లెక్కల లొల్లికి మున్సి‘పోల్స్’తో తెర!

350

పార్టీ గుర్తులతోనే ఎన్నికలు
ఎవరి సత్తా ఏమిటో తేల్చనున్న మున్సిపల్ ఎన్నికలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన స్థానాల సంఖ్యపై వైసీపీ-టీడీపీ చేసుకుంటున్న సవాళ్లకు మున్సిపల్ ఎన్నికలు సమాధానం చెప్పనున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో తాము 40 శాతం విజయం సాధించామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబితే, వైసీపీ 82 శాతం విజయం సాధించిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మధ్యలో జనసేన సైతం తాము 18 శాతం సాధించామని ప్రకటించింది. అటు వైసీపీ-టీడీపీకి చెందిన అనుకూల మీడియా సైతం ఎవరికి అనుకూలంగా వారు సంఖ్యలు ప్రకటించాయి. దీనితో ఎవరు లెక్కలు నిజమో తెలియక ప్రజలు గందరగోళంలో పడ్డారు.

పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోవడం, పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో ఈ గందరగోళం మొదలయింది. పార్టీ గుర్తులు లేకపోయినా రాజకీయ పార్టీలు తమ నేతలనే అభ్యర్ధులుగా బరిలోకి దింపారు. ఆ ప్రకారంగా వారు గెలిచిన స్థానాలను లెక్కించి, ఆ సంఖ్యను మీడియాకు వెల్లడించాయి. కానీ, అందులో కూడా పోటా పోటీ మొదలయి తాము సంతృప్తికర స్థానాలు సాధించామని ప్రతిపక్ష టీడీపీ ప్రచారం చేసుకుంటే, అసలు 82 శాతం సాధిస్తే టీడీపీకి అంత శాతం ఓట్లు ఎలా వస్తాయని అధికార వైసీపీ ఎదురుదాడి చేసింది. పంచాయితీ ఎన్నికల తొలి దశ ఫలితాల్లో వైసీపీ  2640 (81.25 శాతం), టీడీపీ 508 ( 15.63 శాతం) బీజేపీ-జనసేన 46 (1.41 శాతం) ఇతరులు 47 (1.44 శాతం) విజయం సాధించాయని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి ప్రకటించారు. ఇక రెండవ దశ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ  2578 (79.51 శాతం), టీడీపీ 531 (16.37 శాతం) బీజేపీ-జనసేన 32 (0.98 శాతం), ఇతరులు 101 (3.11శాతం) విజయం సాధించారని ఆయన వెల్లడించారు.  స్వతంత్రంగా గెలిచిన వారిలో కూడా వైసీపీ అభ్యర్ధులే 90 శాతం మంది ఉంటారన్నది నాగిరెడ్డి విశ్లేషణ. వైసీపీలో మంచి విశ్లేషకుడిగా పేరున్న నాగిరెడ్డి చేసిన వివరణ ఆ పార్టీకి స్థానికంగా ఉన్న పట్టును స్పష్టం చేసింది. అయితే దీనిని టీడీపీ ఖండించింది. తమ పార్టీ 40 శాతం ఓట్లు సాథించిందని వాదించింది.

ఈ నేపథ్యంలో మార్చి 10న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు ఎన్నికలు ప్రకటించడంతో ఈ లెక్కల గందరగోళానికి తెరపడనుంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండటమే దానికి కారణం. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో స్వయంగా ఎన్నికల కమిషనే ప్రకటిస్తుంది. దానితో లెక్కలపై ఎవరెంత ప్రచారం చేసుకున్నా, ఉపయోగం ఉండదు.

నిజానికి పార్టీ గుర్తులు లేని పంచాయితీ ఎన్నికలకు, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలకు చాలా తేడా ఉంది. పంచాయితీల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారిని ఏ పార్టీ తమ ఖాతాలో వేసుకునే వీలుండదు.  మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత సత్తా ఉందో తేలిపోతుంది. ఒకరకంగా ఇది రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష. పంచాయితీల మాదిరిగా కాకిలెక్కలెక్కలు చెప్పే అవకాశం కూడా ఉండదు. ప్రధాన పార్టీలయిన వైసీపీ-టీడీపీలకు మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా అవరోధాలు ఉండబోవు. పట్టణ ప్రాంతాలు కాబట్టి, పంచాయితీల మాదిరిగా నామినేషన్లు అడ్డుకునే అవకాశాలు ఉండవు.

ఎటొచ్చీ బీజేపీ-జనసేన పార్టీలకే ఈ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పటిదాకా తాము పోటీ చేసిన స్థానాలు, గెలిచిన సంఖ్యను ఇప్పటిదాకా ప్రకటించలేదు. పోటీ చేసేందుకు తగినంతమంది అభ్యర్ధులు లేని దుస్థితే దానికి కారణం. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం, ఆ పార్టీలు పోటీ చేసే స్థానాలు, గెలిచిన స్థానాల సంఖ్య కూడా తెలిసిపోతుంది. మొత్తానికి గెలుపు లెక్కల గందరగోళానికి మున్సిపల్ ఎన్నికలు తెరదించి, ‘లోకల్ హీరో’లెవరో తేల్చనున్నాయి.