిగింది. ప్ర‌స్తుతం, భార‌త‌దేశం మొద‌లుకొని ఇంగ్లండ్ వ‌ర‌కు డాక్ట‌ర్ ఆంబేడ్కర్‌తో ముడి ప‌డి వున్న అన్ని ప్ర‌దేశాలను ‘పంచ్ తీర్థ్’గా అభివృద్ధిప‌ర‌చ‌డం జ‌రుగుతున్నది. ‘‘వేరు వేరు కార‌ణాల వ‌ల్ల గుర్తింపున‌కు నోచుకోని వ్య‌క్తులు లెక్కించ‌లేనంత మంది ఉన్నారు. చౌరీ చౌరా ప‌రాక్ర‌మ‌శాలుల విష‌యంలో ఏమి జ‌రిగిందో మ‌నం మ‌ర‌చిపోగ‌ల‌మా?’’ అంటూ ప్ర‌ధాన మంత్రి ప్రశ్నించారు.

భార‌తీయ‌త‌ను ప‌రిర‌క్షించ‌డానికి మ‌హారాజా సుహేల్‌ దేవ్ అందించిన తోడ్పాటును సైతం అదే విధంగా అల‌క్ష్యం చేయ‌డ‌ం జరిగిందని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పాఠ్య పుస్తకాలలో మ‌హారాజా సుహేల్ దేవ్‌ను అలక్ష్యం చేసినప్పటికీ కూడాను అవ‌ధ్‌, తరాయీ, పూర్వాంచ‌ల్ జాన‌ప‌ద గాథల ద్వారా ఆయన ప్ర‌జ‌ల మ‌న‌స్సులలో స‌జీవంగా కొలువుదీరి ఉన్నారన్నారు. ఒక సూక్ష్మ బుద్ధి క‌లిగిన‌టువంటి పాలకునిగా, అభివృద్ధి ప్ర‌ధానమైన దృష్టి క‌లిగిన‌టువంటి పాల‌కునిగా ఆయన అందించిన తోడ్పాటును ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చారు.